


Best Web Hosting Provider In India 2024

Congress Vs BRS : ‘నీ సవాల్ స్వీకరిస్తున్నా – టైమ్, ప్లేస్ చెప్పు – సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీశ్ రావ్ కౌంటర్..!
పదేళ్ల పాలనపై కేసీఆర్, కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్ పై మాజీ మంత్రి హరీశ్ రావ్ స్పందించారు. 14 నెలల కాంగ్రెస్ పాలన మీద తాను చర్చకు సిద్ధమని కౌంటర్ ఇచ్చారు. “చర్చ ఏ రోజు చర్చ చేద్దాం, ఎక్కడ చేద్దాం.. నువ్వే చెప్పు, చెప్పిన సమయానికి వస్తా” అంటూ ఘాటుగా బదులిచ్చారు.
పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్చగా తరలించుకపోతుంటే ఆపడం చేతగాక… బీఆర్ఎస్ మీద రంకెలేయడమేంటని ప్రశ్నించారు.
పాలమూరుకు ద్రోహం చేసింది మీరే…
టీడీపీ, కాంగ్రెస్ పాలమూరుకు తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి. ఇదిచరిత్ర చెపుతున్న సత్యం. పాలమూరును దత్తత తీసుకున్న అని చెబుతూనే పడావు పెట్టిండు నీ గురువు చంద్రబాబు. పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి… పాలమూరు ప్రజల బతుకుల్లో నిప్పులు పోసింది కాంగ్రెస్. పాలమూరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్, టీడీపీలదే. ఆ 2 పార్టీల్లో ఉన్న రేవంత్ రెడ్డికి ఆ రెండు పాపాల్లో వాటా ఉంది. నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారుతుందా…? నీ వక్రబుద్ధి ప్రజలకు తెలియకుండా పోతుందా..?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.
“పోతిరెడ్డిపాడు నీళ్లు తరలిస్తుంటే హారతులు ఇచ్చి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఊడిగం చేసింది కాంగ్రెస్ నేతలే. అలాంటి చరిత్ర మరిచి రేవంత్ మాట్లాడటం గురివింద సామెత ను గుర్తు చేస్తోంది. చంద్రబాబుకు ఊడిగం చేసినా మోదీకి భయపడి బడే భాయ్ అన్నా అది రేవంత్ రెడ్డికే సాధ్యం. రేవంత్ కు నీటి విలువ తెలియదు. నోటి విలువ తెలియదు. తెలిసింది ఒక్క అవినీతి నోట్ల విలువ మాత్రమే. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డుపడుతూ కేసులు వేయించిన వ్యక్తివి నువ్వే” అని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి నారాయణపేట కొడంగల్ రైతుల కాళ్లు కడిగేవాళ్లమని హరీశ్ రావు అన్నారు. వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని గుర్తు చేశారు.
చర్చకు సిద్ధంగా ఉన్నా.. ప్లేస్ చెప్పు…
“పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరులో నీళ్లు అందించిన ఘనత మాది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తికాగానే మరో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని నువ్వు కేసీఆర్ మీద రంకెలేస్తావా..? సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. 14 నెలల్లో ఒక్క చెక్ డాం కూడా కట్టని ముఖ్యమంత్రివి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడుతావా..? నీ 14 నెలల పాలన మీద చర్చకు నేను సిద్ధం. నీ సవాలును స్వీకరిస్తున్నా. ఏ రోజు చర్చ చేద్దాము, ఎక్కడ చర్చ చేద్దామో నువ్వే చెప్పు. నువ్వు చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి వస్తా. నీ కొడంగల్ నియోజకవర్గమైన సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తా” అంటూ హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి ఏమన్నారంటే..?
ఇవాళ నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని విమర్శించారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలన సరిగా లేదని విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. “10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. 12 ఏళ్ల నుంచి మోడీ ప్రధానిగా ఉన్నారు. 12 నెలలుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చర్చకు వస్తే సీఎం నేను సిద్ధం. గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం” అంటూ సవాల్ విసిరారు.
సంబంధిత కథనం
టాపిక్