Magnesium and Heart: ఈ లక్షణాలు కనిపిస్తే మెగ్నీషియం లోపం ఉన్నట్టే, అంటే గుండె సమస్యలు త్వరగా వచ్చేస్తాయి

Best Web Hosting Provider In India 2024

Magnesium and Heart: ఈ లక్షణాలు కనిపిస్తే మెగ్నీషియం లోపం ఉన్నట్టే, అంటే గుండె సమస్యలు త్వరగా వచ్చేస్తాయి

Haritha Chappa HT Telugu
Feb 25, 2025 04:30 PM IST

Magnesium and Heart: కొన్ని ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు లోపిస్తే గుండె సమస్యలు త్వరగా వచ్చేస్తాయి. అలాంటి పోషకాలలో మెగ్నీషియం ఒకటి. మెగ్నీషియం లోపం వల్ల గుండె త్వరగా ప్రభావితం అవుతుంది.

మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు
మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు (Science Photo Library)

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పొటాషియం, మెగ్నీషియం ఎంతో ముఖ్యమైనవి. ఈ రెండు పోషకాలు లోపిస్తే గుండె అదుపుతప్పి అవకాశం ఉంటుంది. క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఈ మూడు కూడా మన శరీరానికి రక్షణ కవచంల్లా పనిచేస్తాయి. కాబట్టి ఇవి అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.

చాలామంది కాల్షియం అధికంగా ఉండే ఆహారం తినడంపైనే దృష్టి పెడతారు. నిజానికి మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారం తినడం ఎంతో ముఖ్యం. ఇది లోపించిన కూడా గుండె సమస్యలు త్వరగా వచ్చేస్తాయి. ఇక్కడ మెగ్నీషియం లోపించడం వల్ల ఎలాంటి ప్రభావాలు గుండెపై పడతాయి, ఎలాంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి అనేవి తెలుసుకుందాం.

మెగ్నీషియం లోపంతో గుండె సమస్యలు

మెగ్నీషియం లోపం అనేది మన గుండెను నిశ్శబ్దంగా ప్రమాదంలోకి తోసేస్తుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉంటే గుండె ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. మన గుండె స్థిరమైన లయను నిర్వహించడానికి అవసరమయ్యే విద్యుత్ సంకేతాలకు మెగ్నీషియం అత్యవసరం. ఎప్పుడైతే మెగ్నీషియం స్థాయిలు పడిపోతాయో విద్యుత్ సంకేతాలకు అంతరాయం కలుగుతాయి. దీనివల్ల హృదయం గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. దీన్ని అరిథ్మియా అంటారు. అప్పుడు తల తిరిగినట్టు, మూర్చ వస్తున్నట్లు అనిపిస్తుంది.

రక్తపోటు పెరిగిపోతుంది

మన రక్తనాళాలకు మెగ్నీషియం కూడా ఎంతో ముఖ్యం. మెగ్నీషియం పుష్కలంగా ఉంటే అవి సంకోచించకుండా సడలించేలా ఉంటాయి. అప్పుడు రక్త ప్రవాహం సులువుగా జరుగుతుంది. ఇప్పుడైతే మెగ్నీషియం తక్కువగా లభిస్తుందో రక్తనాళాలు సంకోచించి ఇరుకుగా మారుతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి అధిక రక్తపోటు వచ్చేలా చేస్తుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటి. కాబట్టి అధిక రక్తపోటు రావడానికి గుండె జబ్బులకు మెగ్నీషియం లోపం కూడా కారణమేనని అర్థం చేసుకోవాలి.

కార్డియోమయోపతి వ్యాధి

మన గుండె కూడా ఒక కండరం వంటిది. మిగతా కండరాల లాగానే ఇది దాని విధులను సమర్థవంతంగా నిర్వహించాలి. దీనికి మెగ్నీషియం ఎంతో అవసరం. మెగ్నీషియం లోపించడం వల్ల గుండెలోని కణజాలాలు బలహీనపడతాయి. దీనివల్ల కార్డియో మయోపతి అనే వ్యాధి రావచ్చు. అంటే గుండె రక్తాన్ని పంపిణీ చేయడంలో సరిగా పనిచేయలేదు. దీనివల్ల మనకు అలసటగా అనిపిస్తుంది. ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది. చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తుంది.

రక్తం గడ్డకట్టదు

మెగ్నీషియం లోపం వల్ల రక్తం గడ్డ కట్టడంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం కొంత మేరకు వచ్చి తర్వాత వెంటనే గడ్డకట్టేస్తుంది. దీనికి మెగ్నీషియం కూడా అవసరమే. తక్కువ మెగ్నీషియం స్థాయిలు ఉన్నవారిలో రక్తం త్వరగా గడ్డ కట్టదు. దీనివల్ల చిన్న చిన్న గాయాలతో అయినా ఎక్కువ రక్తం బయటకు పోయే అవకాశం ఉంటుంది.

మెగ్నీషియం ఉన్న ఆహారాలు

మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. ఇందుకోసం మీరు ప్రతిరోజూ ఆకుకూరలు, తృణధాన్యాలు, బీన్స్, చేపలు, గుమ్మడి గింజలు, వాల్నట్స్, బాదంపప్పులు వంటివి తినేందుకు ప్రయత్నించాలి. అరటి పండ్లు, తొక్కతో వండిన బంగాళదుంపలు, బెండకాయ, బ్రకోలీ వంటి వాటిలో కూడా మెగ్నీషియం ఉంటుంది. క్వినోవా, బ్రౌన్ రైస్, గోధుమల్లో కూడా కొంత మేరకు మెగ్నీషియం లభిస్తుంది. అవిసె గింజలు, చియా గింజలు, టోఫు వంటి వాటిలో కూడా మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024