


Best Web Hosting Provider In India 2024

Telangana student suicide: ఐఐటీ పాట్నాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
Telangana student suicide: ఐఐటీ పాట్నా క్యాంపస్ లో తెలంగాణకు చెందిన బీటెక్ విద్యార్థి ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.
Telangana student suicide: ఐఐటీ పాట్నాలోని అమ్హారా (బిహ్తా) క్యాంపస్ ఆవరణలో బీటెక్ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్) మూడో సంవత్సరం చదువుతున్న తెలంగాణాకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తానుంటున్న హాస్టల్ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.
విద్యార్థుల ఆందోళన
ఈ ఘటన అనంతరం ఐఐటీ పాట్నా క్యాంపస్ లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో, క్యాంపస్ లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. బాధిత విద్యార్థి తెలివైన స్టూడెంట్ అని, ఘటనకు ముందు రోజు మామూలుగా ప్రవర్తించాడని సహ విద్యార్థులు తెలిపారు.
ఉదయం 11.30 గంటలకు..
మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈ ఘటన జరిగిందని, మధ్యాహ్నం 12 గంటలకు ఐఐటీ పాట్నా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ టీఎన్ సింగ్ తో కలిసి అక్కడికి చేరుకున్న పోలీసు బృందం హాస్టల్ సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని గుర్తించారు. పోలీసులు వెంటనే అతన్ని సమీపంలోని నేతాజీ సుభాష్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే, ఆ బాధిత విద్యార్థి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
బాల్కనీ నుంచి పడిపోయి..
అయితే, తెలంగాణాకు చెందిన ఆ విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయని సహ విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఐఐటీ పాట్నా రిజిస్ట్రార్ సంజయ్ కుమార్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. బిటెక్ 3వ సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థి హాస్టల్ గది బాల్కనీ నుండి పడిపోయాడని, సమీప ఆసుపత్రికి తీసుకువెళ్ళారని, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. అయితే, చనిపోయిన విద్యార్థి వివరాలను వెల్లడించలేదు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
ఫొరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకుని శాంపిల్స్ సేకరించారని నగర ఎస్పీ (వెస్ట్) శరత్ ఆర్ఎస్ తెలిపారు. తదుపరి విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్ బృందం బాధితుడి గదిని పరిశీలించి అతని సెల్ ఫోన్, ఇతర గ్యాడ్జెట్లతో సహా మరిన్ని ఆధారాలను సేకరించనుంది. బాధితుడు బస చేసిన హాస్టల్ గదిని కూడా సీజ్ చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్య కేసుగా భావిస్తున్నామని నగర ఎస్పీ తెలిపారు. సెక్యూరిటీ గార్డు వాంగ్మూలం ఆధారంగా అమ్హారా పోలీస్ స్టేషన్లో అసహజ మరణం కేసు నమోదైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.
గతంలో ఏపీ విద్యార్థిని
పాట్నాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)కు చెందిన ఓ విద్యార్థిని గత సంవత్సరం సెప్టెంబర్ లో హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆ యువతి మృతదేహం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది.
సంబంధిత కథనం
టాపిక్