



Best Web Hosting Provider In India 2024

Vemulawada Rajanna: వేములవాడ రాజన్న కు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్… వైభవంగా మహాశివరాత్రి జాతర..
Vemulawada Rajanna: మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివన్నామస్మరణతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
Vemulawada Rajanna: దక్షిణ కాశిగా పేరొందిన వేములవాడలో మహాశివరాత్రి జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టిటిడి డిప్యూటీ ఈవో లోకనాథం, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
రాత్రి నుంచే భక్తుల రద్దీ వేములవాడలో కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మిరమిట్లు గోలిపే విద్యుత్ దీపాలతో వేములవాడ ఆలయం సర్వాంగ సుందరంగా భక్తులను
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని….మంత్రి పొన్నం
తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలు సక్సెస్ కావాలని స్వామి వారి ఆశీస్సులు ఉండాలని రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. వేములవాడ రాజన్న ఎంతో మహిమ గల దేవుడని అన్నారు. దేవాలయ అబివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నామని, మహాశివరాత్రి తర్వాత అభివృద్ది పనులు వేగవంతం చేసి వచ్చే ఏడాది మహాశివరాత్రి నాటికి పనులన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
1998 నుంచి ఆనవాయితీ…
మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు 1998 సంవత్సరం నుంచి సమర్పిస్తున్నారు. గత 27 సంవత్సరాలుగా కొనసాగుతున్న అనవాయితీ ప్రకారం ఈసారి టిటిడి డిప్యూటీ ఈవో లోకనాథం పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ అవకాశం రావడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఆర్టీసీ 778 స్పెషల్ బస్సులు…
మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు టీజీఎస్ఆర్టీసి 778 స్పెషల్ బస్సులను నడుపుతుంది. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈనెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడుపున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి. రాజు తెలిపారు.
మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపద్యంలో ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. వేములవాడలోని బస్టాండ్ కు 443, కట్ట కింద బస్ స్టేషన్ కు 335 బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. వీటికితోడు ఉమ్మడి జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరానికి కూడా అదనపు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు సంస్థ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆర్టీసి అధికారులు ప్రకటించారు.
జాగరణకు ప్రత్యేక ఏర్పాట్లు..
మహాశివరాత్రి సందర్భంగా జాగరణ చేసే భక్తుల కోసం వేములవాడ జాతర గ్రౌండ్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. నిద్రాహారాలు మాని జాగరణ చేసే భక్తులకు వినోదాన్ని అందించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రంతా కళాబృందాలతో సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా 1500 మంది పోలీసులతో పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ప్రకటించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్