



Best Web Hosting Provider In India 2024

Skincare with Flowers: ఈ ఒక్క పువ్వు మీ చర్మ కాంతిని మార్చేస్తుంది, దీనితో ఫేస్ ప్యాక్ వేసుకొని చూడండి
Skincare with Flowers:చర్మాన్ని మెరిపించేందుకు రసాయనాలు ఉన్న కాస్మెటిక్స్ వాడే బదులు.. ఇంట్లోనే కొన్ని రకాల పువ్వులను వినియోగించవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఫ్లవర్ ఫేస్ ప్యాక్ వేసేందుకు ప్రయత్నించండి. ఈ ఫ్లవర్ ఫేస్ ప్యాక్ ను మందార పువ్వుతో చేస్తారు.
మందార పువ్వుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం సహజంగానే మృదువుగా మారి కాంతివంతంగా అవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పూలతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. బయట దొరికే రసాయనాలు కలిపిన ఫేస్ ప్యాక్ తో పోలిస్తే ఇవి సహజమైన మెరుపును ఇస్తాయి. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.
మందార పువ్వుతో అందం
చర్మ సమస్యలను తొలగించుకోవడానికి బయట దొరికే ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి సహజంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్టులను చూపించవు. అలాంటి ఫేస్ ప్యాక్‌లలో మందార పువ్వు ఫేస్ ప్యాక్ ఒకటి. మందార పువ్వులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇంట్లోనే ఒక మొక్క వేసుకుంటే ఎన్నో పువ్వులు కూడా పూస్తాయి. మందార పువ్వులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ.
మందార పువ్వుల పొడితో
మందార పువ్వులను సేకరించి ఎండబెట్టి పొడిలా చేసుకోండి. ఆ పొడిని నిల్వ చేసుకుంటే మీకు నచ్చినప్పుడల్లా ఫేస్ ప్యాక్‌లను వేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ ధరలోనే తయారయ్యే ఫేస్ ప్యాక్. ఇక మందార పువ్వులతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకోండి.
కలబంద జెల్ కలిపి
మందార పువ్వుల పొడిని రెండు స్పూన్లు తీసుకొని ఒక గిన్నెలో వేయండి. అందులో కలబంద జెల్ ను వేసి బాగా కలపండి. అది పేస్టులా తయారవుతుంది. దీన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట పాటు అలా వదిలేయండి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాయండి. ఈ ఫేస్ ప్యాక్ వారానికి ఒకసారి ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరవడం ఖాయం.
రెండు టీ స్పూన్ల మందార పువ్వుల పొడిని ఒక గిన్నెలో వేసి దానికి తగినంత పెరుగును జోడించి బాగా కలపండి. ఇది పేస్ట్ లాగా అవ్వాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత చేతులతోనే వృత్తాకారంలో మసాజ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. చర్మానికి తక్షణ మెరుపుని ఇస్తుంది.
మరొక ఫేస్ ప్యాక్ లో మనము మందార పువ్వుల పొడిని, తేనెను కలిపి తయారు చేస్తాము. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి రెండు టీ స్పూన్ల మందార పొడిని, ఒక టీ స్పూన్ తేనె, ఒక స్పూన్ పాలు వేసి బాగా కలపండి. ఈ మొత్తం మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత ముఖాన్ని పరిశుభ్రంగా కడుగుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉన్న మచ్చలు పోతాయి. వారానికి ఒకటి రెండు సార్లు ఇలా ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయండి. ఇది పొడి చర్మానికి తేమను కూడా అందిస్తుంది.
ముల్తానీ మిట్టి, మందార ఆకుల పొడి కలిపి ఫేస్ ప్యాక్‌ను తయారు చేయవచ్చు. ఇది చర్మానికి లోతుగా శుభ్రపరుస్తుంది. ఒక టీ స్పూన్ మందార పొడి మీ ఒక గిన్నెలో వేయండి. అందులోనే మరొక స్పూన్ ముల్తానీ మిట్టిని వేసి రోజ్ వాటర్‌లో పేస్టులాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు అలా వదిలేయండి. ఇది చర్మ రంద్రాల్లోని మురికిని కూడా తొలగిస్తుంది. చర్మం లోతుగా శుభ్రపడుతుంది.
మందార పువ్వుల ఫేస్ ప్యాక్‌ను అప్పుడప్పుడు వేసుకోవడం వల్ల మీకు ఎంతో మార్పు కనిపిస్తుంది. మీ చర్మం సహజంగా మెరవడం గుర్తిస్తారు.
సంబంధిత కథనం