


Best Web Hosting Provider In India 2024

Micro Retirement: మైక్రో రిటైర్మెంట్‌తో జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న జనరేషన్ జెడ్ యువత, ఏమిటీ మైక్రో రిటైర్మెంట్?
Micro Retirement: జనరేషన్ జెడ్ అంటే 1995 నుండి 2012 మధ్య జన్మించిన వారు. ఇందులో ఎంతో మంది ఇప్పుడు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు వీరు మైక్రో రిటైర్మెంట్ వంటి పద్ధతులతో జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.
రిటైర్మెంట్ అంటే అందరికీ తెలిసిందే. ఉద్యోగంలో పదవీ విరమణ చేసి లేదా రాజీనామా చేసి ఇంటి దగ్గరే ఉండడం. ఇలా పదవీ విరమణ చేయాలంటే అరవై ఏళ్లు రావాలి. అయితే జనరేషన్ జెడ్ యువత మాత్రం కొత్త ట్రెండును తీసుకొచ్చింది. వారు తమ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మైక్రో రిటైర్మెంట్ ను కనిపెట్టింది.
మైక్రో రిటైర్మెంట్ అంటే ఏమిటి?
మైక్రో రిటైర్మెంట్ అంటే వారికి కావాల్సినప్పుడల్లా ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారు. కొన్నాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తారు. తిరిగి మళ్లీ కొత్త ఉద్యోగంలో చేరిపోతారు. దీనివల్ల వారు సంపాదించడంతోపాటు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఉద్యోగంలో చేరి తిరిగి సంపాదన మొదలు పెడుతున్నారు.
ఒకప్పుడు సాంప్రదాయ పదవీ విరమణ మాత్రమే ఉండేది. అంటే 60 ఏళ్లు రాగానే ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసి ఇంట్లోనే మనవళ్లతో, మనవరాళ్లతో గడిపేవారు. కానీ కాలం మారిపోయింది. మైక్రో రిటైర్మెంట్ ట్రెండ్ వచ్చేసింది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
జీవితాన్ని ఆస్వాదించేందుకే..
మైక్రో రిటైర్మెంట్లో భాగంగా కెరీర్ లో అప్పుడప్పుడు బ్రేక్ లు తీసుకుంటారు. ఉద్యోగానికి సెలవు పెడతారు లేదా రాజీనామా చేసేస్తారు. నెల రోజులు నుంచి ఏడాది కాలం వరకు తమకు నచ్చిన పనులు చేసుకుంటారు. అలాగే పనికొచ్చే కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటరు. పర్యాటక ప్రయాణాలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తరువాత కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుని దానిలో చేరిపోతున్నారు. దీనివల్ల వారు సంపాదించడంతోపాటు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు.
మైక్రో రిటైర్మెంట్ కు ఎందుకంత ప్రాధాన్యత పెరిగింది?
ఇప్పటి యువత కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే పనిచేయాలనుకోవడం లేదు. తమ జీవితాన్ని పూర్తిగా తమకు నచ్చినట్టు ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ మైక్రో రిటైర్మెంట్ ఉపాయాన్ని వాడుకుంటున్నారు. చేతినిండా డబ్బులు రాగానే మైక్రో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఆ డబ్బులు కొన్ని రోజుల్లో పూర్తిగా ఖర్చవుతాయనగానే కొత్త ఉద్యోగంలో చేరిపోతున్నారు. ఈ మధ్యకాలంలో తమకు నచ్చిన పనులు చేస్తూ హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు.
అరవై ఏళ్ల తర్వాత తీసుకోవలసిన పదవీ విరమణ ఇప్పుడే యువత అప్పుడప్పుడు ఎందుకు తీసుకుంటోంది అని ఎంతోమందికి సందేహం రావచ్చు. 60 ఏళ్ల తర్వాత జీవితంలో ఆస్వాదించడానికి ఏమీ మిగలదని జనరేషన్ జెడ్ వారి అభిప్రాయం. అందుకే తమ జీవితంలోని బంగారు క్షణాలను ఇప్పుడే ఆనందంగా గడపాలని కోరుకుంటున్నారు. ఇలా మైక్రో రిటైర్మెంట్ పేరుతో తమ జీవితంలో అమూల్యమైన క్షణాలను పోగు చేసుకుంటున్నారు.
రిమోట్‌గా పనిచేస్తూ
నేటి యుగంలో ఇంటర్నెట్, రిమోట్ వర్కింగ్ వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. కాబట్టి యువత ఎక్కడ నుండి అయినా పనిచేయడానికి ఇవి వీలు కల్పిస్తున్నాయి. జనరేషన్ జెడ్ ఈ పద్ధతిని వాడుకుంటూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. రిమోట్ వర్క్ చేస్తూ కొత్త ప్రదేశాలకు ప్రయాణిస్తున్నారు. బ్యాంకు బ్యాలెన్స్‌లు పెంచుకుంటున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్లు తమకు నచ్చినట్టు జీవిస్తున్నారు. తిరిగి కొత్త ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు.
నిరంతరం పనిచేయడం వల్ల యువతలో ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మైక్రో రిటైర్మెంట్ అనేది జనరేషన్ జెడ్ వారికి ఎంతో మేలు చేసేదే. అప్పుడప్పుడు ఇలా దీర్ఘ విరామాలు తీసుకొని తమపై తమ దృష్టి పెట్టుకోవడం వల్ల వారు ఆనందంగా జీవిస్తారు. మరింత శక్తివంతంగా తయారవుతారు.
మైక్రో రిటైర్మెంట్ ఉపయోగాలు ఏమిటి?
అప్పుడప్పుడు ఇలా మైక్రో రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. బర్న్ అవుట్ అయ్యే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. మైక్రో రిటైర్మెంట్లో ఉన్న కాలంలో కొత్త ప్రాంతాలకు ప్రయాణం చేయొచ్చు. కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చు. విభిన్న సంస్కృతలను అర్థం చేసుకోవచ్చు. కావాలంటే కొత్త రంగంలో అడుగుపెట్టి ఉద్యోగాలను సాధించవచ్చు. మైక్రో రిటైర్మెంట్ తీసుకొని తిరిగి కెరీర్ ను ప్రారంభించే యువత కొత్త ఆలోచనలు, వినూత్న ఆసక్తులతో తిరిగి ఉద్యోగాల్లోకి చేరుతున్నారు. వారు మునుపటి కంటే శక్తివంతంగా పనిచేయగలుగుతున్నారు. కాబట్టి మైక్రో రిటైర్మెంట్ వారి ఆరోగ్యం పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది.
సంబంధిత కథనం