


Best Web Hosting Provider In India 2024

AP Employees : సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్, పెట్టుబడి ఎంపిక ఆప్షన్లు..! ఓపీఎస్ అమలు అంతేనా..?
పెన్షన్ ఫండ్, పెట్టుబడి నమూనాల ఎంపిక విషయంలో సీపీఎస్ ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) గురించి డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్‌ను రద్దు చేయాలని… ఓపీఎస్‌ను తిరిగి తీసుకురావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు మారుతున్నా వారి డిమాండ్ నెరవేరలేదు. సీపీఎస్ అమలకు వివిధ రూపాల్లో ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అందువల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.
ఏపీ సర్కార్ తాజా ఉత్తర్వులు…..
తాజాగా సీపీఎస్ అమలులో భాగంగా ఉద్యోగుల పెన్షన్ ఫండ్ ఇన్వెస్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సీపీఎస్ ఉద్యోగులకు వారి ఫండ్‌ను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం. జానకి ఉత్తర్వులు విడుదల చేశారు. ఎంపిక నమూనాకు సంబంధించి పూర్తి వివరాలతో జీవో నెంబర్ 9ను మంగళవారం విడుదల చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు ప్రతినెలా వారి జీతం నుంచి 10 శాతం సొమ్మును కంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ పేరుతో మినహాయిస్తారు. దీనికి ప్రభుత్వం మరో 10 శాతాన్ని కలుపుతుంది.
ఉద్యోగులదే నిర్ణయం….
ఈ మొత్తం సొమ్మును ఇప్పటి వరకు ఎస్‌బీఐ, ఎల్ఐసీ, యూటీఐ పెట్టుబడి ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఉద్యోగి తన ఇష్ట ప్రకారం ప్రైవేట్ పెట్టుబడి సాధానాలతో సహా ఇతర ప్రభుత్వ సాధానాల్లోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఏడాదికి ఒకసారి తమ ఎంపికను మార్చుకోవచ్చు. ఏ పెట్టుబడి సాధానాన్ని ఎంచుకోని ఉద్యోగుల పంఢ్ ను డిఫాల్ట్‌గా ఉన్న ఎల్ఐసీ, యూటీఐ, ఎస్‌బీఐ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు.
తక్కువ మొత్తంలో రిస్క్‌తో రాబడిని ఇష్టపడే ఉద్యోగులు ప్రభుత్వ సెక్యూరిటీలలో 100 శాతం నిధులను పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇచ్చారు. ఎక్కువ రిస్క్‌తో మెరుగైన రాబడిని ఇష్టపడే ఉద్యోగులకు ఈక్విటీకి గరిష్ట ఎక్స్‌పోజర్‌తో 25 శాతం ఎస్‌సీ-25 పథకంతో పరిమితం చేయబడిన కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్ ఉంటుంది. అలాగే ఈక్విటీకి గరిష్ట ఎక్స్‌పోజర్‌తో 50 శాతం ఎల్‌సీ-50 పథకంతో పరిమితం చేయబడిన మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ ఉంటుంది.
2004 సెప్టెంబర్ 1న తరువాత ఉద్యోగులుగా నియామకమై, రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీత భత్యాలు పొందిన అన్ని శాఖల ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ప్రవేశపెట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో అన్ని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు, యూనివర్శిటీలతో సహా అన్ని స్థాయిల్లో జరిగిన కొత్త నియామకాలు కూడా భాగంగానే ఉంటాయి. ఈ స్కీమ్ అమలు కోసం ట్రైజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్‌రేట్‌ను రాష్ట్ర నోడల్ అధికారిగా నామినేట్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్ఎస్‌డీఎల్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అధికారం కూడా ఇచ్చారు.
దీని ప్రకారం సీపీఎస్ కోసం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున నోడల్ అధికారి, ఎన్ఎస్‌డీఎల్ అధికారులతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)కు సంబంధించిన అన్ని పరిమితులు, మార్గదర్శకాలు, ఆదేశాలు, నిబంధనలు, షరతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉండటానికి అంగీకరించింది.
రాష్ట్రంలో సీపీఎస్ వ్యతిరేక ఉద్యమం…
రాష్ట్ర విభజన తరువాత జరిగే ఎన్నికల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆయన అధికారంలో ఉన్న 2014-19 మధ్య ఐదేళ్ల పాటు సీపీఎస్ రద్దు అంశాన్నే మరిచిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన కూడా చేయలేదు.
దీంతో సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. 2022 ఫిబ్రవరి 3న విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతృత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు కదం తొక్కారు. భారీగా హాజరైన ఉద్యోగ, ఉపాధ్యాయలతో విజయవాడలో ప్రభంజనం సృష్టించారు. దీంతో దిగొచ్చిన ఏపి ప్రభుత్వం సీపీఎస్‌పై కమిటీ వేసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయల మధ్య విభజనకు కూడా ప్రభుత్వం పూనుకుంది. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయలు కన్నెర్ర చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం 2022 ఏప్రిల్ 25న కమిటీ వేసింది. ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు నాటి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపింది. అనంతరం ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు సూచిస్తూ నివేదిక ఇచ్చింది. దానికనుగుణంగా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చింది. దీన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.
అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు హామీ ఇచ్చింది. 2024 మే 13న ఎన్నికల మ్యానిఫెస్టోలో టీడీపీ అధినేతగా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. ప్రజాగళం పేరుతో విడుదల చేసిన టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోలో కూడా సీపీఎస్, జీపీఎస్‌పై పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. కానీ జీపీఎస్ అమలుపై అధికార బాధ్యతలు చేపట్టిన రోజే (జూన్ 12న) జీవో నెంబర్ 54 తీసుకొచ్చారు. ఆ తర్వాత జూలై 12వ తేదీన రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మండిపడుతున్నాయి.
తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే ఆ జీవో నెంబర్ 54ను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ తమకు ఇచ్చిన హామీపై మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పైగా సీపీఎస్ అమలకు కొత్త కొత్త మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుండటాన్ని తప్పుబడుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేస్తున్నాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్