



Best Web Hosting Provider In India 2024

OTT Vertical Web Series: మీ మొబైల్ తిప్పాల్సిన పనిలేదు.. ఓటీటీ చరిత్రలో తొలిసారి వర్టికల్ వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?
OTT Vertical Web Series: ఇండియా ఓటీటీ చరిత్రలో తొలిసారి ఓ వర్టికల్ వెబ్ సిరీస్ వస్తోంది. ఆహా తమిళం ఓటీటీ ఈ అరుదైన ప్రయోగానికి తెర తీస్తోంది. అసలేంటీ ఈ వెబ్ సిరీస్? మీరే చూడండి.
OTT Vertical Web Series: మొబైల్ చేతిలో ఉంటే ప్రపంచమే మీ చేతుల్లో ఉన్నట్లే. ఓటీటీలో ఉన్న మొత్తం కంటెంట్ ను మొబైల్ లోనూ చూడొచ్చు. అయితే ఏ సినిమా చూడాలన్నా, వెబ్ సిరీస్ చూడాలన్నా మొబైల్ ను అడ్డంగా తిప్పాల్సిందే. కానీ ఆ అవసరం లేకుండా తొలిసారి ఓటీటీ చరిత్రలో వర్టికల్ వెబ్ సిరీస్ వస్తోంది.
ఆహా తమిళం అప్సర వెబ్ సిరీస్
ఆహా తమిళం ఓటీటీ ఓ వినూత్న ప్రయోగానికి తెర తీస్తోంది. ఇండియాలో తొలిసారి ఓ వెబ్ సిరీస్ ను వర్టికల్ ఫార్మాట్లో తీసుకొస్తోంది. అంటే మీ మొబైల్ ను అడ్డం తిప్పి చూడాల్సిన అవసరం లేకుండా సరికొత్త అనుభూతిని కలిగించేందుకు సిద్ధమవుతోంది. తొలిసారి ఈ ఫార్మాట్లో అప్సర (Apsara) అనే ఫ్యాంటసీ జానర్ వెబ్ సిరీస్ వస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా మీ మొబైల్లో నిలువుగా ఈ సిరీస్ చూడొచ్చు. అత్యాధునిక స్టోరీటెల్లింగ్, ఇన్నోవేషన్ ను కలగలిపి మొబైల్ ప్రేక్షకులకు ఈ అనుభవాన్ని అందించబోతున్నారు. వర్టికల్ గా చూసేందుకు వీలుగా వస్తున్న ఈ అప్సర వెబ్ సిరీస్ స్టన్నింగ్ విజువల్స్ తో అలరించబోతున్నట్లు ఆహా తమిళం ఓటీటీ చెబుతోంది.
మొబైల్ యూజర్ల కోసం..
ఓటీటీ కంటెంట్ ను టీవీ స్క్రీన్లలాగే మొబైల్లో చూసే వారు కూడా కోట్లలో ఉన్నారు. అలాంటి వారికి ఓ భిన్నమైన అనుభూతిని కలిగించేందుకు ఆహా తమిళం ప్రయత్నిస్తున్నట్లు ఈ ఓటీటీ కంటెంట్, స్ట్రేటజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కవితా జౌబిన్ అన్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసమే ఈ వర్టికల్ ఫార్మాట్లో తీసుకొస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది.
“వర్టికల్ స్క్రీన్ టెక్నాలజీ ఉపయోగించి తీసుకొస్తున్న అప్సర వెబ్ సిరీస్ తో భవిష్యత్తులో స్టోరీ టెల్లింగ్ ఎలా మారబోతోందో చూపబోతున్నాం. ఇది కేవలం సౌకర్యం కోసమే కాదు.. స్టోరీ టెల్లింగ్ అనుభవం ఎలా మారబోతోందో కూడా దీనిద్వారా తెలుస్తుంది. సాంప్రదాయ వైడ్ స్క్రీన్ ఫార్మాట్ కు భిన్నంగా ఈ వర్టికల్ ఫ్రేమ్ వెబ్ సిరీస్ ద్వారా యూజర్లు స్టోరీతో మరింతగా కనెక్ట్ అవుతారు” అని కవిత అన్నారు.
అప్సర వెబ్ సిరీస్ డిజిటల్ కంటెంట్ లో ఓ విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందని ఆహా తమిళం ఓటీటీ భావిస్తోంది. మైథాలజీ, మిస్టరీ, ఆధునిక స్టోరీటెల్లింగ్ కలగలిపి వస్తున్న ఈ అప్సర ఓ గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈ అప్సర వెబ్ సిరీస్ త్వరలోనే ఆహా తమిళం ఓటీటీలోకి రానుంది.
సంబంధిత కథనం