



Best Web Hosting Provider In India 2024

Aditya 369 Re Release: బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్.. 4K వెర్షన్‌లో తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీ!
Balakrishna Aditya 369 Re Release In 4K Version: బాలకృష్ణ నటించిన తొలి తెలుగు సైన్స్ ఫిక్షనల్, టైమ్ ట్రావెల్ చిత్రం ఆదిత్య 369 రీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. నేటి సాంకేతితకు అనుగుణంగా డిజిటలైజ్ చేసి 4కె వెర్షన్‌లో ఆదిత్య 369 మూవీని రీ రిలీజ్ చేయనున్నారు.
Balakrishna Aditya 369 Re Release In 4K Version: నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీ దేవి మూవీస్ సంస్థ నిర్మించిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సెన్సేషనల్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్
నేటి సాంకేతికతలకి అనుగుణంగా డిజిటలైజ్ చేసిన ఆదిత్య 369 సినిమా ఈ సమ్మర్‌లో గ్రాండ్ రీ-రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సినిమాగా పేరొందిన ఆదిత్య 369 సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో రూపొందించారు. ఈ తొలి తెలుగు సైన్స్ ఫిక్షనల్ టైమ్ ట్రావెల్ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
చరిత్రలో నిలిచిపోయేలా
శ్రీ కృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన, సింగీతం దర్శక నైపుణ్యం, ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం గాత్రం-సమర్పణ, జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా అద్భుత సంగీతం, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ విలువలు, ఇతర నటీనటుల ప్రతిభ, అబ్బుర పరిచే సెట్స్, ఫైట్స్, దుస్తులు, నృత్యం ఇలా ప్రతీ ఒక్కరు చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్రలు పోషించారు.
మూడు జోనర్స్ టచ్ చేస్తూ
చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఉన్నా కొన్ని ప్రజల హృదయాల్లో, కళాభిమానుల లైబ్రరీలలో ఉండిపోయేవి. వాళ్లు ఎప్పుడూ మాట్లాడుకునేవి ఉంటాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘ఆదిత్య 369’. ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మాత్రమే కాకుండా పురాణాల్లోని శ్రీ కృష్ణ దేవరాయలను ఫిక్షనల్‌గా చూపిస్తూ హిస్టారికల్‌తో సహా మూడు జోనర్లను టచ్ చేశారు.
ఇప్పుడు ఏదే ఉత్సాహంతో
ఇక ఆదిత్య 369 రీ- రిలీజ్ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. “ఆదిత్య 369 మొదటి సారి విడుదల సమయంలో ఎంత ఉత్సాహంగా, ఆసక్తిగా ఉన్నానో ఇపుడు రీ – రిలీజ్‌కి కూడా అలాగే ఉన్నాను. ఎన్ని సార్లు చూసినా కనువిందు చేసే ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని డిజిటల్ 4Kలో ఇంకా అద్భుతంగా తీర్చదిద్దాం” అని అన్నారు.
అద్భుతమైన పునాది
“అన్ని వయసుల, వర్గాల ప్రేక్షకులని, నందమూరి అభిమానులను అలరించిన ఈ చిత్రాన్ని మళ్లీ మీ ముందుకు తీసుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన నాకు, మా నిర్మాణ సంస్థకి ఒక గొప్ప గుర్తింపు, అద్భుతమైన పునాది ‘ఆదిత్య 369’తోనే. ఈ సమ్మర్‌లో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం.” అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.
4కెలో ఆదిత్య 369
నందమూరి నటసింహం నటించిన ఆదిత్య 369 సినిమాను 4కె వెర్షన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. అయితే, రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు మేకర్స్. కాగా ఆదిత్య 369 మూవీలో బాలకృష్ణతోపాటు మోహిని, అమ్రీష్ పురి, టిన్ను ఆనంద్ (సలార్, సాహో ఫేమ్), హీరో తరుణ్, శుభలేక సుధాకర్, సిల్క్ స్మిత, చలపతి రావు, సుత్తివేలు, చంద్రమోహన్ ఇతరులు పలు కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం