



Best Web Hosting Provider In India 2024

Hyderabad Fraud: అడ్డా కూలీగా వచ్చి అందిన కాడికి దోచేసి.. హైదరాబాద్‌లో రూ.100కోట్లకు టోకరా వేసిన చిట్టీల వ్యాపారి
Hyderabad Fraud: ఉపాధి కోసం ఏపీ నుంచి అడ్డా కూలీగా వచ్చిన ఓ వ్యక్తి కొద్ది కాలంలోనే చిట్టీల వ్యాపారిగా మారాడు. స్థానికుల నమ్మకం చూరగొన్నాడు. ఏళ్ల తరబడి చిట్టీలు నిర్వహిస్తూ చివరకు రూ.100కోట్లకు కుచ్చు టోపీ పెట్టిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.
Hyderabad Fraud: కూలీ పనుల కోసం ఏపీలోని రాయలసీమ నుంచి ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి, కడుపు నింపుకోడానికి అడ్డా కూలీగా పనిచేసి ఏకంగా రూ.100కోట్లకు జనానికి ముంచిన వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగు చూసింది. జనానికి డబ్బు చెల్లించకుండా ఉడాయించడంతో బాధితులు ఆందోళన బాట పట్టడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసిన వారిని మోసం కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు.
హైదరాబాద్‌లో ఓ అడ్డాకూలీగా పనిచేసిన వ్యక్తి రూ.100 కోట్ల మోసం చేయడం వెలుగు చూసింది. అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు కూలీ పనుల కోసం వచ్చారు. ప్రస్తుతం బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ సమీపంలో ఉన్న సీ-టైపు కాలనీలో నివాసముంటున్నారు.
చదువు రాని పుల్లయ్య కొంత కాలం అడ్డాకూలీగా పనిచేశాడు. మెల్లగా స్థానికులతో పరిచయాలు పెంచుకొని కూలీ పని మానేసి చిట్టీలు వేయడం మొదలు పెట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారాన్ని చేస్తున్నాడు. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీల గ్రూపులు నిర్వహించేవాడు.
మొదట్లో స్థానికంగా గుడిసెల్లో నివసించిన పుల్లయ్య అనతి కాలంలోనే కోటీశ్వరుడిగా మారాడు. అక్కడే పెద్ద భవనం కట్టాడు. తన దగ్గర చిట్టీలు పాడుకున్న వారికి ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానంటూ తన వద్దే ఉంచుకునేవాడు. వారితో కొత్త చిట్టీలు కట్టించేవాడు. స్థానికంగా నమ్మకం సంపాదించడంతో చిట్టీలు వేసే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో వ్యాపారాల పేరుతో తెలిసిన వారి నుంచి వడ్డీకి రూ.కోట్లు అప్పులు చేశాడు. ఇలా దాదాపు రెండు వేల మంది నుంచి చిట్టీల రూపేణా డబ్బు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు.
డబ్బులిస్తానని చెప్పి..
పుల్లయ్య దగ్గర చిట్టీలను కట్టిన వారికి ఈనెల 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఫిబ్రవరి 21నే కుటుంబ సభ్యులతో కలిసి మాయం అయ్యాడు. కుటుంబ సభ్యులంతా ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశాడు. బుధవారం దాదాపు 700 మంది బాధితులు అతడి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. కొందరు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రూ.100 కోట్లకు పైగా బాధితులకు పుల్లయ్య చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశముంది. పుల్లయ్య ఇంట్లో నగదు లెక్క పెట్టేందుకుయంత్రాలు కూడా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. చిట్టీల వ్యవహారంపై బాధితులు ఫిర్యాదు చేయలేదని ఎస్సార్ నగర్ పోలీసులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య హైదరాబాద్ దాసారం గుడిసెల సమీపంలోని నివాసం ఉంటున్నాడు. ఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణాలు చేపట్టాడని, బీకేగూడ, ఎస్ఆర్ నగర్లో 15 ఏళ్లుగా చిట్టీ, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తు న్నాడని అధికవడ్డీలు ఆశ చూపి మోసం చేసినట్టు బాధితులు చెబుతున్నారు.
పుల్లయ్య బాధితులు బల్కంపేట, ఎస్ఆర్ నగర్‌తో పాటు అతని స్వస్థలమైన అనంతపురం జిల్లాలోని గుత్తి, కర్నూల్ జిల్లాలో కూడా ఉన్నారు. తాము దాచుకున్న నగదుతో పాటు, అధిక వడ్డీ వస్తుం దన్న ఆశతో తమకు తెలిసిన వారి నగదును కూడా అతని దగ్గర డిపాజిట్లు చేయించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
సంబంధిత కథనం
టాపిక్