


Best Web Hosting Provider In India 2024
SLBC Update : ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదానికి ఐదు రోజులు.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
SLBC Update : ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తోంది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఆపరేషన్‌ను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై తాజాగా హరీష్ రావు ఘాటుగా స్పందించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పైకప్పు కూలిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలు చేరుకుంటున్నాయి. ఘటనా స్థలంలో బండరాళ్లు, బురద, నీళ్లు ఉన్నాయి. ఘటనా స్థలం నుంచి వందల మీటర్ల వరకు మట్టి ఉంది. మట్టిని తవ్వడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం శిథిలాల కింద గాలింపు చర్యలు చేపట్టారు.
జాడ తెలియలేదు..
ఐదు రోజులు గడుస్తున్నా.. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. నీరుందని, పూడిక చాలా ఎత్తులో పేరుకుపోయిందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని.. నిపుణులు చెబుతున్నారు. అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతున్నారు. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన అన్నింటినీ తొలగించాలని నిర్ణయించారు.
పక్కా ప్రణాళికతో..
సొరంగం మార్గంలో అడ్డుగా నిలిచిన టీబీఎం భాగాల్ని.. గ్యాస్ కట్టర్లతో కత్తిరించి వేరు చేసేందుకు అధికారులు ప్రణాళిక రచించారు. నీటిని తోడివేసేందుకు, పూడికను తొలగిచేందుకు కార్యాచరణ ప్రారంభించారు. రెండు రోజుల్లో ఆపరేషన్‌ను పూర్తి చేసేలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు వెళ్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై మాజీమంత్రి హరీష్ రావు స్పందించారు.
బీఆర్ఎస్ విమర్శలు..
‘ఎస్ఎల్‌బీసీ ఘటనపై ప్రభుత్వ తీరు బాధాకరం. ఘటన జరిగి ఐదురోజులవుతోంది. వేగంగా సహాయక చర్యలు చేపట్టడం లేదు. మంత్రులు హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారు. సీఎం కనీసం పట్టించుకోవడం లేదు’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ‘ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై జ్యూడీషియల్ కమిషన్ వేయాలి. 8 మంది టన్నెల్‌లో చిక్కుకుంటే.. సీఎం ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో 3 భారీ ప్రమాదాలు జరిగాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా.. పనులుప్రారంభించడం ప్రభుత్వనిర్లక్ష్యానికి పరాకాష్ట. నిజాలు నిగ్గుతేలాలంటే జ్యుడీషియల్ కమిషన్ వేయాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
నిద్ర లేకుండా..
‘మంత్రులు నిద్ర కూడా పోకుండా ఎస్ఎల్‌బీసీ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్ లోకి కొంచెం దూరం వెళితేనే మనకు భయం అవుతుంది. అలాంటిది లోపల చిక్కుకున్న ఆ 8 మంది కోసం రెస్క్యూ టీం వాళ్లు 13 కిలోమీటర్ల లోపలికి వెళ్లారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు జూపల్లి, ఉత్తమ్ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోపల మట్టి, బురద ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది’ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివరించారు.
టాపిక్