


Best Web Hosting Provider In India 2024
Posani Krishna Murali Arrest : పోసాని అరెస్ట్‌ను ఖండించిన వైఎస్ జగన్.. అండగా ఉంటామని భరోసా
Posani Krishna Murali Arrest : పోసాని కృష్ణ మురళి అరెస్ట్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అరెస్టును టీడీపీ సమర్థిస్తుంటే.. వైసీపీ ఖండిస్తోంది. తాజాగా పోసాని అరెస్టుపై వైసీపీ చీఫ్ జగన్ స్పందించారు. కృష్ణ మురళి అరెస్టును ఖండించారు. పోసాని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ను ఖండించారు వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్. పోసాని భార్యను ఫోన్‌లో పరామర్శించారు. కృష్ణ మురళి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు రోజుల కిందట ఓ కేసు నమోదైంది. ఈ కేసులో ఏపీ పోలీసులు బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో పోసానిని అరెస్టు చేశారు.
పీఎస్‌కు పోసాని..
ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు పోసాని కృష్ణ మురళిని తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడి నుంచి నేరుగా రైల్వే కోడూరు కోర్టుకు తరలించే అవకాశం ఉంది. పోసాని అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోసాని భార్య వెర్షన్..
‘పోసాని ఆరోగ్యం బాలేదని చెప్పినా వినకుండా రాత్రికి రాత్రే పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు నాకు నోటీసులు ఇస్తే నేను తీసుకొను అని చెప్పాను. డే టైమ్ లో తీసుకెళ్లొచ్చు కదా? నైట్ లోనే పోసానిని ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే ఏదో పోలీస్ స్టేషన్ పేరు చెప్పి హడావుడిగా తీసుకెళ్లారు’ అని పోసాని కృష్ణ మురళి భార్య చెప్పారు.
లాయర్ ఫైర్..
పోసాని కృష్ణ మురళి అరెస్టుపై ఆయన తరపు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పోలీసులు సీనియర్ సిటిజన్ యాక్ట్ పాటించలేదు. పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారు. పోసాని అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య’ అని ఆయన తరఫు లాయర్ ఆరోపించారు. పోసాని కృష్ణ మురళి అరెస్టును ఖండించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
రేపటి డేట్‌తో..
‘రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని అరెస్ట్. రేపటి డేట్ తో పోసానికి నోటీసులు జారీ చేయడం వెనుక పోలీసుల అత్యుత్సాహం. కక్ష సాధింపు రాజకీయాలపై అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. చంద్రబాబు తప్పిదాలను విమర్శించిన పోసాని కృష్ణ మురళిపై నాన్ బెయిలబుల్ కేసులు దుర్మార్గం’ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కృష్ణుడు రియాక్షన్..
‘రాజకీయాల నుంచీ వైదొలగిన పోసాని కృష్ణ మురళిని సైతం వదలకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్టుల పర్వం కొనసాగించడం ద్వారా రాబోయే ప్రభుత్వాలకు దుష్ట సంప్రదాయాన్ని వారసత్వంగా అందిస్తున్నట్టుగా ఉంది. గతంలో సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన సహచరులు ఎన్నెన్ని సార్లు ఎంతగా దూషించారు? వ్యక్తిగత దూషణలు కూడా చేశారు. మరి పోసాని మీద పెట్టినట్టు వాళ్ల మీద కూడా బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేసులు పెట్టి ఉంటే ఏమయ్యేది? ఏపీలో ఈ చెడు సంప్రదాయాన్ని మోదీ పట్టించుకోవాలి. ఏపీలో ఉన్నది కేవలం టీడీపీ, జనసేన ప్రభుత్వం మాత్రమే కాదు. ఈ కక్ష సాధింపు, అరెస్టుల పర్వాన్ని కూటమి ప్రభుత్వ నిర్వాకంగానే ప్రజలు భావిస్తున్నారని బీజేపీ పెద్దలు గుర్తెరగాలి’ అని యాక్టర్ కృష్ణుడు ట్వీట్ చేశారు.
సీఐడీ కేసు..
అటు పోసానిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై సీఐడీ కేసు నమోదుచేసింది. గతంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పోసాని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా, వ్యవస్థీకృతంగా మార్ఫింగ్, ఫ్యాబ్రికేట్ చేసిన ఫొటోలను ప్రదర్శించారని, ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత అధికార ప్రతినిధి వంశీ కృష్ణ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబరులో కేసు నమోదు చేశారు.
టాపిక్