



Best Web Hosting Provider In India 2024

Crime Thriller Web Series: మరికొన్ని గంటల్లో ఓటీటీకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2.. తొలి సీజన్ కథ ఇలా..
Crime Thriller Web Series: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది. ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ను వీకెండ్ బింజ్ వాచ్ చేసేయండి. అంతకుముందు తొలి సీజన్లో ఏం జరిగిందో చూడండి.
Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్ (Suzhal) రెండున్నరేళ్ల కిందట అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలుసు కదా. ఈ తమిళ వెబ్ సిరీస్ తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో ఏకంగా 8.1 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ రెండో సీజన్ మరికొన్ని గంటల్లోనే రాబోతోంది.
సుడల్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్
సుడల్ ఓ తమిళ వెబ్ సిరీస్. తెలుగులోనూ డబ్ చేశారు. 2022లో తొలి సీజన్ రాగా.. ఇప్పుడు శుక్రవారం (ఫిబ్రవరి 28) నుంచి రెండో సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది. మొత్తంగా 8 ఎపిసోడ్ల ఈ రెండో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెడుతోంది.
కొన్నాళ్ల కిందటే ఈ రెండో సీజన్ స్ట్రీమింగ్ తేదీ గురించి ప్రైమ్ వీడియో వెల్లడించింది. ఇప్పుడీ కొత్త సీజన్ వస్తున్న నేపథ్యంలో అసలు తొలి సీజన్ లో ఏం జరిగింది? ఈ రెండో సీజన్ ఎందుకు మిస్ కాకుండా చూడాలన్నది ఇక్కడ తెలుసుకోండి.
సుడల్ సీజన్ 1లో ఏం జరిగిందంటే?
ఐశ్వర్య రాజేష్, కథిర్, శ్రియారెడ్డి, పార్తిబన్ లాంటి వాళ్లు నటించిన వెబ్ సిరీస్ సుడల్ (Suzhal: The Vortex). బ్రహ్మ, అనుచరణ్ దర్శకత్వం వహించారు. సామాజిక అంశాలకు క్రైమ్ ను మేళవించి తెరకెక్కించారు. తొలి సీజన్ కథేంటో ఇప్పుడు చూద్దాం.
సంబలూరు అనే ఊరిలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజలందరికీ జీవనాధారం. కానీ అనుకోకుండా పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ఫ్యాక్టరీ కాలిపోతుంది. ఫ్యాక్టరీ ఓనర్ త్రిలోక్ పై కక్షతో కావాలనే ఆ ఫ్యాక్టరీని ఎవరో తగలబెట్టారని పోలీస్ ఆఫీసర్లు రెజీనా(శ్రియారెడ్డి) చక్రవర్తి(కథిర్) నమ్ముతారు. ఫ్యాక్టరీ వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ షణ్ముగంపై (పార్తిబన్) అనుమానం వ్యక్తం చేస్తారు.
అతడిని అరెస్ట్ చేయాలని భావిస్తారు. అదే సమయంలో షణ్ముగం చిన్న కూతురు నీలా కనిపించకుండాపోతుంది. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులు అనుమానిస్తారు. ఆమె ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెడతారు.
మూడో ఎపిసోడ్‌లో ట్విస్ట్
మరోవైపు నీలా సోదరి నందిని (ఐశ్వర్య రాజేష్) కూడా తన చెల్లిని వెతుకుతూ ఉంటుంది. చక్రి అన్వేషణలో రెజీనా కొడుకు అతిశయం, నీలా ప్రేమించుకున్నారని, పెద్దలు తమ ప్రేమను అంగీకరిస్తారో లేదో అన్న భయంతో ఇంట్లో నుంచి ముంబై పారిపోయారని తెలుస్తుంది. కానీ అదే ఊరిలో ఉన్న చెరువులో వారి శవాలు బయటపడతాయి.
వారిని ఎవరో హత్య చేశారని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో తెలుతుంది. అతిశయం, నీలాను చంపింది ఎవరు? తన కొడుకు మరణానికి కారణమైన వారిపై రెజీనా ప్రతీకారం తీర్చుకుందా? నీలా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయింది? అసలైన హంతకుడిని నందిని సహాయంతో చక్రి పట్టుకున్నాడా లేదా అన్నదే ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ స్టోరీ.
ఎనిమిది ఎపిసోడ్స్ అయినా ఎక్కడా బోర్ కొట్టదు. అంత పకడ్బందీగా దర్శకద్వయం స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. అవసరపు సీన్స్, కామెడీ ట్రాక్‌లు, కథను పక్కదారి పట్టించే అంశాలు కనిపించవు. మంచి థ్రిల్ ను పంచుతూనే ఆలోచింపజేసే సిరీస్ ఇది. క్లైమ్యాక్స్ ఊహకందని విధంగా ఉంటుంది. ఇదే రెండో సీజన్ పై ఆసక్తి రేపింది. మరి శుక్రవారం (ఫిబ్రవరి 28) ప్రైమ్ వీడియోలోకి వస్తున్న రెండో సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.
సంబంధిత కథనం