


Best Web Hosting Provider In India 2024
Adilabad Teacher : ఆదివాసీల భాషాభివృద్ధికి ‘ఏఐ’ టూల్స్…! ఆదిలాబాద్ టీచర్‌కు ప్రధాని మోదీ ప్రశంస
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి కృషిని ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఏఐ టూల్స్ ను ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేయటాన్ని ప్రస్తావించారు. ఆదివాసీ భాషల సంరక్షణకు చేస్తున్న కృషిని ప్రధానమంత్రి అభినందించారు.
తన జాతి వారికి ఏదో చేయాలనే ఉద్దేశ్యంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సరికొత్తగా ఆలోచించాడు. మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే తనకున్న తెలివితేటలు ఉపయోగించి… ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే… ఇటీవలే మన్ కీ బాత్” కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. తెలంగాణలోని ఆదిలాబాద్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తోడసం కైలాష్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (Al)ని వాడుతున్న తీరును ప్రస్తావించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడైన కైలాశ్… ఏఐ టూల్స్ సాయంతో ఆదివాసీల భాషల్లో ఒకటైన కొలామీ భాషలో పాటలు రూపొందించడం అద్భుతం అని ప్రధాని కొనియాడారు. కొలామీతో పాటు మరిన్ని ఆదివాసీ భాషల్లో పాటలు రూపొందించడానికి కైలాష్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆదివాసీ భాషలను కాపాడే చర్యల్లో ఇది కొత్త మలుపు అని ప్రధాని వ్యాఖ్యానించారు.
కైలాశ్ కు జిల్లా కలెక్టర్ సన్మానం:
ఆదిలాబాద్ జిల్లా గౌరాపూర్ పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడుగా సేవలు అందిస్తున్న కైలాష్ ను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. గిరిజన భాషలైన గోండ్ , కోలాం పరిరక్షణ కోసం చేస్తున్న చర్యలను కొనియాడారు. కైలాశ్ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ఇదే విధంగా ముందుకెళ్లాలని… తనవంతుగా సాయం అందిస్తానని కలెక్టర్ హమీనిచ్చారు.
ఈ సందర్భంగా తోడసం కైలాస్ రూపొందించిన పాటను జిల్లా కలెక్టర్ సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి టీ ప్రణీత , ఉపాధ్యాయులు అజయ్ , రమేష్ బాబుతో పాటు కైలాశ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్