


Best Web Hosting Provider In India 2024

SLBC Tunnel Rescue : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు – రంగంలోకి ‘మార్కోస్ కమాండోలు’
SLBC Tunnel Rescue Operation: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సొరంగం లోపల శిథిలాలను తొలగించే ప్రయత్నాల్లో రెస్క్యూ బృందాలు ఉన్నాయి. సహాయ చర్యల్లో మార్కోస్ కమాండోలు కూడా పాల్గొన్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా లోపల చిక్కుకుపోయిన కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆ 8 మందిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ… లోపల నెలకొన్న పరిస్థితులు సవాల్ గా మారాయి.
టన్నెల్‌లో జీరో పాయింట్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ పనులు కొనసాగిస్తున్నాయి. శిథిలాలను తొలగించే ప్రయత్నాల్లో రెస్క్యూ బృందాలు నిమగ్నమయ్యాయి. అయితే సహాయ చర్యల్లో మార్కోస్ కమాండోలు(ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్) కూడా భాగమయ్యాయి.
మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. SLBC టన్నెల్లో 2,3 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుందన్నారు. కార్మికులను గుర్తించేందుకు పదకొండు విభాగాలు పని చేస్తున్నాయని తెలిపారు. గుర్తింపు పొందిన నిపుణులతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని… కూలిపోయిన మట్టిని త్వరగా త్వరగా తీసివేస్తామని తెలిపారు.ఆ తర్వాత 2, 3 నెలల్లోనే పనులు పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
SLBC ప్రమాదంపై బీఆర్ఎస్ ఓవరాక్షన్ చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో ఆరుగురు చనిపోతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే SLBC ప్రమాదం జరిగిందన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోయారని… కేసీఆర్ కనీసం అక్కడికి వెళ్లలేదని గుర్తు చేశారు. మాసాయిపేటలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతే కేసీఆర్ కనీసం అడుగు కదపలేదన్నారు. ఇప్పుడు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నెల్ ఘటనపై రాజకీయం చేయటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం
టాపిక్