


Best Web Hosting Provider In India 2024
TG Non Local: తెలంగాణలో నాన్‌లోకల్ కోటాకు చెల్లు.. విద్యాశాఖ ఉత్తర్వులు.. ఏపీలో సీట్లకు డిమాండ్ పెరిగే ఛాన్స్
TG Non Local: ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన నాన్ లోకల్ కోటా కథ ముగిసింది. తెలంగాణలో ఏపీ విద్యార్థులకు అమలవుతోన్న 15శాతం నాన్ లోకల్ కోటా రద్దైపోయింది.ఉమ్మడి అడ్మిషన్ల గడువు గత ఏడాది జూన్‌తో ముగియడంతో తెలంగాణలో నాన్ లోకల్ కోటాను రద్దు చేయాలనే నిపుణుల సిఫార్సుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
TG Non Local: తెలంగాణలో నాన్ లోకల్ కోటాను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై తెలంగాణలో నాన్ లోకల్ కోటాను పూర్తిగా తెలంగాణ స్థానికత కలిగిన వారికే వర్తింప చేస్తారు. 6 నుంచి 12వ తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తిస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కోర్సుల్లో అమల్లో ఉన్న 15శాతం నాన్ లోకల్ కోటాను రద్దు చేశారు. . 2025-26 విద్యా సంవత్సరం మేనేజ్‌మెంట్ కోటా మినహా మిగిలిన సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకు దక్కనున్నాయి. నాన్‌లోకల్ కోటాలో దరఖాస్తు చేసుకోడానికి ఏపీ విద్యార్థులకు అవకాశం ఉండదు.
రాష్ట్ర విభజనలో భాగంగా అడ్మిషన్లలో 15శాతం నాన్ లోకల్ కోటాకు పదేళ్ల గడువు విధించారు. గత ఏడాదితో విభజన చట్టం గడువు ముగిసింది.2024 జూన్ 2నాటికి గడువు పూర్తైనా అప్పటికే నోటిఫికేషన్లు జారీ కావడంతో గత ఏడాది నాన్ లోకల్ కోటాను అమలు చేశారు. తాజాగా నాన్ లోకల్ కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
15 శాతం నాన్ లోకల్ కోటా అర్హతలను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం జీవో 15 జారీ చేశారు. గతంలో మాదిరిగానే కన్వీనర్ కోటాలో ఉండే 70 శాతం సీట్లలో 85 శాతం సీట్లను స్థానికులకు ( ఉమ్మడి రాష్ట్రంలో ఓయూ రీజియన్) అభ్యర్ధులకు కేటాయిస్తారు.
మిగిలిన 15 శాతం స్థానికేతర కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2011లో జారీ చేసిన జీవో 74లో నాన్ లోకల్ కోటాకు ఓయూ రీజియన్ తోపాటు ఆంధ్రా వర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ విద్యార్థులు పోటీ పడవచ్చని ఉమ్మడి ఏపీలో నిర్ణయించారు. తాజాగా జారీ చేసిన జీవోలో ఏయూ, ఎస్కేయూ పరిధిలో ఉండే విద్యార్థులకు నాన్‌లోకల్ కోటా తొలగించింది.ఇక తెలంగాణకు ఓయూ రీజియన్ అభ్యర్థులు మాత్రమే అర్హత పొందుతారు.
నాన్ లోకల్ కోటాపై స్పష్టత…
అన్ రిజర్వ్‌డ్ క్యాటగిరీగా పరిగణించే నాన్‌లోకల్ కోటాలో తెలంగాణలో చదువుకున్న పిల్లలతో పాటు మరో మూడు కేటగిరీల విద్యార్థులు కూడా పోటీ పడొచ్చు.
- ఉద్యోగం, ఉపాధి కారణాలతో తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా… గతంలో పదేళ్ల పాటు తెలంగాణాలో నివసించిన వారి పిల్లలకు ఈ కోటా వర్తిస్తుంది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు, ఉమ్మడి ఏపీలో పనిచేసిన వారికి ప్రయోజనం కలుగుతుంది. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు నివసించినట్లు మీ సేవా కేంద్రాల ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
- ఇతర రాష్ట్రాలకి చెందిన వారైనా తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు 15శాతం నాన్ లోకల్ కోటాకు అర్హులవుతారు.
- రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్పౌజ్‌కు కూడా నాన్‌లోకల్ కోటా వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే… వారి భాగస్వాములకు ఈ కోటా వర్తిస్తుంది.
- నాన్ లోకల్ కోటాలో…
- ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, అర్కిటెక్చర్, ఫార్మా డి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు నాన్ లోకల్ కోటా నిబంధనలు వర్తిస్తాయి. ఈ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పీజీ సీట్ల భర్తీకి ఇవే నిబంధనలు ఉంటాయి.
తెలంగాణ స్థానికతకు నిర్వచనం…
తెలంగాణ స్థానికతకు గతంలో మాదిరిగా 6 నుంచి ఇంటర్ వరకు చదువును ప్రామాణికంగా పరిగణిస్తారు. ఉదాహరణకు బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బిఎస్సీ వెటర్నరీ సైన్స్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అడ్మిషన్లకు మొదట 9 నుంచి ఇంటర్ వరకు చదివిన నాలుగేళ్ల చదువును పరిశీలిస్తారు. దాని ఆధారంగా స్థానికత పరిగణలోకి తీసుకుంటారు.
9వ తరగతి నుంచి ఇంటర్ వరకు గా నాలుగేళ్లు తెలంగాణలో చదవక పోతే 6 నుంచి ఇంటర్ వరకు మొత్తం ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు రాష్ట్రంలో చదవి ఉండాలి. ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సుల భర్తీ సమయంలో కన్వీనర్ కోటాలో ఉండే మొత్తం 70శాతం సీట్లలో 15 శాతం అన్ రిజర్వుడ్ నాన్ లోకల్ కోటా సీట్లను భర్తీ చేస్తారు. ఇందులో కులాల వారీగారిజర్వేషన్లను అమలు చేస్తారు. ఆ సీట్లను భర్తీ చేసిన తర్వాత మిగిలిన 85 శాతం లోకల్ కోటా సీట్లను భర్తీ చేస్తారు.
ఏపీ విద్యార్థులకు నో ఛాన్స్…
తెలంగణలో ప్రధానంగా ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడుతున్నారు. నాన్-లోకల్ కోటాలో సీట్లకు ఏటా 60వేల మంది ఆంధ్రా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది వారికి ఆ అవకాశం ఉండదు. తెలంగాణలో చదవాలంటే మేనేజ్‌మెంట్ కోటాలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది.
ఏపీలో ఇంజనీరింగ్ సీట్లకు డిమాండ్…?
గత ఏడాది తెలంగాణ ఈఏపీ సెట్‌ఖు 3,54,803 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులు 49,071 మంది, అగ్రి, ఫార్మాకు 12,349 మంది హాజరయ్యారు. మొత్తం 61,420 మంది హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది ఏపీలో ఇంజనీరింగ్ సీట్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఏటా దాదాపు 12వేల మంది ఏపీ విద్యార్థులు నాన్ లోకల్ కోటాలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందుతారని అంచనా. ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులు చేరుతుంటారు. ఇకపై తెలంగాణ మేనేజ్‌మెంట్ కోటా లేదా ఏపీ కాలేజీల్లో ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్