

Best Web Hosting Provider In India 2024

Telangana Assembly Sessions 2025 : ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly Budget Session 2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. మార్చి 12వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉండనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడటంతో పాటు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంపై ప్రకటన వెలువడింది. మార్చి 12వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభతో పాటు మండలి కూడా ప్రారంభమవుతుందని… అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
మార్చి 12వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీ హాలులో ఉభయ సభలను ఉద్దేశించి.. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉండనుంది. అయితే ఈసారి సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడుతుంది.
బడ్జెట్ ఏ రోజు…?
మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరిగిన అనంతరం తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఆ తర్వాత హోలీ, ఆదివారం సెలవులు ఉండటంతో… సోమవారానికి వాయిదా పడే అవకాశం ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పద్దును మార్చి 18 లేదా, 19 తేదీల్లో సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ తన కసరత్తును పూర్తి చేసింది. సభలో ఏ రోజు ప్రవేశపెడతారనే దానిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుంది.
సభ ముందుకు కీలక అంశాలు…!
ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. అంతేకాకుండా…ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. డిలిమిటేషన్ ప్రక్రియపై కూడా తీర్మానం చేసే అవకాశం ఉంది.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA)కి కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో… ఈ విషయంపై కూడా సభలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ, కొత్త టూరిజం పాలసీ, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు, మామునూరు ఎయిర్ పోర్టు, భూ భారతి చట్టం అమలు వంటి కీలక అంశాలపై చర్చ జరగటంతో పాటు ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్