Mango Mutton Curry: పచ్చి మామిడికాయ మటన్ కర్రీ ఇలా వండారంటే ఒక్క ముక్క కూడా మిగలదు, ఇగురు అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

Mango Mutton Curry: పచ్చి మామిడికాయ మటన్ కర్రీ ఇలా వండారంటే ఒక్క ముక్క కూడా మిగలదు, ఇగురు అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Published Mar 18, 2025 05:30 PM IST

Mango Mutton Curry: మామిడికాయ పండే సీజన్ వచ్చేసింది. దీంతో మటన్ కర్రీ వండితే అదిరిపోతుంది. మామిడికాయ మటన్ కర్రీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

మ్యాంగో మటన్ కర్రీ
మ్యాంగో మటన్ కర్రీ (Ganas kitchen/youtube)

పుల్లని మామిడికాయలు ఎంత రుచిగా ఉంటాయో వాటితో వండే వంటలు కూడా అదిరిపోతాయి. పుల్లని మామిడికాయ మటన్ కలిపి వండితే ఆ రుచే అద్భుతంగా ఉంటుంది. ఒక్క ముక్క కూడా మిగలదు. ఇగురు మొత్తం ఊడ్చేస్తారు. ఇక్కడ మేము పుల్లని మామిడికాయతో మటన్ కర్రీ ఎలా వండాలో చెప్పాము. రెసిపీ ఫాలో అయిపోండి.

మామిడికాయ మటన్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పుల్లని మామిడికాయ – ఒకటి

మటన్ – అరకిలో

నూనె – అరకప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు

ఎండుమిర్చి – ఐదు

కారం – రెండు స్పూన్లు

గరం మసాలా – అరస్పూను

జీలకర్ర – ఒక స్పూను

ఉల్లిపాయలు – మూడు

ఉప్పు – రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

మామిడికాయ మటన్ కర్రీ రెసిపీ

1. మామిడికాయ మటన్ కర్రీని తయారు చేసేందుకు ముందుగా మామిడికాయను చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలను రంగు మారే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

4. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నూనె వేయాలి.

6. ఆ నూనె వేడెక్కాక రుబ్బుకున్న ఉల్లి ముద్దను వేసి బాగా వేయించుకోవాలి.

7. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.

8. తర్వాత పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.

9. ఇప్పుడు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ను వేసి బాగా కలపాలి. దీన్ని చిన్న మంట మీద ఉడికించాలి.

10. అవసరానికి సరిపడా నీళ్లు పోసి కూడా మటన్ బాగా ఉడికించాలి.

11. మటన్ ఉడకడానికి చాలా సమయం తీసుకుంటుంది.

12. మటన్ 70 శాతం ఉడికిపోయాక ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అందులో వేసి బాగా కలుపుకోవాలి.

13.రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలాను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

14. ఇది ఇగురు లాగా దగ్గరగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.

15. తర్వాత పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి.

16. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. కారంగా, పుల్లగా ఉండే ఈ మటన్ కర్రీని ఒకసారైనా రుచి చూడాల్సిందే.

అన్నంలో ఈ ఇగురు కలుపుతుంటే అద్భుతంగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే రోటి, చపాతీతో కూడా తినవచ్చు. ఇక్కడ నేను చెప్పిన పద్ధతిలో మామిడికాయ మటన్ గ్రేవీ చేసి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.

పచ్చి మామిడికాయ సీజనల్ గా దొరికేది. కాబట్టి ఇది తినాల్సిన అవసరం ఉంది. ఆ సీజన్ కి అవసరమైన పోషకాలను ఇది కలిగి ఉంటుంది. పచ్చిమామిడికాయలో ఉండే పోషకాలు, మటన్ లోని విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి పోషకాహార లోపం రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు ఈ మ్యాంగో మటన్ కర్రీ రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ప్రయత్నించాల్సిందే.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024