Best Web Hosting Provider In India 2024

Thaman: తమన్ వివరణ ఇచ్చుకోక తప్పదా? తీవ్రమవుతున్న విమర్శల దాడి
Thaman: గేమ్ ఛేంజర్ చిత్రంపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి. రామ్‍చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో తమన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ ఈ ఏడాది జనవరి 10న విడుదలై నిరాశపరిచింది. ఈ చిత్రంలో పాటలు కూడా పెద్దగా క్లిక్ అవలేదు. దీనిపై తమన్‍పై కూడా అసంతృప్తి వచ్చింది. అయితే, గేమ్ ఛేంజర్ పాటలు ఎందుకు పాపులర్ కాలేదో తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామెంట్లు చేశారు. రామ్‍చరణ్ అభిమానులకు ఆ మాటలు చాలా ఆగ్రహానికి తెప్పిస్తున్నాయి. దీంతో తమన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. వివరాలు ఇవే..
ఇంతకీ తమన్ ఏమన్నారు!
గేమ్ ఛేంజర్ సినిమాకు తాను మంచి ట్యూన్స్ ఇచ్చానని, కానీ సరైన హుక్ స్టెప్‍లు లేకపోవడం వల్లే పాటలకు యూట్యూబ్‍లో భారీగా వ్యూస్ రాలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో లాజిక్ మాట్లాడారు తమన్. కొరియోగ్రాఫర్లతో పాటు హీరోది కూడా బాధ్యతే అని అన్నారు. అల వైకుంఠపురములో సినిమా పాటల్లో హుక్ స్టెప్స్ ఉన్నాయని, కాబట్టి భారీ వ్యూస్ దక్కాయనేలా మాట్లాడారు. దీంతో తమన్‍పై చరణ్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ట్యూన్స్ సరిగా ఇవ్వకుండా.. కొరియోగ్రాఫర్లు, హీరోపై తప్పు నెట్టడం ఏంటని ఆగ్రహిస్తున్నారు.
తమన్ వివరణ ఇస్తారా!
తమన్‍పై చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ కామెంట్లు హాట్ టాపిక్‍గా మారాయి. ఈ తరుణంలో తన వ్యాఖ్యలపై తమన్ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే డ్యామేజ్ కంట్రోల్ అవడం కష్టమేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్‍కు ముందేమో గేమ్ ఛేంజర్ పాటలు చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్టు మాట్లాడి.. ఇప్పుడేమో హుక్ స్టెప్‍లు లేవంటూ తప్పును వేరే టెక్నిషియన్లపై నెట్టేయడమేంటనే విమర్శలు వస్తున్నాయి.
తమన్ ఈ కామెంట్లపై వివరణ ఇవ్వకపోతే హీరోలకు, దర్శకులకు కూడా నెగెటివ్ అభిప్రాయం పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆయనకు వచ్చే సినిమా ఛాన్సులపై కూడా ఎఫెక్ట్ పడొచ్చు. అందుకే గేమ్ ఛేంజర్ చిత్రంపై చేసిన కామెంట్లకు తమన్ వివరణ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. మరి తమన్ ఈ విషయంపై స్పందిస్తారా.. వివాదం చల్లారుతుందని వెయిట్ చేస్తారో చూడాలి. చరణ్ అభిమానుల నుంచి వచ్చే విమర్శల దాడి తగ్గాలంటే మాత్రం తమన్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఇటీవల ఓ రియాలిటీ షోకు గెస్టుగా వెళ్లిన తమన్.. అప్పుడు చేసిన కామెంట్లు కూడా అభిమానుల ఆగ్రహానికి కారణమ్యాయి. జరగండి పాటకు ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తే.. సినిమాలో ఉండే స్టెప్స్ కంటే వెయ్యి రెట్లు గ్రేట్ అని, సినిమాలో ఈ స్టెప్స్ ఉంటే బాగుండేదనిపిస్తోందని తమన్ అన్నారు. దీనిపైనా విమర్శలు వచ్చాయి. మొత్తంగా గేమ్ ఛేంజర్‌పై కామెంట్లతో ఇండస్ట్రీలో హాట్‍టాపిక్ అయ్యారు తమన్.