






Best Web Hosting Provider In India 2024

TB Symptoms: టీబీ వ్యాధి వచ్చే అవకాశం వీరికే ఎక్కువ, కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి
TB Symptoms: టీబీ వ్యాధి ప్రాణాంతకమైనది. అయితే చికిత్స జాగ్రత్తగా తీసుకుంటే మళ్లీ ఆరోగ్యంగా జీవించవచ్చు. అయితే టీబీ వ్యాధి కొంతమందికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

టీబీ వ్యాధిని తెలుగులో క్షయ అని పిలుస్తారు. ఈ క్షయ వ్యాధి వస్తే మనిషి రూపురేఖలే మారిపోతాయి. పాతికేళ్ళ అందమైన యువతి కూడా సన్నగా, పీలగా మారి అందవిహీనంగా తయారవుతుంది. క్షయ వ్యాధి బాధితులు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. టీబీ అనేది ఊపిరితిత్తులకు సోకే సమస్య. ఇది మన శరీరంలో ఏ అవయవానికైనా వచ్చే అవకాశం ఉంది. కేవలం జుట్టు, గోర్లు తప్ప ఇతర అవయవాలకు క్షయ బ్యాక్టీరియా సోకే అవకాశం ఎక్కువ. ఇది అంటువ్యాధి కూడా. కాబట్టి క్షయ వ్యాధి ఉన్నవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
టీబీ అంటువ్యాధి
టీబీ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది. అందుకే ఇంట్లో ఎవరికైనా టీబీ వ్యాధిగ్రస్తులు ఉంటే వారికి ఒక గదిని కేటాయించి వారి వస్తువులను ఇతరులు వాడకుండా జాగ్రత్తపడాలి. వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే నీటి తుంపర్లను ఆ వ్యాధికారక బ్యాక్టీరియా ఎదుటివారికి సోకుతుంది. అలాగే ఈ బ్యాక్టీరియా గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. అది ఎదుటివారి శరీరంలో ఏ అవయవాలకైనా ప్రభావం చేయవచ్చు. కాబట్టి టీబీ వ్యాధితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
క్షయ లక్షణాలు
ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, సాయంత్రమయ్యేసరికి జ్వరం రావడం, విపరీతంగా చెమటలు పట్టడం అనేది టీబీ వ్యాధి లక్షణాలగానే చెప్పుకుంటారు. ఆకలి తగ్గిపోవడం వల్ల ఆ మనిషి రెండు వారాల్లోనే సన్నగా మారిపోతారు. ఊపిరితిత్తులకు క్షయ వ్యాధి సోకితే దగ్గు, ఆయాసం విపరీతంగా వస్తుంది. అలాగే రక్తం కూడా కనిపిస్తుంది. టీబీ వ్యాధి పేగులకు కూడా సోకే అవకాశం ఉంది. పేగులకు సోకితే పొట్ట ఉబ్బినట్టు అవుతుంది. మెడ భాగంలో ఉండే లింఫ్ నోడ్స్‌కు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ఎప్పుడైతే సోకుతుందో అవి వాచినట్టు అవుతాయి. నొప్పిగా అనిపిస్తాయి. మెదడుకు కూడా టీబీ సోకవచ్చు. మెదడుకు టీబీ సోకితే దీర్ఘకాలికంగా జ్వరం వస్తుంది. స్పృహ తగ్గిపోతుంది. ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఆడవారిలో ఫెలోపియన్ ట్యూబులకు కూడా క్షయ సోకుతుంది. దీనివల్ల వారికి పిల్లలు పుట్టడం కష్టమైపోతుంది.
టీబీ ఎవరికి ఎక్కువగా వస్తుంది?
క్షయ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా కొంతమందికే ఉంటుంది. ముఖ్యంగా ఎవరి రోగ నిరోధక శక్తి అయితే చాలా తక్కువగా ఉంటుందో అలాంటి వారిలో ఈ బ్యాక్టీరియా త్వరగా ఎదుగుతుంది. అలాగే హెచ్ఐవితో బాధపడుతున్న వారికి కూడా టీబీ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వీరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అలాగే డయాబెటిస్ వంటి రోగాలతో బాధపడుతున్న వారికి కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారు కూడా టీబీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తంబాకు, జర్ధా, గుట్కా వంటివి నమిలేవారు, సిగరెట్టు, బీడీలు తాగే వారు, మాదకద్రవ్యాలు తీసుకునే వారు, మద్యపానం ప్రతిరోజు అలవాటు ఉన్నవారిలో కూడా టీబీ వ్యాధి త్వరగా సోకే అవకాశం ఉంటుంది. గర్భిణులు, బాలింతలలో కూడా రోగనిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది. కాబట్టి క్షయ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా వారిలోనూ కూడా అధికంగా పెరుగుతుంది. పేదరికంతో ఉన్నవారు, అపరిశుభ్ర వాతావరణంలో జీవిస్తున్న వారు, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిపై కూడా టీబీ తన ప్రతాపాన్ని చూపిస్తుంది.
టీబీ రాకుండా చేయడానికి పుట్టిన వెంటనే పిల్లలకు బీసీజీ టీకా ఇప్పించమని చెబుతారు. అయితే ఈ టీకా తీసుకున్న తర్వాత క్షయ వ్యాధి ఎప్పటికీ సోకదు అని చెప్పలేము. అయితే టీబీ సోకినా కూడా అది తీవ్రంగా మారకుండా చికిత్సకు లొంగేలా ఉంటుంది. పోషకాహారం తినడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం వల్ల టీబీ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.
చికిత్స ఎలా ఉంటుంది?
మొదటిసారి టీబీ వచ్చిన వారిలో చికిత్సలో టాబ్లెట్లను అందిస్తారు. అలాగే క్షయ ఏ అవయవానికి సోకిందో దాన్ని బట్టి కూడా చికిత్స ఆధారపడి ఉంటుంది. దాదాపు ఆరు నెలల నుంచి ఏడాది వరకు మందులు వాడవచ్చు. అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి పరీక్షలు చేస్తారు. బ్యాక్టీరియా ఉందో పోయిందో చెక్ చేస్తూ ఉంటారు. క్షయ వ్యాధికి ఇచ్చిన మాత్రలు వేసుకోవడం వల్ల వికారంగా అనిపించి వాంతులు అవుతూ ఉంటాయి. దీనివల్ల ఎంతో మంది రోగులు మాత్రలు వేసుకోవడం ఆపేస్తూ ఉంటారు. దీనివల్ల వ్యాధి మరింత ముదిరిపోతుంది. క్షయ వ్యాధికి ఇచ్చే మందుల వల్ల ఉన్న ఇబ్బందులు రోగులను ఆ మందులు వాడకుండా చేస్తున్నాయి. నిజానికి అన్నింటినీ తట్టుకొని టీబీ మందులు వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏడాదిలోనే ఆరోగ్యంగా తయారవచ్చు. అయితే టీబీ ఒకసారి తగ్గాక మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
సంబంధిత కథనం