






Best Web Hosting Provider In India 2024

Easy Halwa: మూడే పదార్థాలతో స్వీట్ హల్వా ఇలా చేసేయండి, పండుగలలో నైవేద్యంగా కూడా పెట్టవచ్చు
Easy Halwa: స్వీట్ రెసిపీలు చాలా మందికి ఇష్టం. కేవలం మూడే పదార్థాలతో హల్వా ఎలా చేయాలో చెప్పాము. ఇది గోధుమపిండితో తయారుచేస్తారు. దీన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది.

ఏ పండుగకైనా తీపి పదార్థాలు ఉండాల్సిందే. త్వరలో రంజాన్ పండుగ వచ్చేస్తుంది. ఆరోజు పాయసాలు ఘుమఘుమలాడుతాయి. అలాగే ఇక్కడ ఇచ్చిన హల్వా కూడా ప్రయత్నించి చూడండి. ఈ స్వీట్ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. దీన్ని చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. మూడు రకాల పదార్థాలు ఉంటే చాలు. సులువుగా చేసేయొచ్చు. అలాగే ఇంట్లో పండగలప్పుడు ప్రసాదాలు పెట్టాలనుకుంటే ఈ హల్వా ట్రై చేయండి. ఇది గోధుమపిండితో చేసే హల్వా. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
గోధుమపిండి హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి – ఒక కప్పు
నీళ్లు – రెండు కప్పులు
పంచదార – ఒక కప్పు
నెయ్యి – అరకప్పు
జీడిపప్పులు – గుప్పెడు
గోధుమపిండి హల్వా రెసిపీ
1. ఈ హల్వాలో మనం ప్రధానంగా వాడేవి గోధుమపిండి, పంచదార, నెయ్యి.
2. ఈ మూడింటితో స్వీట్ రెసిపీ చాలా తాజాగా టేస్టీగా తయారవుతుంది.
3. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి పంచదారను వేయండి.
4. అందులో రెండు కప్పుల నీటిని వేసి పంచదార బాగా కలిసిపోయి సిరప్ లా తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి.
5. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేయండి.
6. ఆ నెయ్యిలో జీడిపప్పులను వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
7. మిగతా నెయ్యిలో గోధుమ పిండిని వేసి బాగా కలపండి.
8. అది ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి.
9. ఈ గోధుమ పిండిలో నెయ్యి బాగా కలిసి దగ్గరగా అవుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ను కూడా వేసి బాగా కలపాలి.
10. ఈ మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద అలా కలుపుతూనే ఉండాలి.
11. ఇది దగ్గరగా హల్వాలాగా అయ్యే వరకు కలపాలి.
12. కళాయికి ఏమీ అతుక్కోకుండా మొత్తం దగ్గరగా అవుతుంది.
13. ఆ టైంలోనే ముందుగా వేయించుకున్న జీడిపప్పులను కూడా ఇందులో వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
14. అంతే టేస్టీ గోధుమపిండి హల్వా రెడీ అయిపోతుంది.
15. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. పైగా చాలా సులువుగా చేసేయొచ్చు.
హిందువుల పండగల్లో దేవతలకు ఏదైనా స్వీట్ రెసిపీ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అలా మీరు ఇక్కడ ఇచ్చిన గోధుమపిండి హల్వాను సులువుగా చేసి పెట్టవచ్చు. పైగా ఇది అద్భుతమైన రుచితో ఉంటుంది. మీకు పంచదార వాడడం ఇష్టం లేకపోతే బెల్లాన్ని వాడవచ్చు. కాకపోతే హల్వా ముదురు రంగులో వస్తుంది. కారణం బెల్లం రంగే. అలా అప్పుడప్పుడు ఈ హల్వాను చేసుకుని తినండి. మీకు మంచి టైం పాస్ లా ఉంటుంది. పైగా టేస్టీగా ఉంటుంది.
ఇంటికి అసలు వచ్చినప్పుడు పావు గంటలో ఈ రెసిపీని మీరు చేసేయొచ్చు. ఒకసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. పైగా తక్కువ ఖర్చులోనే ఇది తయారైపోతుంది. ఇదే హల్వాను బయట కొనాల్సి వస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇంట్లోనే ఈ గోధుమపిండి హల్వా చేసేందుకు ప్రయత్నించండి.
సంబంధిత కథనం