




Best Web Hosting Provider In India 2024
Salary hike : ఎంపీల జీతాలను భారీగా పెంచిన కేంద్రం- పింఛను కూడా! ఎంత అందుతుందంటే..
MPs salary hike : ఎంపీల జీతాలు, మాజీ ఎంపీల పింఛను, అదనపు పింఛనును పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎంత పెంచింది? తాజా పెంపుతో ఎంపీల జీతాలు ఎలా ఉన్నాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంపీలు, మాజీ ఎంపీల జీతాలు, పింఛన్లు, అదనపు పింఛన్లను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. వీటిని ఈసారి 24శాతం పెంచింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ని జారీ చేసింది.
అంతేకాదు, జీతాలతో పాటు సిట్టింగ్ ఎంపీల రోజువారీ అలొవెన్సులను సైతం కేంద్రం పెంచింది.
1961 ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న వ్యయ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా పార్లమెంటు సభ్యుల జీతం, అలొవెన్సులు, పింఛను చట్టం కింద మంజూరు చేసిన అధికారాలను ఉపయోగించి ఈ వేతన పెంపును నోటిఫై చేసింది కేంద్రం.
తాజా పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుందని తెలుస్తోంది.
“పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, పెన్షన్ చట్టం, 1954 (30 ఆఫ్ 1954) లోని సెక్షన్ 3లోని సబ్ సెక్షన్ (2), సెక్షన్ 8ఎలోని సబ్ సెక్షన్ (1ఎ) ప్రసాదించిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యుల జీతం, రోజువారీ భత్యం, పింఛను, అదనపు పింఛను పెరుగుదలను సెక్షన్ 4లోని క్లాజ్ (వీ) కింద పేర్కొన్న వ్యయ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా నోటిఫై చేస్తోంది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది,” అని నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది.
జీతం పెంపుతో కొత్తగా ఎంపీలకు అందే అమౌంట్..
- వేతనం: ఎంపీల నెలసరి వేతనం రూ.1,00,000 నుంచి రూ.1,24,000కు పెరిగింది.
- డైలీ అలొవెన్స్: రోజువారీ అలొవెన్స్ని రూ.2,000 నుంచి రూ.2,500కు పెంచారు.
- మాజీ పార్లమెంటు సభ్యుల పెన్షన్ను రూ.25 వేల నుంచి రూ.31 వేలకు పెంచారు.
- ఐదేళ్ల సర్వీసులో ఉన్న ప్రతి ఏడాది అదనపు పెన్షన్ని నెలకు రూ.2 వేల నుంచి రూ.2,500కు పెంచారు.
కర్ణాటక ప్రభుత్వం..
పార్లమెంటు ఎంపీలే కాదు.. కర్ణాటకలోని ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇటీవలే జీతాల పెంపును చూశారు. 2025 బడ్జెట్ సమావేశాల రెండో దశలో.. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తమ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు 100 శాతం వేతన పెంపునకు ఆమోదం తెలిపింది.
కర్ణాటక మంత్రుల జీతభత్యాల సవరణ బిల్లు ప్రకారం ముఖ్యమంత్రి నెలసరి వేతనం రూ.75 వేల నుంచి రూ.1.5 లక్షలకు, మంత్రుల జీతాలు రూ.60 వేల నుంచి రూ.1.25 లక్షలకు పెరుగుతాయి.
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకించడంతో కర్ణాటక మంత్రుల జీతభత్యాల సవరణ బిల్లు, కర్ణాటక శాసనసభ జీతభత్యాలు, పింఛన్లు, అలొవెన్సుల (సవరణ) బిల్లు 2025 గందరగోళం మధ్య, ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందాయి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link