Best Web Hosting Provider In India 2024
అమరావతి: తుపాను బాధితులకు నిత్యావసరాల సరుకులతోపాటు ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రతి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటనకు అనుగుణంగా రెవెన్యూ శాఖ శుక్రవారం సాయంత్రం జీవో ఆర్‌టీ నెంబర్ 67 జారీ చేసింది. ఇప్పటివరకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2,500 చొప్పున అందిస్తూ వస్తున్నారు. తాజాగా పునరావాస కేంద్రాలకు రాని బాధిత కుటుంబాలకు సైతం ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మాదిరిగానే ఈ ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్లకు సూచించారు. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 10 వేల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయగా మిగిలిన కుటుంబాలకు కూడా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.