





Best Web Hosting Provider In India 2024

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. గాల్లో తేమలో అనూహ్య మార్పులు.. ఉక్కపోత, వడగాలులతో జనం విలవిల.. కోస్తాకు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఎండలు మండిపోయాయి. భానుడి భగభగలతో జనం అల్లాడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా జిల్లాల్లో ఉక్కపోత ఎండ వేడితో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఎండల తీవ్రతతో జనం అల్లాడిపోయారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించి నమోదయ్యాయి. గత వారం వాతావరణ మార్పులతో కాస్త చల్లబడినా తిరిగి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.
ఏపీలో ఆదివారం ఎండలు ఠారెత్తించాయి. రోజంతా భానుడి ప్రభావం కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది. రాయలసీమలో గాలిలో తేమశాతం తగ్గడంతో ప్రజలు ఠారెత్తిపోయారు.
కోస్తా జిల్లాల్లోకొన్నిచోట్ల సముద్రం నుంచి వచ్చే గాలులతో గాలిలో శాతం తేమశాతం పెరిగి ఉక్కపోతతో జనం విలవిలలాడారు. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత పెరగడంతో ఓ వైపు ఎండ తీవ్రత, మరో వైపు ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది వేసవిలో తొలిసారి తిరుపతిలో 43.6 డిగ్రీల గరిష్ఠ అత్యధిక ఉష్ణోగ్రత ఆదివారం నమోదైంది. నంద్యాల జిల్లా అవుకులో 42.6, తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5, నెల్లూరు జిల్లా మునుబోలులో 42.4, పల్నాడు జిల్లా వినుకొండ, కడప జిల్లా ఉప్పలూరులో 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వాతావరణంలో కొనసాగుతున్న అనిశ్చితి…
మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితలద్రోణి విస్తరించి ఉంది. ఆదివారం అక్కడక్కడ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన జల్లులు కురిశాయి. రాగల ఐదు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని, ఎండ తీవ్రత కొనసాగుతుంది.
ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని విశాఖ వాతావ రణ శాఖ తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని 31 మండలాల్లో తీవ్రంగా, 20 మండలాల్లో మోస్త రుగా వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం వైఎస్సార్, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, పార్వతీపురం మన్యం, అన్నమయ్య జిల్లాల్లో పలు చోట్ల వానలు పడ్డాయని పేర్కొంది.
సోమవారం శ్రీకాకుళంలో 4 మండలాలు, విజయనగరంలో 16, పార్వతీపురం మన్యంలో 11 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం 10 మండలాల్లో తీవ్ర వడగాలులు,15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్