




Best Web Hosting Provider In India 2024

తెలంగాణ ‘భూ భారతి’ పోర్టల్ సేవలు – నిషేధిత భూముల వివరాలను ఇలా తెలుసుకోండి
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రావటంతో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ లోనూ పలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే నిషేధిత భూముల వివరాలను కూడా ఇందులో పొందుపరిచారు.
తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారులు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. మండలాల వారీగా వీటిని చేపడుతూ… కొత్త చట్టం ప్రయోజనాలను వివరిస్తున్నారు.
భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. గతంలో ఉన్న ఆర్వోఆర్-2020ను రద్దు కావటంతో… భూ భారతి చట్టం ఆధారంగానే భూముల నిర్వహణ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వంటి ప్రక్రియలో ప్రభుత్వం పలు మార్పులను కూడా తీసుకువచ్చింది.
రైతులకు ఇబ్బందులు లేకుండా కొత్త చట్టంలో కీలక సెక్షన్లను పొందుపర్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. పోర్టల్ లో చూస్తే లావాదేవీల నిర్వహణతో పాటు సమాచార సేవలను వేర్వురుగా పొందుపరిచారు. అయితే ఇందులో నిషేధిత భూముల జాబితాను కూడా పొందుపరిచారు.
నిషేధిత భూముల వివరాలను ఇలా చెక్ చేసుకోండి:
- నిషేధిత భూమి వివరాలు తెలుసుకునేందుకు ముందుగా భూ భారతి అధికారిక పోర్టల్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే సమాచార సేవల్లోకి వెళ్లాలి. ఇక్కడ నిషేధిత భూములు అనే ఆప్షన్ ఉంటుంది.
- నిషేధిత భూముల ఆప్షన్ పై క్లిక్ మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ జిల్లా, మండలం, గ్రామ వివరాలను నమోదు చేయాలి. అక్కడ సూచించే కోడ్ ను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ చేస్తే గ్రామం వారీగా నిషేధిత భూముల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- నిషేధిత భూములపై లావాదేవీలు నిర్వహించడానికి వీలు ఉండదు.
గతంలో ధరణి పోర్టల్ ఉండగానే..ఈ భూముల వివరాలను ప్రత్యేక కాలమ్ లో ఉంచారు. అయితే కొన్ని పట్టా భూములు కూడా ఈ జాబితాలో చేరాయనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వీటిని పరిశీలించి.. తొలగించే అధికారం కలెక్టర్లకు ఉండేది. అయితే ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. అయితే ప్రస్తుతం భూమి స్వరూపానికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పిస్తే… కలెక్టర్ పరిశీలించి… నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.
ఇక రాష్ట్రంలో భూ హక్కుల ఏ విధంగా సంక్రమించినప్పటికీ మ్యుటేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేస్తారు. కొత్తగా ఇచ్చే పాసుపుస్తకాల్లో సర్వే మ్యాప్ ఉంటుంది. భూ సమస్యల పరిష్కానిరి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. భూ హక్కుల రికార్డుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ధరణి వ్యవస్థలో అప్పీల్ వ్యవస్థకు చోటు కల్పించలేదు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అక్రమంగా ప్రభుత్వ భూములపై పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి నిషేధిత భూముల వివరాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు….
సంబంధిత కథనం
టాపిక్