హిట్ 3 రివ్యూ – యాక్ష‌న్ ల‌వ‌ర్స్ నాని ట్రీట్‌ – క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

హిట్ 3 రివ్యూ – యాక్ష‌న్ ల‌వ‌ర్స్ నాని ట్రీట్‌ – క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh HT Telugu

నాని హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హిట్ 3 గురువారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ ఎలా ఉందంటే?

హిట్ 3 రివ్యూ

టాలీవుడ్‌లో కొత్త‌ద‌నానికి, వైవిధ్య‌త‌కు మారుపేరుగా హీరో నాని సినిమాలు నిలుస్తుంటాయి. ఇమేజ్ ఛ‌ట్రంలో బంధీ కాకుండా ప్ర‌తి సినిమాలో హీరోగా త‌న‌ను తాను కొత్త పంథాలో ఆవిష్క‌రించుకుంటుంటారు. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా కంప్లీట్ యాక్ష‌న్ క‌థ‌తో నాని చేసిన తాజా మూవీ హిట్ 3.

హిట్ ఫ్రాంచైజ్‌లో మూడో మూవీగా వ‌చ్చిన ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. మే 1న (నేడు) థియేట‌ర్ల‌లో రిలీజైన‌ హిట్ 3 ఎలా ఉంది? యాక్ష‌న్ క‌థ‌తో నాని ఆడియెన్స్‌ను మెప్పించాడా? లేదా? అంటే?

అర్జున్ స‌ర్కార్ క‌థ‌…

అర్జున్ స‌ర్కార్ (నాని) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. ఏపీకి ఎస్‌పీగా బ‌దిలీపై వ‌స్తాడు. నిజాయితీతో పాటు కోపం ఎక్కువే. సొసైటీలో క్రిమిన‌ల్ అనే వాడు క‌నిపించ‌కూడ‌దు అన్న‌ది అత‌డి సిద్ధాంతం.

అర్జున్ స‌ర్కార్‌కు దొరికితే క్రిమిన‌ల్స్‌కు న‌ర‌క‌మే. క్రూరంగా హింసిస్తుంటాడు. అర్జున్ తీరుపై అధికారుల‌తో పాటు ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుంది. కానీ అవేవి ప‌ట్టించుకోకుండా డ్యూటీలో ముందుకు సాగిపోతుంటాడు అర్జున్ స‌ర్కార్‌.

సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ అయిన అర్జున్ స‌ర్కార్ అస‌లు ఎందుకు హ‌త్య‌లు చేస్తున్నాడు? జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎస్‌పీగా ప‌నిచేసిన అర్జున్ స‌ర్కార్ టెర్ర‌రిస్ట్‌ల‌కు ఎలాంటి శిక్ష‌లు విధించాడు? దేశంలో ఒకే రోజు ఒకే రీతిలో జ‌రిగిగిన ప‌ద‌మూడు హ‌త్య‌ల వెన‌కున్న మిస్ట‌రీ ఏంటి? ఈ హ‌త్య‌లు చేసిన సైకో కిల్ల‌ర్స్‌ ఎవ‌రు?

సీటీకే అనే డార్క్ వెబ్‌సైట్ వెన‌కున్న వ్య‌క్తిని అర్జున్ స‌ర్కార్ క‌నిపెట్టాడా? సీటీకే ఆగ‌డాల‌ను అర్జున్ అడ్డుకున్నాడా? మృదుల‌తో అర్జున్ ప్రేమాయ‌ణం సాఫీగా సాగిందా? లేదా? అర్జున్ గురించి వ‌ర్ష‌కు తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? అన్న‌దే హిట్ 3లో మిగిలిన క‌థ‌.

క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌…

నాని సినిమా అంటే సెన్సిబుల్ స్టోరీస్‌, సింపుల్ ఎమోష‌న్స్‌తో హాయిగా న‌వ్విస్తుంటాయ‌నే అభిప్రాయం ఆడియెన్స్‌లో ఉంది. వాటికి పూర్తి భిన్నంగా నాని చేసిన ప్ర‌య‌త్న‌మే హిట్ 3. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ఈ మూవీని తెర‌కెక్కించాడు. క‌థ ప‌రంగా చూసుకుంటే హిట్ 3 కొత్త‌దేమీ కాదు. ఓ సైకో కిల్ల‌ర్‌…అత‌డిని ప‌ట్టుకొనే పోలీస్ ఆఫీస‌ర్… ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తులు.. ఈ రెగ్యుల‌ర్ ఫార్ములాలోనే ఈ మూవీ సాగుతుంది.హిట్, హిట్ 2లో ఇదే చూపించారు ద‌ర్శ‌కుడు.

ట్రీట్‌మెంట్‌…

ఈ రొటీన్ స్టోరీని నాని క్యారెక్ట‌రైజేష‌న్‌, బాడీలాంగ్వేజ్‌తో కొత్త‌గా చెప్పారు డైరెక్ట‌ర్‌. ఇదివ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్‌పై రాని ఓ కొత్త క్రైమ్ ఎలిమెంట్‌ను ఈ మూవీలో ట‌చ్ చేశాడు డైరెక్ట‌ర్‌. ఆ ట్రీట్‌మెంట్ సినిమాకు ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చింది. నాని హీరోయిజం, ఎలివేష‌న్లు, అత‌డిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ హిట్ 3ని పూర్తిగా నిల‌బెట్టాయి. క‌థ డ‌ల్ అవుతోంద‌ని అనుకున్న ప్ర‌తిసారి ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో ఆడియెన్స్‌కు హై మూవ్‌మెంట్ ఇస్తుంది.

యాక్ష‌న్ ప్ర‌ధానంగా…

కేవ‌లం క్రైమ్ ఎలిమెంట్స్‌కు ప‌రిమితం కాకుండా తండ్రీకొడుకుల అనుబంధం, ల‌వ్‌స్టోరీకి క‌థ‌లో చోటిచ్చాడు డైరెక్ట‌ర్. ఫ‌స్ట్ హాఫ్‌లో నాని, స‌ముద్ర‌ఖ‌ని కాంబినేష‌న్స్‌లో వ‌చ్చే సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. నాని, శ్రీనిధి శెట్టి ల‌వ్ ట్రాక్ పెద్ద‌గా కంప్లైంట్స్ ఏం లేకుండా సాఫీగా సాగిపోతుంది. పెళ్లిచూపుల ఎపిసోడ్స్ న‌వ్విస్తాయి.

సెకండాఫ్ కంప్లీట్‌గా యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఈ మూవీ సాగుతుంది. సీటీకే గ్యాంగ్‌పై అర్జున్ చేసే పోరాటాన్ని థ్రిల్లింగ్ చూపించారు. హీరోనే సైకోగా మారితే ఎలా ఉంటుందో చాలా వ‌య‌లెంట్‌గా ఆవిష్క‌రించారు. అయితే ఈ వ‌య‌లెన్స్ విష‌యంలో కొన్ని చోట్ల ద‌ర్శ‌కుడు హ‌ద్దులు దాటిన‌ట్లుగా అనిపిస్తుంది. సైకో కిల్ల‌ర‌క్స్ చేసే హ‌త్య‌ల‌ను సున్నిత మ‌న‌స్కులు త‌ట్టుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే.

కానీ కావాల‌నే కాకుండా క‌థ‌లో భాగంగానే యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌లా వీటిని డిజైన్ చేసుకోవ‌డం బాగుంది. ఈ యాక్ష‌న్ సీన్స్ రూప‌క‌ల్ప‌న‌లో మార్కో, యానిమ‌ల్ లాంటి ఇండియ‌న్ మూవీస్‌తో పాటు జాన్‌విక్, స్క్విడ్ గేమ్ లాంటి హాలీవుడ్ సినిమాలు, సిరీస్‌ల ప్ర‌భావంతోనే ద‌ర్శ‌కుడిపై బాగానే ప‌డిన‌ట్లు క‌నిపించింది.

రిస్కీ క్యారెక్ట‌ర్‌లో…

న‌టుడిగా నానిని కొత్త కోణంలో హిట్ 3 ఆవిష్క‌రించింది. త‌న‌కున్న ఇమేజ్‌ను బ్రేక్ చేస్తూ ఇలాంటి రిస్కీ క్యారెక్ట‌ర్ చేయ‌డం ఒక‌ర‌కంగా సాహ‌స‌మ‌నే చెప్పాలి. నాని లోని మాస్ యాంగిల్‌ను పూర్తిస్థాయిలో వెలికి తీసిన మూవీ ఇది. కంప్లీట్ యాక్ష‌న్ రోల్‌లో అద‌ర‌గొట్టాడు. రొమాంటిక్ సీన్ల‌లో మెప్పించాడు.

శ్రీనిధి శెట్టికి ఇదే ప‌స్ట్ తెలుగు మూవీ. ఆమె రోల్‌లో చాలా స‌ర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. గ్లామ‌ర్‌తో మెప్పించింది. సైకో కిల్ల‌ర్‌గా బాలీవుడ్ యాక్ట‌ర్ ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ హీరోగా ధీటైన పాత్ర‌లో క‌నిపించాడు. స‌ముద్ర‌ఖ‌ని, కోమ‌లి

ప్ర‌సాద్‌, మాటంటి శ్రీనాథ్‌తో తో పాటు మిగిలిన వారికి క‌థ‌లో భాగంగా చేస్తూ డీటైలింగ్ వారి క్యారెక్ట‌రైజేష‌న్లు రాసుకోవ‌డం బాగుంది.

తెర వెనుక హీరో…

సినిమాటోగ్రాఫ‌ర్‌ సాను జాన్ వ‌ర్గీస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ మిక్కీ జే మేయ‌ర్ హిట్‌3కి తెర వెనుక హీరోలుగా నిలిచారు. విజువ‌ల్స్ బాగున్నాయి. హీరోగానే కాకుండా నిర్మాత‌గాను నాని ఈ మూవీతో మెప్పించారు. బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డ రాజీ ప‌డ‌కుండా ప్ర‌శాంతి తిపిరినేనితో క‌లిసి ఈ మూవీని నిర్మించారు.

యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌కు ట్రీట్‌

హిట్ 3 యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌కు ట్రీట్ లాంటి మూవీ. నాని యాక్టింగ్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ కోసం ఈ మూవీని చూడొచ్చు. ప‌క్కా పైసా వ‌సూల్ మూవీ ఇది.

రేటింగ్‌: 3.25/5

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024