



Best Web Hosting Provider In India 2024

‘అమరావతి’ పునఃప్రారంభ పనులు – ప్రధాని మోదీ ఏపీ టూర్ ఇలా సాగనుంది
ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం (మే 2) మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రధాని మోదీ అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల లోపు టూర్ పూర్తవుతుంది.
అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి మోదీ రానున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రికి కూటమి ప్రభుత్వం ఘన స్వాగతం పలకనుంది.
ప్రధాని మోదీ టూర్ వివరాలు:
- ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.55కి కేరళలోని తిరువనంతపురం నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకి వస్తారు.
- గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రికి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు.
- మధ్యాహ్నం 3.15కి అమరావతి హెలిప్యాడ్‌కి చేరతారు. హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు. తర్వాత 3.20కి సభా వేదిక దగ్గరకు చేరుకుంటారు.
- మధ్యాహ్నం 3.30 నుంచి 4.45 వరకు అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
- రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు రూ.57వేల కోట్లతో చేపట్టిన పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్‌గా చేస్తారు.
- ఒక గంటకుపైగా ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు.
- సాయంత్రం 4:55 గంటలకు తిరిగి హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లనున్నారు. మొత్తంగా సాయంత్రం 5 గంటలలోపే ప్రధానమంత్రి మోదీ ఏపీ టూర్ ముగుస్తుంది.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణమంతా ఎస్పీజీ ఆధీనంలో ఉండనుంది. ఇప్పటికే ఆయా బలగాలు మోహరించాయి. ఇక మోదీ పాల్గొనే సభపైకి కూడా అతి తక్కువ మందికే అవకాశం ఉండనుంది. మొత్తంగా 14 మందికి మాత్రమే చోటు కల్పించనున్నారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు, కూటమి నేతలకు అవకాశం ఉండనుంది.
అమరావతి రాజధాని పున: ప్రారంభ పనులకు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో విజయవాడలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుపోకుండా ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లడం ఉత్తమమని పోలీసులు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలలో అనధికారికంగా ఎవరైనా డ్రోన్లు ఎగరవేసినా , బ్లాక్ బెలూన్స్, ఇతర రకాలైన బెలూన్స్ ఎగరవేసిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సంబంధిత కథనం
టాపిక్