



Best Web Hosting Provider In India 2024
‘‘ముస్లింలను, కశ్మీరీలను టార్గెట్ చేయొద్దు’’- పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ అధికారి భార్య విజ్ఞప్తి
పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన 26 మందిలో ఒకరైన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 27వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భార్య హిమాన్షి నర్వాల్ శాంతి, ఐక్యత కోసం హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు.
ఇండియన్ నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 27వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి హిమాన్షి నర్వాల్ శాంతి, ఐక్యత కోసం హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన 26 మందిలో వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు.
టార్గెట్ చేయొద్దు..
గురుగ్రామ్ కు చెందిన పీహెచ్ డీ స్కాలర్ హిమాన్షి నర్వాల్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ తన భర్త కోసం యావత్ దేశం ప్రార్థించాలని, ఆయన ఎక్కడున్నా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి కోపాన్ని ఏ సామాజికవర్గం పైనా రుద్దవద్దని ఆమె నొక్కి చెప్పారు. ఏ సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేయడం తమకు ఇష్టం లేదని అన్నారు. ముస్లింలు, కశ్మీరీలకు వ్యతిరేకంగా ప్రజలు వెళ్లడం తమకు ఇష్టం లేదన్నారు. ‘మాకు శాంతి కావాలి. శాంతి మాత్రమే కావాలి. మాకు న్యాయం కావాలి’ అని ఆమె కోరారు.
రక్తదాన శిబిరం
నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ 27వ జయంతి సందర్భంగా హర్యానాలోని కర్నాల్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. నేవీ అధికారికి నివాళులు అర్పిస్తున్న సమయంలో నర్వాల్ తల్లిదండ్రులు, భార్య హిమాన్షి కన్నీరుమున్నీరయ్యారు. కర్నాల్ కు చెందిన ఎన్జీవో నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్ ఈ శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగిస్తూ దివంగత అధికారి సేవలో ఉన్నప్పుడు అంకితభావంతో దేశానికి సేవలందించారని, ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ ఉగ్రవాదులు అమాయక ప్రజల రక్తాన్ని చిందిస్తుంటే, ఈ రక్తదాన శిబిరం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని వక్త ఒకరు అన్నారు. కార్యక్రమంలో కర్నాల్ బీజేపీ ఎమ్మెల్యే జగ్మోహన్ ఆనంద్ కూడా ఉన్నారు.
వారం ముందే వివాహం
ఏప్రిల్ 22 ఉగ్రదాడికి వారం రోజుల ముందే వినయ్ నర్వాల్, హిమాన్షిల వివాహం జరిగింది. హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారు. అక్కడే దురదృష్టవశాత్తూ వినయ్ నర్వాల్ ఉగ్రవాదుల కాల్పుల్లో నర్వాల్ చనిపోయారు. ఘటనా స్థలం నుంచి హిమాన్షి ‘‘నేను భెల్ పూరీ తింటున్నాను, నా భర్త నాతోనే ఉన్నాడు. ఓ వ్యక్తి వచ్చి నా భర్తను నువ్వు ముస్లింవా అని అడిగాడు. నా భర్త కాదు అని చెప్పడంతో ఆ వ్యక్తి వెంటనే నా భర్తను కాల్చి చంపాడు’’ అని కన్నీళ్లతో చెప్పిన వీడియో వైరల్ గా మారింది. నర్వాల్ సహోద్యోగులు ఆయనను అంకితభావం కలిగిన అధికారిగా గుర్తు చేసుకున్నారు. 2022లో నౌకాదళంలో చేరిన నర్వాల్ ఏడాదిన్నరగా కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో విధులు నిర్వహిస్తున్నారు.
స్విట్జర్లాండ్ కు వెళ్లాల్సి ఉండగా..
ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న ఈ జంట హనీమూన్ లో భాగంగా జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా బైసరన్ కు వెళ్లారు. వారు నిజానికి స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకున్నారు. కానీ వీసా రావడానికి చాలా సమయం పడ్తుండడంతో వారు పహల్గామ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారని బంధువులు తెలిపారు. తన కుమారుడు వీర సైనికుడిలా చనిపోయాడని వినయ్ నర్వాల్ తండ్రి అన్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link