‘ఆర్టీసీని గాడిలో పెడుతున్నాం.. సమ్మె ఆలోచన వద్దు’ – సీఎం రేవంత్

Best Web Hosting Provider In India 2024

‘ఆర్టీసీని గాడిలో పెడుతున్నాం.. సమ్మె ఆలోచన వద్దు’ – సీఎం రేవంత్

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ఆర్టీసీని గాడిలో పెట్టి లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇలాంటి సమయంలో సమ్మె చేస్తే మొత్తం వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ విషయంపై ఆలోచన చేయాలని కోరారు.

ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

తెలంగాణలోని అసంఘటిత కార్మికుల కోసం దేశానికి రోల్ మాడల్‌గా ఉండే ఒక మంచి విధానం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న తరుణంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు.

సమ్మె వద్దు… ఆలోచన చేయండి – సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. ఆర్టీసీని గాడిలో పెట్టి లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. “మే డే రోజున కార్మిక సోదరులకు మాటిస్తున్నా. ఏ వెసులుబాటు ఉన్నా ప్రతి రూపాయి కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే బాధ్యత తీసుకుంటా. ఆర్టీసీ ఒకనాడు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు జరుగుతున్న ఆర్టీసీలో ఈరోజు లాభాల బాటలో నడిచి జీతాలు చెల్లించుకునే స్థాయికి చేరుకోవడంలో కార్మికుల కృషి ఎంతో ఉంది” అని కొనియాడారు.

“సమ్మెకు వెళ్లాలని చర్చలు చేస్తున్నారు. ఈ సంస్థ మీదే. ఏమాత్రం పట్టింపులకు వెళ్లొద్దు. రాజకీయంగా ఎవరైనా ప్రోత్సహిస్తే, ఏదైనా తప్పుగా నిర్ణయం తీసుకుంటే మొత్తం వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి ఉందన్న విషయాన్ని ఆలోచన చేయండి. మంత్రితో చర్చించండి. చేయగలిగిందేమున్నా చేస్తాం. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరుతో ఏదైనా పొరపాటు జరిగితే, మళ్లీ పునరుద్ధరించడానికి అవకాశం కూడా లేని పరిస్థితులు తలెత్తుతాయి. మీ అందరి సహకారంతో అన్నింటా తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. కార్మిక చట్టాలను సవరించి కార్మికులను ఆదుకునే విధానాన్ని తెచ్చి దేశానికి మార్గదర్శిగా తెలంగాణ నిలబెడుతాం” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

కొంత సమయం కావాలి….

తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ శాఖ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.. వారిని ఆదుకోవాలనే ఆలోచనతో సవరించుకుంటూ, సరిచేసుకుంటూ పాలన పరమైన ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.

“సింగరేణి సంస్థ లాభాల బాటలో నడవడమే కాకుండా గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో కార్మికులకు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు బోనస్ చెల్లించాం. బీమా సౌకర్యం అమలు చేస్తున్నాం. సింగరేణి సంస్థలను లాభాల బాటలో నడిపించడమే కాకుండా బొగ్గు ఉత్పత్తి పెంచి, కొత్త గనులను కేటాయించి నూతనంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నిస్తున్నాం. సింగరేణిలో దాదాపు 400 పైచిలుకు కారుణ్య నియామకాలు చేపట్టాం. ఆర్టీసీలోనూ కారుణ్య నియామకాలు చేపట్టాం” అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

“రైతు భరోసా, రైతు రుణమాఫీ, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, నిరుపేదలకు సన్నబియ్యం ఇలా రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ఇన్ని చేసినా సరిపోతాయని భావించడం లేదు. ఇంకా సమస్యలున్నాయి. కార్మికులకు కష్టాలున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించాలంటే కొంత సమయం కావాలి” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

“తెలంగాణలో పూర్తి చేసిన కుల గణన ఈరోజు దేశానికి ఆదర్శవంతంగా నిలబడింది. తెలంగాణ మాడలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసి వచ్చింది. కులగణన చేస్తామన్నాం. చేశాం. ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నాం. చేశాం. ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఇచ్చాం. సన్న బియ్యం ఇచ్చాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం… ఇలా చేయగలిగింది ప్రతిదీ చేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పుకుంటాం. సహకరించండి” అని ముఖ్యమంత్రి వివరించారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

TsrtcCm Revanth ReddyTelangana SscAap TelanganaHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024