



Best Web Hosting Provider In India 2024
పహల్గామ్ ఉగ్రవాదులు కశ్మీర్‌లోనే ఉన్నారా? దాడి సమయంలో బ్యాకప్ కోసం చాలామందే వచ్చారా?
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి చేసిన ఉగ్రవాదుల గురించి ఓ విషయం బయటకు వచ్చింది. ఇప్పటికీ వారు కశ్మీర్‌లోనే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో దాడి చేసిన ఉగ్రవాదుల గురించి కొత్త సమాచారం బయటపడింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇప్పటికీ కశ్మీర్‌లో చురుగ్గా ఉన్నారని, తలదాచుకుంటున్నారని సమాచారం. అయితే దీనిపై భారత సైన్యం నుంచి గానీ, జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు.
ఇక్కడే ఉన్నారా?
ఇండియా టుడే నివేదిక ప్రకారం, పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్లో దాక్కుని చురుకుగా ఉన్నట్లు సంకేతాలు ఉన్నాయని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బైసరన్‌లో దాడి సమయంలో మరింత మంది ఉగ్రవాదులు దూరంగా ఉండి ఉంటారని, బ్యాకప్ ఇవ్వడం ద్వారా ఉగ్రవాదులను కాపాడేందుకు ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.
బ్యాకప్‌లో
బాధితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను దర్యాప్తు సంస్థలు నమోదు చేశాయి. ఉగ్రవాదులు ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను మూసివేసి బైసరన్ వద్ద పర్యాటకులను బంధించినట్లు సమాచారం. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు ప్రధాన ద్వారం గుండా లోపలికి రాగా, ఒకరు ఎగ్జిట్ గేటు వద్ద ఉన్నారు. అయితే నాలుగో ఉగ్రవాది బ్యాకప్‌గా అడవిలో ఉన్నాడు. అయితే మరింత మంది లోపలివైపు ఉన్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
అక్కడే ఎక్కువ మరణాలు!
ఆ తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు అకస్మాత్తుగా జనంపై కాల్పులు జరిపారు. ఇద్దరు ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో ఉన్నట్లు సమాచారం. మూడో వ్యక్తి కశ్మీర్ సంప్రదాయ దుస్తుల్లో ఉన్నాడు. మెుదట బయటకు వెళ్లే రహదారిపై కాల్పులు జరపడంతో గందరగోళం నెలకొనడంతో పర్యాటకులు ప్రవేశ ద్వారం వైపు పరుగులు తీశారు. ఆ సమయంలో అప్పటికే అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు వారిపై దాడి చేశారు.
చాలా మంది పర్యాటకులు ఉన్న టీ, భేల్ పురి స్టాల్స్ సమీపంలోనే ఎక్కువ మరణాలు సంభవించాయని చెబుతున్నారు. దాడి అనంతరం ఉగ్రవాదులు గోడ దూకి పరారయ్యారు. దాడికి ముందు ఏప్రిల్ 15న ఉగ్రవాదులు మూడు చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
గతంలో దాడి
గతంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను కూడా పోల్చి చూస్తున్నారు. సోనామార్గ్ అని కూడా పిలిచే జెడ్ మోర్హ్ సొరంగంపై 2024 అక్టోబర్‌లో దాడి జరిగింది. ఇక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేందుకు బయటి నుంచి వచ్చిన కార్మికుల శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో ఆరుగురు కూలీలు, ఒక వైద్యుడు మృతి చెందారు.
ఈ రెండు ఉగ్రదాడులను లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాద విభాగం నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడిలో పాల్గొన్న పలువురు ఉగ్రవాదులు గతంలో సొరంగ కార్మికులపై దాడిలో పాల్గొన్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం ఈ పహల్గామ్ దాడిలో పేరున్న హషీమ్ మూసా కూడా సొరంగంపైన జరిగిన దాడిలో పాల్గొన్నాడు.
Best Web Hosting Provider In India 2024
Source link