





Best Web Hosting Provider In India 2024

రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం.. 1631 రోజుల పాటు ఏకబిగిన ఉద్యమం.. నేడు విజయోత్సవం
ఒకప్పుడు భుక్తి కోసం, భూమి కోసం జరిగిన ఉద్యమాలను చూసిన ఆంధ్రా ప్రజానీకం గత ఐదేళ్లలో రాజధాని ఉద్యమాన్ని చూడాల్సి వచ్చింది. రాజధాని నిర్మాణాన్ని అర్థాంతరంగా నిలిపి వేయడంతో భూములిచ్చిన రైతులు రోడ్ల పైకి వచ్చి పోరాటాలు చేయాల్సి వచ్చింది.
విభజిత ఏపీకి రాజధాని నిర్మాణం కోసం భూముల్ని వదులుకున్న రైతులకు గత ఐదేళ్లుగా రోడ్లపై పోరాటాలు చేయాల్సి వచ్చింది. విభజన తర్వాత రాజధాని నగరం రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలన్నది అప్పటి ప్రభుత్వం ఆలోచన.
ఈ ఆలోచన ప్రకారం గుంటూరు-కృష్ణా మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించలేదు. ఈ లోగా పక్కనే నది ఉండటం, అనువైన భూమి కావడంతో తుళ్లూరులో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సుమారు 30 వేల ఎకరాలు అవసరం అవుతుందని పాలక పక్షంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా సూచించారు. అయితే అన్ని వేల ఎకరాలు సేకరించాలంటే ప్రభుత్వంపై మోయలేనంత భారం పడుతుంది. అసలే రాష్ట్ర విభజన, వారసత్వంగా వచ్చిన అప్పులు, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది.
రాజధాని నిర్మాణం కోసం నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన నుంచి వచ్చిందే భూ సమీకరణ. దీని ప్రకారం రైతుల నుంచి ప్రభుత్వం భూములు తీసుకుంటుంది. భూములిచ్చిన రైతులకు రాజధానిలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు కేటాయించి ప్రభుత్వమే సౌకర్యాలు కల్పించి వాటిని అభివృద్ధి చేస్తుది. దీంతో వాటికి విలువ పెరుగుతుంది.
దీంతో పాటు పట్టా, అసైన్డ్ భూములకు ఏడాదికి రూ.50, రూ.30 వేల చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తుంది. ఈ నిర్ణయానికి రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో పాటు అతి తక్కువ సమయంలోనే 34 వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు.
ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల సీఎంలు, రాష్ట్ర ప్రజల సమక్షంలో అట్టహాసంగా రాజధానికి 2014 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. నాలుగేళ్లపాటు పనులు శరవేగంగా సాగడంతో పాటు రైతులకు ప్రభుత్వం ప్రతిఏటా అందించింది.
మూడు రాజధానులతో అమరావతికి ముప్పు..
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణాన్ని నిలిపి వేసింది. రోడ్డు వేసుకోవడానికి కూడా డబ్బులు లేని రాష్ట్రానికి ఇంత పెద్ద రాజధాని కట్టడానికి ఆర్థిక స్థోమత సరిపోదని చెప్పుకొచ్చారు. దక్షణాఫ్రికా తరహాలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్య నిర్వాహక రాజధాని వస్తాయని అసెంబ్లీలో 2019 డిసెంబర్ 17న ప్రకటించారు.
రాజధాని మార్చబోమని, అమరావతే ఉంటుందని ఎన్నికల ముందు తాను చెప్పిన మాటలను తానే కాలదన్నారు జగన్ రెడ్డి. దీంతో రాజధాని రైతుల్లో ఆందోళన మొదలైంది.
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేయొద్దని రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. ఆ ఆందోళనలు కాస్త పెద్ద ఉద్యమానికి దారి తీశాయి. ఈ క్రమంలో రైతుల ఉద్యమాలను అణిచి వేసే ప్రయత్నాలు జరిగాయి.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ జై అమరావతి నినాదంతో ఉద్యమంలో పాల్గొన్నారు. రైతులు అమరావతికి మద్దతును కూడగట్టుకునేందుకు ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిశారు. పంజాబ్ రైతుల ఉద్యమానికి మద్ధతుగా అక్కడికి వెళ్లారు. సుమారు 1,631 రోజుల పాటు నిరంతరాయంగా సాగిన ఉద్యమంగా అమరావతి ఉద్యమం చరిత్రపుటలెక్కుతుంది. రాజధాని సాధన కోసం అమరావతి రైతులు పలు యాత్రలు చేశారు.
కూటమి గెలుపుతో అమరావతి మలుపు
2024 ఎన్నికల్లో కూటమి గెలుపుతో అమరావతి మళ్లీ ఊపిరి పీల్చుకుంది. రైతుల కళ్లలో సంతోషం కమ్ముకుంది. రాక్షస పాలనలో ఐదేళ్లు పడ్డ కష్టాలకు పుల్ స్టాప్ పడింది. ప్రజాప్రభుత్వం రాకతో రైతులు వారి పోరాటానికి విరామం ప్రకటించారు. మీళ్లీ రాజధాని మళ్లీ పట్టాలెక్కేందుకు ప్రధాని మోదీ చేతుల మీదగా మే 2న పనులు పున:ప్రారంభం అవుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణంలోనూ, రాజధాని పోరాటంలోనూ రైతుల పాత్ర మరువరానిది.
సంబంధిత కథనం
టాపిక్