మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఛార్జీల మోతకు రంగం సిద్ధం.. త్వరలో ప్రకటన!

Best Web Hosting Provider In India 2024

మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఛార్జీల మోతకు రంగం సిద్ధం.. త్వరలో ప్రకటన!

Basani Shiva Kumar HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu

హైదరాబాద్ మెట్రో.. ప్రజా రవాణాకు ముఖ్యమైన సాధనంగా ఉంది. కానీ గణనీయమైన నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నష్టాలను తగ్గించడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఛార్జీలను పెంచడానికి రంగం సిద్ధం అవుతోంది. మరోవైపు మెట్రోపై మహాలక్ష్మి పథకం తీవ్రంగా ప్రభావం చూపుతోంది.

మెట్రో రైలు ( unsplash)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ప్రయాణికులకు మెట్రో బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. అతి త్వరలో మెట్రో ఛార్జీలు పెరగనున్నాయి. కొంతకాలంగా ఛార్జీలను పెంచేందుకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కసరత్తు చేపట్టింది. వరుస నష్టాలను అధిగమించేందుకు ఛార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం రూ.6,500 కోట్ల నష్టాలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయని తెలుస్తోంది.

మహాలక్ష్మి ప్రభావం..

చాలా రోజులుగా ప్రయాణికుల రాకపోకల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. తరచూ 4.8 లక్షల నుంచి 5 లక్షలలోపే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అటు సిటీ బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. దీంతో చాలా మంది మహిళలు వాటివైపే మొగ్గు చూపుతున్నారు. విద్యార్థినులు, ఉద్యోగినులు కూడా మెట్రో నుంచి సిటీబస్సుల వైపు మళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి.

పడిపోతున్న ప్రయాణికుల సంఖ్య..

ఎల్‌బీనగర్‌- మియాపూర్, నాగోల్‌- రాయదుర్గం కారిడార్‌లలో ప్రయాణికుల రద్దీ ఉంది. జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మార్గంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పడిపోతోంది. ఈ నేపథ్యంలో నష్టాలను ఎదుర్కొనేందుకు ఛార్జీల పెంపు మినహా మరో దారి కనిపించడం లేదని తెలుస్తోంది. 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటినుంచి చార్జీలు పెంచలేదు. అటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో రెండు నుంచి మూడుసార్లు ఛార్జీలు పెంచినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

గతంలోనే ప్రతిపాదనలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఛార్జీలను పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ అంగీకరించలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో నష్టాలపై ఎప్పటికప్పుడు లెక్కలు చెబుతూ.. ఛార్జీల పెంపు కోసం అనుమతిని కోరారు. తాజాగా ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించినట్లు సమాచారం. ఇప్పుడున్న ఛార్జీలపై గరిష్టంగా 20 శాతం వరకు పెంచే అవకాశం ఉంది.

20 శాతం పెంచితే..

ప్రస్తుతం కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.60 వరకు మెట్రో ఛార్జీలు ఉన్నాయి. 20 శాతం పెంచితే రూ.15 నుంచి రూ.75 వరకు పెరిగే అవకాశముందని అధికారులు వివరిస్తున్నారు. మెట్రో ఛార్జీలు ఏ మేరకు పెరగనున్నాయనే అంశంపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది. ఛార్జీల పెంపు వల్ల ఇప్పుడున్న నష్టాలను అధిగమించేందుకు కొంతవరకు ఊరట లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

కరోనా కాటు..

హైదరాబాద్ మెట్రో రైలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.625 కోట్ల నష్టాన్ని చవిచూసిందని లెక్కలు చెబుతున్నాయి. 2017లో ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం నష్టం రూ.6,598.21 కోట్లకు చేరుకుందని అంచనా. కరోనా మహమ్మారి సమయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల నష్టాలు భారీగా పెరిగాయి. అధిక వడ్డీ రేట్లు కూడా నష్టాలకు ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Hyderabad MetroHyderabadTsrtcTrending TelanganaTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024