





Best Web Hosting Provider In India 2024

ఇలాంటి వాళ్లు ఇచ్చే సలహాలు ఎప్పుడూ పాటించకండి, జీవిత నాశనమైపోతుంది
అపర చాణక్యుడు ఎంతో తెలివైన వాడు. జీవితంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో ముందుగానే ఒక పుస్తకంగా రాసి పెట్టాడు. అదే చాణక్య నీతిగా ఇప్పటివరకు ప్రసిద్ధి చెందింది. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఎవరెవరి నుంచి సలహాలు జీవితంలో తీసుకోకూడదో తెలుసుకోండి
ప్రతి మనిషికి జీవితంలో ఇతరుల సలహాలు అవసరం పడతాయి. అయితే ఎవరు పడితే వారి దగ్గర నుంచి సలహాలు తీసుకోకూడదు, వాటిని పాటించకూడదని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.
కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు అని కూడా ఆచార్య చాణక్యుడిని పిలుస్తారు. అతను గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త , రాజకీయ నాయకుడు కూడా. ఆయన రచించిన చాణక్య విధానంలో జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై ఆచరణాత్మక సలహాలు ఇచ్చారు.
ఈ పుస్తకంలో, చాణక్యుడు కొంతమంది వ్యక్తుల గురించి పేర్కొన్నాడు, వారి నుండి సలహా తీసుకోవడం వ్యర్థమే కాదు ఎంతో హానికరం అని కూడా చెబుతున్నాడు. ఆచార్య చాణక్యుడు ఎవరెవరి నుంచి సలహాలు తీసుకోకూడదో ఇక్కడ వివరించారు.
మూర్ఖుడి సలహా
చాణక్య విధానం ప్రకారం మూర్ఖుడికి తెలివితేటలు, వివేకం లోపిస్తాయి. అటువంటి వ్యక్తి సలహా ఆచరణ సాధ్యం కాదు. అలాగు అవి బెడిసి కొట్టి ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇది మీ నిర్ణయాలను దెబ్బతీస్తుంది. చాణక్యుడి ప్రకారం, ఒక మూర్ఖుడి సలహా తీసుకోవడం మిమ్మల్ని మీరు ఇబ్బందులకు గురిచేసుకోవడం వంటిదే.
స్వార్థపరులు
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో స్వార్ధపరులుగానే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కేవలం తాము మాత్రమే బావుండాలని, మిగతావారు బాగుపడకూడదని కోరుకుంటారు. వారు ఎల్లప్పుడూ మొదట తమ స్వప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. వారి సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. అలాంటి వారు సలహాలు ఇచ్చేటప్పుడు నిజాన్ని దాచి మీకు తప్పుడు సలహాలు ఇస్తారు.
అసూయపడే వ్యక్తి
మీ పురోభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులు ఎంతో మంది ఉంటారు. వారి సలహాలలో మోసం ఉండవచ్చు. ఇది మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తుంది. చాణక్యుడి ప్రకారం, అసూయపరుడు ఎప్పుడూ మంచి సలహా ఇవ్వడు. అటువంటి పరిస్థితిలో, ఇలాంటి వారి సలహాలు తీసుకోకుండా ఉండాలి.
అనుభవం లేని వ్యక్తి
అనుభవం లేని వ్యక్తికి జీవితం గురించి ఆచరణాత్మక జ్ఞానం ఉండదు. వారి సలహాలు అపరిపక్వమైనవిగా, ప్రమాదకరమైనవిగా ఉంటాయి. అనుభవం లేకుండా సలహాలు ఇవ్వడం అనేది చీకట్లో బాణం వేసినట్టే లెక్క. అలాంటి వారి సలహాలు తీసుకోవడం పూర్తిగా మంచిది కాదు. అది జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేసే అవకాశం ఉంది.
నెగెటివ్ ఆలోచనలు
నెగిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తి ప్రతి సందర్భంలోనూ సమస్యలను మాత్రమే చూస్తాడు. అలాంటి వారి సలహాలు కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. అటువంటి పరిస్థితిలో, ప్రతికూలతను వ్యాప్తి చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇస్తాడు. మీ చుట్టూ నెగిటివ్ థింకింగ్ ఉన్న వారు అధికంగా ఉంటే వారిని ఏ సలహా అడగకండి. మీ నిర్ణయం మీరే తీసుకోండి.