




Best Web Hosting Provider In India 2024

షుగర్ వ్యాధిని తగ్గించడానికి మన వంటింట్లో ఉండే మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఎలా ఉపయోగించాలి?
మధుమేహంతో పోరాడుతున్నారా? మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతున్నాయా? అయితే, మీ వంటింట్లోనే దాగి ఉన్న ఒక రహస్య ఆయుధాన్ని వాడండి. అవును మీ వంటింట్లోని సుగంధ ద్రవ్యాలు, ప్రకృతిలోని మూలికలు డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో చాలా బాగా సహాయపడతాయి. అదెలాగో తెలుసుకుందాం రండి.
మధుమేహం నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న ఒక వ్యాధి. దీనిని అదుపులో ఉంచడానికి సరైన ఆహారం, వ్యాయామం, మందులు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మన వంటింట్లో నిత్యం ఉపయోగించే కొన్ని సుగంధ ద్రవ్యాలు, ప్రకృతి ప్రసాదించిన కొన్ని మూలికలు కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడగలవు. ఈ సహజమైన పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో, మధుమేహం వల్ల వచ్చే ఇతర సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. ఎలాగో తెలుసుకుందాం రండి.
డయాబెటీస్ నియంత్రణకు మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఎలా సహాయపడతాయి?
ఇన్సులిన్ బాగా పనిచేయడానికి:
మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలోని చక్కెరను కణాల్లోకి పంపిస్తుంది. మధుమేహం ఉన్నవాళ్లలో ఈ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఇలాంటి వారు ఇంట్లో ఎప్పుడూ ఉండే దాల్చిన చెక్క, పసుపు (కుర్కుమిన్), అల్లం, మెంతి వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలను తరచుగా తీసుకోవాలి. ఇవి ఇన్సులిన్ బాగా పనిచేయడానికి సహాయపడతాయి.
రక్తంలో చక్కెర స్థాయి తగ్గించడానికి:
కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తాయి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కూడా చక్కెర స్థాయిలను తగ్గించగలుగుతాయి. దాల్చిన చెక్క, పసుపు, అల్లం, నల్ల జీలకర్ర, మెంతి వంటివి ఇందుకు బాగా ఉపయోగపడతాయి.
వాపు, ఒత్తిడి తగ్గించడానికి:
మధుమేహం ఉన్నవాళ్లలో తరచుగా వాపు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. పసుపు, అల్లం, దాల్చిన చెక్క వంటి వాటిలో వాపును తగ్గించే గుణాలు ఉంటాయి.
కొవ్వును తగ్గించడానికి:
మెంతి, దాల్చిన చెక్క వంటి కొన్ని కొవ్వును కూడా తగ్గించగలవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.కొవ్వు తగ్గితే డయాబెటీస్ ప్రమాదాలు కూడా తగ్గుతాయి.
ఏ మూలికలు ఎలా సహాయపడతాయి:
- దాల్చిన చెక్క: ఇది ఇన్సులిన్ బాగా పనిచేయడానికి, రక్తంలో చక్కెర, కొవ్వు తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
- పసుపు: దీనిలోని కుర్కుమిన్ వాపును తగ్గించే, ఒత్తిడిని తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను కూడా తగ్గించగలదు.
- అల్లం: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి అల్లం చాలా బాగా సహాయపడుతుంది. ఇన్సులిన్ పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది.
- మెంతి: ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారం నెమ్మదిగా జీర్ణం కావడానికి, రక్తంలో చక్కెర వెంటనే పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది. కొవ్వును కూడా తగ్గిస్తుంది.
- వెల్లుల్లి: ఇది కూడా రక్తంలో చక్కెరను తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
- నల్ల జీలకర్ర: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో నల్ల జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది.
- కలబంద: కలబంద గుజ్జు సారం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- కాకరకాయ: కాకరకాయలో రక్తంలో చక్కెరను నియంత్రించే గుణాలు ఉన్నాయని నిపుణులు నమ్ముతారు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
మూలికలు, సుగంధ ద్రవ్యాలను వాడుతున్నాం కదా అని డాక్టర్ ఇచ్చిన మందులు వాడకుండా ఉండకూడదు. అలాగే మీరు ఏది వాడాలనుకుంటున్నా మీ డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
ప్రతి మూలికను ఎంత మోతాదులో వాడాలో తెలుసుకోవాలి. ఎంత మంచిదైనా ఎక్కువ మోతాదులో తీసుకుంటే లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరిగే ప్రమాదముంది.