





Best Web Hosting Provider In India 2024

అమరావతి బ్రాండ్ ప్రమోషన్లో సీఆర్డీఏ వైఫల్యం…కనీస సమాచారం ఇవ్వలేని స్థితిలో CRDA.. మంత్రి నారాయణ నిస్సహాయత
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొన్న సమయంలో ఏపీ రాజధాని ప్రాధికార సంస్థ సీఆర్డిఏ మాత్రం చేతులెత్తేసింది. రాజధాని నిర్మాణం, డిజైన్లు, లేటెస్ట్ అప్డేట్లను ఎప్పటికప్పుడు అందించడంలో విఫలమైంది. సీఆర్డీఏలో ఏకంగా కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేసినా సమాచార లోటు మాత్రం స్పష్టమైంది.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నగర బ్రాండ్ ప్రమోషన్ లో సిఆర్డీఏ వైఫల్యం అడుగడుగున కనిపించింది. ఓ వైపు రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభానికి ప్రభుత్వం మంత్రి వర్గంతో కమిటీని ఏర్పాటు చేసి ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తే సీఆర్డీఏలో మాత్రం బ్రాండింగ్ ప్రమోషన్‌పై హుషారు కనిపించలేదు.
మునిసిపల్ మంత్రి నారాయణ యువకులతో సమానంగా పరుగులు తీస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తే సీఆర్డీఏలో మాత్రం ప్రచార వ్యవహారాలు తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించాయి. దీంతో సీఎంఓ కమ్యూనికేషన్స్ విభాగమే ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.
అమరావతి బ్రాండింగ్ ప్రమోట్ చేసే విషయంలో రాజధాని ప్రాధికార సంస్థ మొదటి నుంచి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాజధాని నిర్మాణ పనుల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రీ స్టార్ట్ చేసింది. గత ఐదేళ్లలో రాజధాని నిర్మాణ పనుల్ని పూర్తిగా అటకెక్కాయి. కూటమి అధికారంలోకి రాగానే జంగిల్ క్లియరెన్స్‌తో రాజధాని పనులు గాడిన పెట్టే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో ప్రభుత్వానికి సిఆర్డీఏ ను గాడిలో పెట్టడమే సవాలుగా మారింది. గత 9నెలలుగా సీఆర్డీఏ లో ఏమి జరుగుతుందో కూడా బయటకు చెప్పుకోలేని స్థితిలో CRDA ఉంది. ఒక్కో విభాగంలో సిబ్బందిని నియమించుకుంటూ వచ్చినా ఏ విభాగం పని అది చేసిన దాఖలాలు లేవు. అమరావతి నిర్మాణంలో భాగంగా దాదాపు రూ.43వేల కోట్లతో టెండర్లను ఖరారు చేశారు. కొత్తగా చేపట్టే పనులు వాటి విశేషాలను సీఆర్డీఏ అధికారులు వెల్లడించలేకపోయారు
రాజధాని పురోగతి, నిర్మాణ పనుల్ని వివరించడానికి ప్రత్యేకంగా మీడియా విభాగం ఉన్నా దాని పని తీరు అంతంత మాత్రంగానే ఉంది. PR వ్యవహారాల్లో పెద్దగా అనుభవం లేని వారిని రాజకీయ సిఫార్సులతో నియమించడంతో తగినంత ప్రచారం దక్కలేదని విమర్శలు ఉన్నాయి. దీనిపై కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో చర్యలు తీసుకున్నా పూర్తి స్థాయి ప్రక్షాళన మాత్రం జరగలేదు.
సీఆర్డీఏ నోటిఫికేషన్లలో చేపట్టిన ఉద్యోగ నియామకాలు అర్హులకు కాకుండా సిఫార్సులకు ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు చేసిన ప్యానల్ తీరుపై ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి.
కనీస సమాచారం కరువు
ప్రధాని మోదీ స్వయంగా హాజరవుతున్న కార్యక్రమంలో చేపట్టే పనులు, డిజైన్లు, నిర్మాణ వ్యయం వంటి వివరాలు కూడా సీఆర్డీఏ కమ్యూనికేష్ విభాగం వెల్లడించ లేకపోయింది. రాజధాని డిజైన్లను 2019కు ముందే ఖరారు చేసినా మధ్యలో ఐదేళ్ల విరామం రావడంతో పాత డిజైన్లు, వాటి చిత్రాలు అందుబాటులో లేకుండా పోయాయి. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రధాని శంకుస్థాపనలు చేసే ప్రాజెక్టులు వాటి వివరాలను కూడా సీఆర్డీఏ కమ్యూనికేషన్స్ వెల్లడించలేకపోయింది.
మంత్రి నిస్సహాయత
CRDA లో జరుగుతున్న పరిణామాలపై మంత్రి నారాయణ సైతం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రధాని పర్యటన ఖరారు అయినప్పటి నుంచి మంత్రి నిరంతరం సమీక్షలు, క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తున్నారు. మంత్రి స్వయంగా నేతృత్వం వహించే విభాగమైనా సీఆర్డీఏ సిబ్బందితో పని చేయించలేని స్థితిలో మంత్రి ఉన్నారు.
గత వారం పదిరోజులుగా మంత్రి నారాయణ నిత్యం రాజధాని పనుల పున: ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో సీఆర్డీఏ తరపున కనీసం ప్రెస్ నోట్లు కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది.
మూడేళ్లలో రాజధాని నిర్మిస్తాం..
మూడేళ్లలో ఖచ్చితంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని మంత్రి నారాయణ సభా ప్రాంగణం వద్ద ప్రకటించారు. కూటమి పార్టీలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వరల్డ్ క్లాస్ సిటీని నిర్మిస్తామన్నారు.
సంబంధిత కథనం
టాపిక్