





Best Web Hosting Provider In India 2024

ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్న కార్యక్రమం.. ఇది కదా ప్రజలకు కావాల్సింది!
ఈ రోజుల్లో ఎమ్మెల్యేలను కలవడానికి ప్రజలు ఎంతో కష్టపడాలి. లోకల్ లీడర్‌ను బతిమిలాడాలి. ఆయన టైమ్ తీసుకొని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలి. అయినా ఎమ్మెల్యే సమస్య వింటారన్న గ్యారంటీ లేదు. ఇలాంటి నేతలు ఉన్న ఈ కాలంలో.. ఓ ఎమ్మెల్యే మాత్రం ప్రజల వద్దకే వెళ్తున్నారు. అది కూడా పక్కా ప్రణాళికతో.
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్న ఆలోచన చేశారు. తన నియోజకవర్గం ప్రజలను కలిసేందుకు ఎమ్మెల్యే ఆన్ విల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయనే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకొని.. పరిష్కారం చూపుతున్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వారానికి 3 రోజులు..
‘ప్రజా జీవితంలో ఉన్నంత కాలం.. ప్రజాసేవకు పాటుపడుతూనే ఉంటా. నియోజకవర్గ ప్రజలు రాత్రీ పగలు తేడా లేకుండా తన క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి కలచి వేసింది. వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించా. వారానికి 3 రోజులపాటు అధికారుల బృందంతో ప్రజల వద్దకు వెళతా. అధికారుల సమక్షంలోనే ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తా’ అని కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కవ్వంపల్లి స్పష్టం చేశారు.
రోజూ రెండు గంటలు..
‘మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు.. అవసరమైతే మంత్రులు, సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ యాప్ ద్వారా వచ్చిన సమస్యలను చూసేందుకు రోజూ రెండు గంటలు కేటాయిస్తా’ అని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సత్యనారాయణ.. ప్రత్యేకంగా రూపొందించిన వాహనంలో అధికారులతో కూర్చొని కొంత మంది ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించారు.
ప్రత్యేక వాహనం..
“ఎమ్మెల్యే ఆన్ వీల్స్” కార్యక్రమం కోసం కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు.
ఈ వాహనంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రజల నుంచి ప్రత్యక్ష ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
రేషన్ షాపులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లను తనిఖీ చేస్తున్నారు.
ప్రజల స్పందన..
ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఎమ్మెల్యే తమ గ్రామానికి స్వయంగా వచ్చి తమ సమస్యలు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రజలు చెబుతున్నారు.
చాలా త్వరగా స్పందిస్తున్నారని ప్రజలు అంటున్నారు.
యాప్..
ఎమ్మెల్యే ఆన్ వీల్స్ పేరుతో ఒక యాప్‌ను కూడా తయారు చేశారు.
ఈ యాప్ ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలను తెలియచేయవచ్చు.
ఈ కార్యక్రమం ద్వారా కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు చేరువయ్యే పాలనను అమలు చేస్తున్నారు. ఇది తెలంగాణలోనే ఓ కొత్త ప్రయోగంగా నిలుస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్