





Best Web Hosting Provider In India 2024

ఇందిరమ్మ ఇండ్లు.. నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు.. 10 ముఖ్యమైన అంశాలు
ఇందిరమ్మ ఇండ్ల కోసం చాలామంది గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. తీరా మంజూరు అయ్యాక నిర్మాణాలు మాత్రం చేపట్టడం లేదు. మొదటి విడతలో ఈ సమస్య చాలా గ్రామాల్లో కనిపించింది. అయితే.. ఆర్థిక సమస్యల కారణంగా ఇండ్లు కట్టుకోవడం లేదని అధికారులు గుర్తించారు. అందుకే ఐకేపీ నుంచి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి 3 నెలల కిందట ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో మంజూరు చేసిన ఇండ్ల లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, కారణాలు ఇలా ఉన్నాయి.
10 ముఖ్యమైన అంశాలు..
1.మొదటి విడతలో భాగంగా మండలానికి ఒక్కో గ్రామం చొప్పున ఎంపికచేశారు. మొత్తం 70,122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో 46,432 మందికి మంజూరుపత్రాలను అందజేశారు. ఇందులో 16,189 మంది ఇంతవరకు ఇంటి నిర్మాణపనులను ప్రారంభించారు.
2.ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నాలుగు విడతలుగా రూ.5 లక్షలను లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. నిర్మాణదశలకు అనుగుణంగా ఈ మొత్తం విడుదల చేస్తారు. 2,341 మందికి మొదటిదశ చెల్లింపులో భాగంగా రూ.లక్ష చొప్పున మంజూరైంది.
3.ఈ వారంలో రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయనుండటంతో.. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
4.పునాది నిర్మించుకోవాలంటే రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని.. అంత స్తోమత లేదని పలువురు లబ్ధిదారులు అంటున్నారు. పునాది కోసం ఐకేపీ ద్వారా రుణాలు అందిస్తామని.. మొదటి విడత డబ్బులు జమచేయగానే లబ్ధిదారులు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. చాలామందికి ఐకేపీ రుణం ఇస్తారన్న అవగాహన లేదు.
5.ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పింది. పలుచోట్ల దీనికి అంతరాయాలు ఎదురవుతున్నాయి. 400 నుంచి 600 చదరపు అడుగులలోపే ఇంటిని నిర్మించుకోవాలన్న నిబంధనతో కొందరు లబ్ధిదారులు నిర్మాణానికి వెనుకాడుతున్నారు.
6.చాలా గ్రామాల్లో మేస్త్రీల కొరతఉంది. వారు అడ్వాన్సు కావాలని అడుగుతున్నారు. ఈ డబ్బులు చెల్లించలేక కొందరు లబ్ధిదారులు నిర్మాణానికి వెనుకడుగు వేస్తున్నారు.
7.స్టీల్, సిమెంట్, కంకర ధరలు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చేలా ఆ కంపెనీలతో మాట్లాడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పలు గ్రామాల్లో లబ్ధిదారులకు మోడల్ ఇంటిపై అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు.
8.కొలతల పేరుతో అధికారులు కొత్త నిబంధనలను పెడుతున్నారని.. దీంతో బిల్లులు వస్తాయో రావోనని పలుచోట్ల లబ్ధిదారులు భయపడుతున్నారు. ఇలాంటి సందేహాలను అధికారులు నివృత్తి చేయాల్సి ఉంది.
9.పునాది పూర్తయిన ఇళ్లకు రూ.లక్షను జమ చేస్తుండడంతో.. మిగతా లబ్ధిదారులు తమ పనులను ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటిదశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు వేగవంతం అవుతున్నాయన్నారు.
10.ఇళ్లకు ముగ్గుపోసే సమయంలోనే 500 చదరపు అడుగులు ఉండాలని చెబుతున్నారు. 600 చదరపు అడుగుల వరకు నిర్మాణం చేసుకోవచ్చన్నారు. పునాది పూర్తికాగానే వెంటనే బిల్లులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్