



Best Web Hosting Provider In India 2024

హాయ్ మెసేజ్ పంపితే చాలు.. విద్యుత్ సమస్యలు సాల్వ్ అయినట్టే.. అందుబాటులోకి వాట్సాప్ చాట్ బాట్ సేవలు
టీజీ ఎన్పీడీసీఎల్.. వినియోగదారులకు చేరువయ్యేందుకు సేవలను విస్తరిస్తోంది. ముందుగా వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు.. వివిధ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌తో ఫిర్యాదు చేసే సదుపాయాన్ని తీసుకురాగా.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను వినియోగంలోకి తెచ్చింది.
విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. వాట్సాప్ లోనూ సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది టీజీ ఎన్పీడీసీఎల్. ఈ మేరకు ‘వాట్సాప్ చాట్ బాట్’ సేవలను వినియోగంలోకి తీసుకొచ్చి, కన్జ్యూమర్స్ అంతా సేవలను వినియోగించుకోవాలని సూచిస్తోంది.
హాయ్.. మెసేజ్ చేస్తే చాలు..
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్తు వినియోగదారులకు సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు గతంలోనే.. 1912 టోల్ ఫ్రీ నెంబర్ సేవలను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్తగా వాట్సాప్ చాట్ బాట్ సేవలను అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విద్యుత్తు వినియోగదారులు మొదట ‘79016 28348’ నెంబర్ సేవ్ చేసుకుని, ఆ నెంబర్ కు వాట్సాప్ లో ‘హాయ్’ అనే మెసేజ్ పంపించాలి. వెంటనే ఆ వాట్సాప్ చాట్ బాట్ నుంచి రిప్లై వస్తుంది. టీజీ ఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్ కు స్వాగతం అని రిప్లై రావడంతో పాటు.. రిజిస్టర్ కంప్లైంట్స్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. అందులో రిజిస్టర్ కంప్లైంట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే.. ఫిర్యాదుకు అనుగుణమైన సమాచారం అడుగుతుంది.
సర్వీస్ నెంబర్ లేకున్నా..
టీజీ ఎన్పీడీసీఎల్ వాట్సాప్ చాట్ బాట్ లో కంప్లైంట్స్ పై క్లిక్ చేసిన తరువాత ‘విత్ యూనిక్ సర్వీస్ నంబర్, విత్ అవుట్ యూనిక్ సర్వీస్ నంబర్, ప్రీవియస్ మెనూ’ అనే మూడు ఆప్షన్స్ వస్తాయి. అందులో విత్ యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయగానే వినియోగదారుని విద్యుత్తు సర్వీస్ వివరాలు వస్తాయి. ఇలా వివరాలను ఓకే చేయగానే కంప్లైంట్ కు సంబంధించిన వివిధ రకాల ఆప్షన్స్ అందులో కనిపిస్తాయి. అందులో కంప్లైంట్‌కు సంబంధించి సబ్ టైప్ లేదా చాట్ విత్ ఏజెంట్ వస్తుంది. దీంతో నేరుగా అక్షరాలు టైప్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదా ఏజెంట్ తో చాట్ చేసి అయినా కంప్లైంట్ నమోదు చేసుకోవచ్చు.
కంప్లైంట్ ట్రాక్ చేసేలా..
వాట్సాప్ చాట్ బాట్ లో ఫిర్యాదు చేసిన తరువాత కంప్లైంట్ ఐడీ నెంబర్ జనరేట్ అవుతుంది. అంటే మన కంప్లైంట్ సంస్థకు వెళ్లినట్టేనన్న మాట. ఆ ఫిర్యాదు మనం సెలెక్ట్ చేసిన సర్కిల్, సబ్ డివిజన్ పరిధిలోని అక్కడి ఏరియా సంబంధిత ఆఫీసర్ కు వెళ్తుంది. అదే విషయం వినియోగదారులకు కూడా సందేశం రూపంలో అందుతుంది. ఆ తరువాత సేవల్లో ఏమైనా జాప్యం జరిగితే కంప్లైంట్ ఐడీతో వినియోగదారుల కంప్లైంట్ ను ట్రాక్ చేసి, ఎక్కడ పెండింగ్ ఉందో కూడా తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది.
ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక ఫీడ్ బ్యాక్..
కంప్లైంట్ పూర్తయిన తరువాత వినియోగదారులకు సమాచారం అందడంతో పాటు.. సమస్యను పరిష్కరించిన తరువాత కూడా మెసేజ్ వస్తుంది. సమస్య పరిష్కారంపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సిందిగా కూడా అడుగుతుంది. ఒక వేళ సంబంధిత అధికారులు అందించిన సేవలు సంతృప్తికరంగా లేకపోతే.. మళ్లీ కంప్లైంట్ రీఓపెన్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. దీంతో విద్యుత్తు సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే.. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే సాల్వ్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
వెబ్ సైట్‌లో కూడా..
స్మార్ట్ ఫోన్ లోనే కాకుండా www.tgnpdcl.com వెబ్ సైట్ లో కూడా వాట్సాప్ చాట్ బాట్ ఓపెన్ చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సైట్ ఓపెన్ చేశాక వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుందని, దానిని క్లిక్క్ చేసి వాట్సాప్ చాట్ చేయొచ్చని పేర్కొంటున్నారు. వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ సమస్యలను తొందరగా పరిష్కరించేందుకు వాట్సాప్ చాట్ బాట్ ఎంతో ఉపకరిస్తుందని చెబుతున్నారు. వాట్సాప్ చాట్ బాట్ తో పాటు ‘1912’ టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించి సేవలు పొందవచ్చని సూచిస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్