మంచి థ్రిల్ కావాలా.. ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దు.. ఒకే రాత్రి జరిగే స్టోరీ.. యూట్యూబ్‌లో ఫ్రీగా..

Best Web Hosting Provider In India 2024

మంచి థ్రిల్ కావాలా.. ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దు.. ఒకే రాత్రి జరిగే స్టోరీ.. యూట్యూబ్‌లో ఫ్రీగా..

Hari Prasad S HT Telugu

థ్రిల్లర్ మూవీస్ కి మలయాళం ఇండస్ట్రీ పెట్టింది పేరు. సింపుల్ స్టోరీని ఊహించని ట్విస్టులతో ఇంట్రెస్టింగా చెప్పడం అక్కడి మేకర్స్ కు అలవాటు. అలాంటిదే ఇప్పుడు చెప్పబోయే సినిమా కూడా. ఒకే రాత్రిలో స్టోరీ మొత్తం సాగిపోయే ఈ మూవీ యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది.

మంచి థ్రిల్ కావాలా.. ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దు.. ఒకే రాత్రి జరిగే స్టోరీ.. యూట్యూబ్‌లో ఫ్రీగా..

మలయాళం సినిమాలు చాలా వరకు భారీ బడ్జెట్, యాక్షన్ సీన్స్, అనవసర హంగామా జోలికి వెళ్లవు. ఓ చిన్న లైన్ అనుకొని, దాని చుట్టూ కథను అల్లి, చివరి వరకూ మంచి థ్రిల్ పంచుతూ సినిమాలు తీయడంలో ఆ ఇండస్ట్రీ మేకర్స్ దిట్ట. అలా 2022లోనూ నైట్ డ్రైవ్ అనే ఓ మంచి థ్రిల్లర్ మూవీని ప్రేక్షకులకు అందించారు.

నైట్ డ్రైవ్ మూవీ స్టోరీ ఏంటంటే?

నైట్ డ్రైవ్ 2022లో వచ్చిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇంద్రజీత్ సుకుమారన్, రోషన్ మాథ్యూ, ఎనా బెన్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. వైశాఖ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నీతా పింటో, ప్రియా వేణు నిర్మించారు. ఈ సినిమా మొత్తం ఒకే రాత్రిలో జరిగే కథగా చిత్రీకరించారు. ఓ యువ జంట నైట్ డ్రైవ్, ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఓ మంత్రి దగ్గర ఉన్న కిలోల కొద్దీ బంగారం చుట్టూ తిరిగే మూవీ ఇది.

ఇంట్లో కిలోల కొద్దీ బంగారం దాచుకున్న కేరళ రాష్ట్ర మంత్రి రాజన్ కురుప్ (సిద్ధిఖ్) మరుసటి రోజే తనను అరెస్ట్ చేయబోతున్నారని తెలిసి ఆందోళనకు గురవుతాడు. ఇంట్లోని బంగారాన్ని తనకు ఎంతో నమ్మకస్తుడైన వ్యక్తితో రాత్రికి రాత్రే మరో చోటుకి తరలిస్తాడు. అదే సమయంలో క్యాబ్ డ్రైవర్ అయిన జార్జీ (రోషన్ మాథ్యూ) తన గర్ల్‌ఫ్రెండ్, టీవీ జర్నలిస్ట్ అయిన రియా రాయ్ (ఎనా బెన్)తో కలిసి ఓ నైట్ డ్రైవ్ కు వెళ్తాడు.

అదే సమయంలో సీఐ బెన్నీ మూపన్ (ఇంద్రజీత్ సుకుమారన్) వాళ్ల కారును ఆపి చెక్ చేస్తాడు. ఈ సమయంలో రియాతో అతడు గొడవ పడతాడు. అక్కడి నుంచి ఆ జంట కాస్త ముందుకు వెళ్లగానే ఓ ప్రమాదం జరుగుతుంది. ఆ మంత్రి పంపిన వ్యక్తి వాళ్ల కారు కింద పడిపోతాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని వాళ్లు హాస్పిటల్ కు తీసుకెళ్తారు.

అతనితోపాటు ఉన్న బంగారం బ్యాగును కూడా తీసుకెళ్తారు. ఈ కేసును సీఐ బెన్నీయే చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రమాదం జరిగిన ఆ వ్యక్తి బతుకుతాడా? ఆ బంగారం ఏమవుతుంది? దాని నుంచి తప్పించుకోవడానికి మంత్రి ఏం చేస్తాడు? ఆ యువ జంట పరిస్థితి ఏం కాబోతుందన్నది ఈ నైట్ డ్రైవ్ మూవీలో చూడొచ్చు.

నైట్ డ్రైవ్ ఎందుకు చూడాలంటే?

ఓ రాష్ట్ర మంత్రి బంగారం స్మగ్లింగ్ తో ఎలాంటి సంబంధం లేని ఓ యువ జంట నైట్ డ్రైవ్.. చివరికి ఆ మంత్రిని ఎలా కష్టాల్లోకి నెడుతుందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఆ మంత్రి అరెస్ట్ అయ్యే పరిస్థితికి కారణమైన టీవీ జర్నలిస్ట్ రియా రాయ్.. చివరికి ఆ బంగారం తమ దగ్గరికే చేరిన తర్వాత తన ప్రియుడితో కలిసి ఎలాంటి ప్లాన్ వేస్తుందన్నది మూవీలో ఆసక్తికరం.

రెండు గంటలలోపే నిడివి ఉన్న ఈ మూవీ ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టదు. సినిమాలోని పాత్రలను ఒకదానికొకటి కలిపి తీరు కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక ఒక రాత్రిలోనే జరిగే స్టోరీ అనేది కూడా ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. క్రైమ్ థ్రిల్లర్ అంటే రక్తపాతాలే ఉండాల్సిన అవసరం లేదంటూ ఓ చిన్న కారు ప్రమాదం ఓ రాష్ట్ర మంత్రి జీవితాన్నే తలకిందులు ఎలా చేసిందన్నది ఈ నైట్ డ్రైవ్ లో చూడొచ్చు. సినిమా ముగిసే సమయానికి ఓ మంచి థ్రిల్ మనకు మిగులుతుంది.

నెట్‌ఫ్లిక్స్ లో మలయాళం ఆడియోతో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు హిందీ ఆడియోలోనే అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో మాత్రం లేదు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024