



Best Web Hosting Provider In India 2024

భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త చేయాల్సిన పనులేంటి? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
కడుపుతో ఉన్నప్పుడు తల్లి ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ప్రతి ఒక్కరూ చెబుతారు. మరి తండ్రి సంగతేంటి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? నిజానికి ఇద్దరికీ భాధ్యత ఉంటుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
గర్భవతిగా ఉన్నప్పుడు అందరూ తల్లి అలవాట్లు, ఆమె చేసే పనుల గురించే ఎక్కువ మంచి ఆలోచిస్తారు. కానీ ఈ సమయంలో భర్త చేసే పనులు కూడా చాలా ముఖ్యమైనవి. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, భార్య కడుపుతో ఉన్న సమయంలో భర్త కొన్ని విషయాల్లో చురుకుగా పాల్గొనడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. భర్త మద్దతు ఉంటేనే ఇంట్లో మంచి వాతావరణం ఏర్పుడుతుంది. దానివల్ల తల్లి ఒత్తిడి తగ్గి, గర్భం సురక్షితంగా, సంతోషంగా ఉంటుంది. బిడ్డ కూడా బాగా ఎదుగుతుంది. కడుపుతో ఉన్నప్పుడు భర్త చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం రండి.
1. భావోద్వేగ మద్దతు
గర్భం దాల్చిన సమయంలో మహిళకు మానసిక మద్దతు చాలా ముఖ్యం. హార్మోన్ల మార్పులు, ఒంట్లో వచ్చే ఇబ్బందుల వల్ల ఆమె మూడ్స్ మారుతూ ఉంటాయి. అప్పుడు భర్త ఓపికగా వ్యవహరించాలి. ఆమె మాట వినాలి. ఆమె చెప్పేది అర్థం చేసుకోవాలి. ఆమెను తప్పుగా చూడకుండా, ఆమె భయాన్ని తగ్గించాలి, ధైర్యం చెప్పాలి, ఒత్తిడిని తగ్గించాలి. ఆమెకు భద్రంగా ఉంది, సౌకర్యంగానే ఉంది అనిపించేలా చూసుకోవాలి. ఇలా చేస్తే తల్లికి ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. బాగా నిద్రపోతుంది, మంచి ఆహారం తీసుకుంటుంది, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవన్నీ బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకు చాలా మంచివి.
2. గర్భధారణలో మంచి సంరక్షణ
భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో భర్త ఎక్కువ సేపు ఆమెతో ఉండాలి. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు, పరీక్షలకు వెళ్ళినప్పుడు భర్త కూడా తోడుగా వెళ్ళాలి. ఇది కేవలం బాధ్యత కాదు, దీనివల్ల గర్భం ఎలా పెరుగుతోంది, బిడ్డ ఎలా ఎదుగుతోంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలు కూడా తెలుస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, డెలివరీకి, డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది.
డెలివరీ కోసం సిద్ధం కావడంలో భర్త ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ప్రసవ శిక్షణ తరగతులకు వెళ్లడం, ఆసుపత్రిలో ఎలా ఉంటుందో తెలుసుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలుసుకోవడం మంచిది. ఇన్ని విషయాలు తెలిస్తే చివరి నిమిషంలో కంగారు పడాల్సిన అవసరం ఉండదు, ఒత్తిడి ఉండదు. దీనివల్ల భార్యాభర్తలిద్దరికీ అన్నీ మన కంట్రోల్లో ఉన్నాయనే ధైర్యం వస్తుంది.
3. మార్పులను అర్థం చేసుకోవడం
గర్భం దాల్చినప్పుడు భార్యలో వచ్చే శారీరక, మానసిక మార్పులను భర్త అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఇలా అయితేనే అతను ఆమెతో ప్రేమగా, ఓపికగా ఉండగలడు, మద్దతు ఇవ్వగలడు. అల్ట్రాసౌండ్లో బిడ్డను చూడటం, గుండె చప్పుడు వినడం వల్ల భర్త కూడా గర్భధారణ సంతోషాన్ని అనుభవించగలడు. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. . ఇలా కలిసి ఉండటం వల్ల ఏమైనా సమస్యలు ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు, సరైన సమయంలో డాక్టర్ సలహాలు, సమయం తీసుకోవచ్చు.
4. ఇంట్లో సహాయం చేయడం
భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త ఇంట్లో పనులు చేయడంలో సహాయం చేయడం కూడా ముఖ్యం. ఇంటి పనులు చేయడం, బయట నుండి సామాన్లు తీసుకురావడం, భార్యకు విశ్రాంతి దొరికేలా చూడటం, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంచడం భర్త చేయాల్సిన పనుల్లో ముఖ్యమైనవి. ఇలా చేయడం వల్ల భార్యకు ఒత్తిడి, అలసట తగ్గుతాయి. ముఖ్యంగా ఆమెతో కలిసి నడవడం, గర్భవతుల కోసం చేసే వ్యాయామాలు చేయించడం లేదా ఆహారం తయారు చేయడంలో సహాయం చేయడం ద్వారా ఆమెను సంతోషంగా ఉంచవచ్చు. ఈ సమయాన్ని ఆనందంగా గడపవచ్చు.
5. ప్రసవం తర్వాత సంరక్షణ గురించి తెలుసుకోవడం
ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఆఫీసులో సెలవులు పెట్టడం, ఆమె త్వరగా కోలుకోవడానికి ఏమి చేయాలో తెలుసుకోవడం, పుట్టిన బిడ్డను ఎలా చూసుకోవాలో తెలుసుకోవడం వంటివి భర్త చేయాల్సిన ముఖ్యమైన పనులు. ఈ విషయాలు తెలుసుకుంటే ప్రసవం తర్వాత భార్యకు బాగా సహాయం చేయవచ్చు.
6. ప్రేమగా ఉండండి
భావోద్వేగ మద్దతు ఇవ్వడం మాత్రమే భర్త పని కాదు. ఎప్పుడూ తోడుగా ఉండాలి. అన్ని బాధ్యతలను పంచుకోవాలి. ప్రేమగా చూసుకోవాలి. బాధ పడకుండా ఉంచాలి. ఎల్లప్పుడూ మద్దతు ఇవ్వాలి. భర్త ఈ ప్రయాణంలో తోడుగా ఉంటే మంచి వాతావరణం ఏర్పడుతుంది. తల్లికి, బిడ్డకు, పూర్తి కుటుంబానికి మంచి జరుగుతుంది.