





Best Web Hosting Provider In India 2024

మా మాస్ హీరోకి సూపర్ పవర్స్ అవసరం లేదు.. పిడికిలి ఎత్తితే 20 మంది మటాష్: నాగార్జున కామెంట్స్ వైరల్
అక్కినేని నాగార్జున మన మాస్ హీరోలను మార్వెల్, డీసీ సూపర్ హీరోలతో పోల్చాడు. అయితే వాళ్లలాగా తమ హీరోలకు సూపర్ పవర్స్ అవసరం లేదని, పిడికిలి ఎత్తితే 20 మంది గాల్లోకి ఎగురుతారని అతడు అనడం విశేషం. వేవ్స్ సమ్మిట్ లో నాగ్ మాట్లాడాడు.
ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025 జరుగుతున్న విషయం తెలుసు కదా. అందులో ఎంతో మంది తెలుగు హీరోలు ఇప్పటికే పాల్గొన్నారు. తాజాగా శుక్రవారం (మే 2) ఇందులోని ప్యానెల్ పాన్ ఇండియా సినిమా: అపోహ లేదా ఓ ఊపు అనే సబ్జెక్ట్ పై మాట్లాడాడు. ఇందులో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నాడు. అనుపమ్ ఖేర్, ఖుష్బూ సుందర్, కార్తీలాంటి వాళ్లతో కలిసి అతడు మాట్లాడాడు.
మన మాస్ హీరోలూ సూపర్ హీరోలే
ఈ సందర్భంగా మన ఇండియన్ మాస్ హీరోలను నాగార్జున మార్వెల్, డీసీ సూపర్ హీరోలైన సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాంటి వాళ్లతో పోల్చాడు. ఇండియన్ సినిమా స్టోరీటెల్లింగ్ ప్రత్యేకమైనది, దీనిపై అందరూ గర్వించాలని అతడు అన్నాడు.
“ఓ హీరో తన పిడికిలి ఎత్తితే 20 మంది గాల్లోకి ఎగిరి పడతారు. అది అసహజంగా అనిపించవచ్చు. కానీ మార్వెల్ లేదా డీసీ సినిమాలు చూడండి.. సూపర్ మ్యాన్ అదే పని చేస్తాడు. కానీ వాళ్లకు సూపర్ పవర్స్ ఉన్నాయంటూ వాళ్లు ఓ లాజిక్ ను ఆపాదిస్తారు. మాకు ఆ ప్రత్యేకమైన సూపర్ పవర్స్ అవసరం లేదు” అని నాగార్జున అనడం విశేషం.
అలాంటి హీరోనే ప్రేక్షకులకు కావాలి
అలాంటి హీరోలనే స్క్రీన్ పై చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారని నాగార్జున అన్నాడు. అల్లు అర్జున్ లేదా ప్రభాస్ లాంటి వాళ్లు అలాంటివి చేసినప్పుడు వాళ్లను అది ఎంతగానో ఆనందింపజేస్తుందని చెప్పాడు.
“ఓ కామన్ మ్యాన్, టికెట్ కొనే ప్రేక్షకుడు, నాతో సహా.. హీరోలను అసాధారణంగానే చూడాలని అనుకుంటాడు. ప్రభాస్, అల్లు అర్జున్, మిగిలిన హీరోలు స్క్రీన్ పై అలా చేసినప్పుడు నేను చప్పట్లు కొడతాను, విజిల్స్ వేస్తాను” అని నాగ్ అన్నాడు.
కుబేరలో నాగార్జున
నాగార్జున చివరిగా గతేడాది సంక్రాంతికి వచ్చిన నా సామి రంగ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం అతడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేరలో నటిస్తున్నాడు. దీంతోపాటు లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాలోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు.
కుబేరలో నాగార్జునతోపాటు ధనుష్, రష్మిక, జిమ్ సర్బాలాంటి వాళ్లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక కూలీలో రజనీకాంత్, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. కూలీ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం