





Best Web Hosting Provider In India 2024

ఉత్తమ కథా చిత్రంగా వరలక్ష్మీ శరత్ కుమార్ శబరి.. దాసరి ఫిలిం అవార్డ్.. 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్!
ఉత్తమ కథా చిత్రంగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ చిత్రం శబరి దాసరి ఫిలిం అవార్డ్ అందుకుంది. ఈ బహుమతిని శబరి సినిమాను నిర్మించిన ఎన్ఆర్ఐ మహేంద్ర నాథ్ కూండ్లకు సీనియర్ నటుడు మురళి మోహన్ అందించారు. మరి ఈ నేపథ్యంలో శబరి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి ప్రయోగాత్మక చిత్రానికి గౌరవం దక్కింది. హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ చిత్రం దాసరి ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ కథా చిత్రంగా అవార్డు సాధించింది. దీంతో మరొకసారి కథా ప్రధానమున్న సినిమాలకు గౌరవం తీసుకువచ్చింది.
తొలి ప్రయత్నంగా నిర్మించడం
ఈ శబరి చిత్రాన్ని ఎన్ఆర్ఐ అయిన మహేంద్ర నాథ్ కూండ్ల తన తొలి ప్రయత్నంగా నిర్మించటం విశేషం. తొలి సినిమాకే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎన్నుకొని, ఒక హృద్యమైన, భావోద్వేగాలు కలగలిపిన కథను అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కించటం ఆయనకు సినిమా పట్ల ఉన్న నిబద్దతను స్పష్టంగా చాటింది.
తల్లి చేసే పోరాటం
అనిల్ క్యాట్జ్ అనే నూతన దర్శకుడు శబరి సినిమాను తెరకెక్కించారు. ఒక తల్లి తన బిడ్డను రక్షించేందుకు చేసిన ఒంటరి పోరాటాన్ని మిశ్రమ భావోద్వేగాలతో కూడిన రీతిలో హృద్యంగా ఆవిష్కరించారు. 2024 మే నెలలో థియేటర్లలో విడుదలైన ‘శబరి’ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందినప్పటికీ, కథా నిర్మాణంలో ఉన్న లోతు, భావోద్వేగ పరిణామాలు, ఒక తల్లి తన బిడ్డ కోసం పడే తపన, చేసిన ఒంటరి పోరాటం కారణంగా అవార్డ్స్ కమిటీ ప్రశంసలు అందుకుంది.
దాసరి ఫిలిం అవార్డ్ అందజేత
ఇక దాసరి ఫిలిం అవార్డ్‌ను శబరి సినిమా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్లకు పాపులర్ నటుడు మురళి మోహన్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మురళి మోహన్ వెంట సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి, పాపులర్ సీనియర్ నటులు సుమన్, సాయి కుమార్ కూడా పాల్గొన్నారు.
శబరి ఓటీటీ స్ట్రీమింగ్
ఈ నేపథ్యంలో శబరి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఆసక్తికరంగా మారాయి. మిస్టరీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, డ్రామా వంటి అంశాలతో మిస్టరీ థ్రిల్లర్‌గా తెలుగులో శబరి సినిమా వచ్చింది. థియేట్రికల్ అనంతంరం మూడు ఓటీటీల్లో శబరి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళం వంటి భాషల్లో కూడా శబరి ఓటీటీ రిలీజ్ అయింది.
3 ఓటీటీల్లో శబరి
అమెజాన్ ప్రైమ్, సన్ ఎన్ఎక్స్‌టీ, ఆహా మూడు ప్లాట్‌ఫామ్స్‌లలో శబరి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి ఓటీటీలో శబరి తెలుగులో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్, సన్ ఎన్‌ఎక్స్‌టీ ఓటీటీల్లో ఇతర భాషల్లో కూడా శబరి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. మంచి థ్రిల్లింగ్ అంశాలతో సాగే శబరి సినిమాను ఎంచక్కా 3 ఓటీటీల్లో వీక్షించవచ్చు.
శబరి నటీనటులు
కాగా, గోపీ సుందర్ సంగీతం అందించిన శబరి సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్‌తోపాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి ఇతర కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం