Best Web Hosting Provider In India 2024

టాస్క్ పేరుతో ట్రాప్..! క్రిప్టో కరెన్సీ పేరిట బీటెక్ విద్యార్థికి టోకరా, ఏకంగా రూ.7 లక్షలు కాజేశారు..!
క్రిప్టో కరెన్సీ పేరిట సైబర్ నేరగాళ్లు బీటెక్ విద్యార్థికి టోకరా వేశారు. ఏకంగా రూ.7.8 లక్షలు కొట్టేశారు. మోసపోయినట్లు గ్రహించిన విద్యార్థి… వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను బోల్తా కొట్టిస్తూ ఖాతాలన్నీ లూటీ చేస్తున్నారు. ఏళ్లుగా కష్టపడి దాచుకున్న సొత్తునంతా క్షణాల్లో దోచుకుంటున్నారు. తాజాగా హనుమకొండ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి అకౌంట్ ను ఖాళీ చేశారు. హోటల్స్ కు రేటింగ్ ఇవ్వడంతో పాటు క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెడితే రెట్టింపు చెల్లిస్తామంటూ ఆశచూపి, అతడి అకౌంట్ నుంచి రూ.7.8 లక్షలకుపైగా కొల్లగొట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు వరంగల్ నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడికి గత నెల 16న గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. తాము సూచించిన హోటల్స్ కు రేటింగ్ ఇవ్వాలని, అలా చేస్తే డబ్బులు అకౌంట్ లో జమ చేస్తామని ఆ మెసేజ్ లో ఉంది. అది నమ్మిన ఆ యువకుడు అవతలి వ్యక్తి సూచించిన ప్రకారం హోటల్ రేటింగ్ ఇచ్చాడు.
టెలిగ్రామ్ లో టాస్క్
ఆ యువకుడు హోటల్ కు రేటింగ్ ఇచ్చిన అనంతరం సైబర్ నేరగాళ్లు మరో లింక్ ను పంపించారు. అది టెలీగ్రామ్ యాప్ లింప్ కాగా.. తాము చెప్పిన ప్రకారం రేటింగ్ ఇస్తూ టాస్క్ పూర్తి చేయాలని సూచించారు. దీంతో సదరు యువకుడు వారు చెప్పిన ప్రకారం పని పూర్తి చేశాడు. రేటింగ్ ద్వారా వచ్చిన అమౌంట్ ను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని, అలా పెడితే రెట్టింపు లాభం వస్తుందని నమ్మించారు. దీంతో అదంతా నమ్మిన ఆ యువకుడు అవతలి వ్యక్తి చెప్పిన ప్రకారం మొదట రూ.వెయ్యి ఫోన్ పే ద్వారా వారికి పంపించాడు. దాంతో మంచి రిటర్న్స్ వచ్చినట్టు చూపించడంతో ఆ యువకుడు రేటింగ్ ఇవ్వడంతో పాటు తన సొంత డబ్బులను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి కోసం సైబర్ నేరగాళ్లకు పంపడం మొదలు పెట్టాడు.
విడతలవారీగా రూ.7.8లక్షలు
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట విద్యార్థిని బోల్తా కొట్టించగా, అధిక మొత్తంలో రిటర్న్స్ వస్తాయన్న ఆశతో అతడు సైబర్ నేరస్తులకు డబ్బులు పంపించడం స్టార్ట్ చేశారు. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ 29న రూ.లక్ష పంపించాడు. క్రిప్టో అకౌంట్ లో చూపించిన మొత్తం డ్రా చేసుకోవాలంటే మరిన్ని డబ్బులు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు సూచించగా, ఆ వెంటనే రూ.79 వేలు ట్రాన్స్ ఫర్ చేశాడు.
ఆ తరువాత మళ్లీ వివిధ రకాల సాకులు చెబుతూ ఆ యువకుడి నుంచి మొత్తంగా రూ.7,83,500 ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. కానీ అందులో అమౌంట్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం, తరచూ డబ్బులు పంపించాలంటూ మెసేజ్ లు వస్తుండటంతో బీటెక్ విద్యార్థి తాను మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే వరంగల్ కమిషనరేట్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కమలాపూర్ మండల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన సైబర్ వింగ్ అధికారులు… కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా అధిక లాభాలకు ఆశపడి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి మోస పోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.