Best Web Hosting Provider In India 2024

హిట్ 2 లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసిన హిట్ 3.. నాని మూవీకి రెండో రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
హిట్ ది థర్డ్ కేస్ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ వసూళ్లు: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ హిట్ 3 కలెక్షన్ల రికార్డు కొనసాగిస్తోంది. రెండో రోజు కలెక్షన్లు కాస్త తగ్గినా హిట్ 2 లైఫ్ టైమ్ కలెక్షన్లను హిట్ 3 దాటేసింది. ఈ మూవీకి సెకండ్ డే ఎన్ని కోట్లు వచ్చాయో ఇక్కడ తెలుసుకోండి.
నాని కొత్త సినిమా ‘హిట్ 3’ కలెక్షన్లు రెండో రోజు తగ్గాయి. శుక్రవారం (మే 2) ఈ మూవీ కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండో రోజు రూ.10 కోట్ల నెట్ వసూలు చేసినట్లు సక్నిల్క్.కామ్ వెల్లడించింది. నాని నటించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గురువారం (మే 1) థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే.
రెండు రోజుల్లో
నాని లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ రెండు రోజుల్లో కలిపి ఇండియాలో రూ.31 కోట్ల నెట్ వసూలు చేసింది. ఈ చిత్రం మొదటి రోజు రూ.21 కోట్లు రాబట్టింది. తెలుగులో రూ.20.25 కోట్లు; తమిళంలో రూ.35 లక్షలు; కన్నడలో రూ.5 లక్షలు; హిందీలో రూ.25 లక్షలు; మలయాళంలో రూ.లక్ష వసూలు చేసింది. రెండవ రోజు ఇండియాలో రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో రెండు రోజుల కలెక్షన్స్ రూ.31 కోట్లకు చేరింది. వీకెండ్ కాబట్టి శని, ఆదివారాల్లో నాని మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశముంది.
హిట్ 2ను దాటేసి
బాక్సాఫీస్ కలెక్షన్లలో హిట్ 2 లైఫ్ టైమ్ వసూళ్లను హిట్ 3 రెండు రోజుల్లో దాటేసింది. అడవి శేష్ హీరోగా యాక్ట్ చేసిన హిట్ 2 ఇండియాలో మొత్తం రూ.25 కోట్లు కలెక్ట్ చేసిందని సక్నిల్క్ వెబ్ సైట్ తెలిపింది. ఇప్పుడీ కలెక్షన్స్ ను హిట్ 3 బ్రేక్ చేసింది. హిట్ ఫ్రాంఛైజీలోని హిట్: ది ఫస్ట్ కేస్ (2020) రెండవ రోజు రూ.2.01 కోట్లు వసూలు చేసింది. అయితే హిట్: ది సెకండ్ కేస్ (2022) రెండవ రోజు రూ.5.35 కోట్లు వసూలు చేసింది. హిట్ ది థర్డ్ కేస్ బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఫ్రాంచైజీలోని మునుపటి చిత్రాలను మించిపోయాయి.
ఇక నాని చివరి చిత్రం సరిపోదా శనివారం (2024) రెండవ రోజు కలెక్షన్లు రూ.5.85 కోట్లుగా ఉన్నాయి. Sacnilk.com డేటా ప్రకారం హిట్ 3 రెండు రోజుల్లోనే మిగతా రెండు హిట్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్లను అధిగమించింది. హిట్ ఇండియాలో రూ.8 కోట్లు, హిట్ 2 రూ.25 కోట్లు వసూలు చేశాయి.
క్రైమ్ థ్రిల్లర్
హిట్ 3 మూవీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మూవీలో నాని నెవర్ బిఫోర్ యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు. అర్జున్ సర్కార్ కు రక్తపాతం పారించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. హిట్ ది థర్డ్ కేస్ లో శ్రీనిధి శెట్టి, అదిల్ పాల, రావు రమేష్, బ్రహ్మజీ, మాగంటి శ్రీనాథ్ కూడా నటించారు. ఇది హిట్ యూనివర్స్ లో మూడవ చిత్రం. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్ అందించారు. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై దీన్ని నిర్మించారు.