




Best Web Hosting Provider In India 2024
అనాథలను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్న ‘నైస్’.. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆహ్వానం
ఎందరో అనాథలను అక్కున చేర్చుకుని ఈ విద్యా సంస్థ అమ్మ ప్రేమను పంచుతోంది. విద్యాబుద్ధులు నేర్పిస్తూ భవితకు బంగారు బాటలు వేస్తోంది. 2 దశాబ్దాలుగా ఎందరో బాలల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అదే పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో ఉన్న నైస్. ఈ విద్యా సంవత్సరం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
జీవితంలో ఎవరూ లేకున్నా.. కావాల్సింది చదువు అని బలంగా నమ్మారు పోపూరి పూర్ణచంద్రరావు. అందుకే నైస్ విద్యాసంస్థను స్థాపించారు. అనాథలు, వీధి బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించి.. 2003 ఆగస్టు 15న నైస్‌ను ప్రారంభించారు. ఈ 23 ఏళ్లలో వందల మంది పిల్లలకు విద్యాబుధులు నేర్పించి ప్రయోజకులను చేశారు. ఇప్పుడు ఇక్కడ 150 మంది బాలబాలికలు ఉన్నారు. వారికి వేర్వేరుగా వసతి గృహాలున్నాయి. వాటిల్లో ఉత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయి.
చదువు.. ఆటలు..
ఇక్కడ సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తున్నారు. కంప్యూటర్, సైన్స్, గణితం ల్యాబ్‌లతోపాటు ఇక్కడున్న గ్రంథాలయంలో నాలుగు వేల పుస్తకాలున్నాయి. యూనిఫామ్, భోజనం, పుస్తకాలు, వసతి సదుపాయాలన్నీ ఉచితంగా అందిస్తారు. విద్యాబోధనే కాకుండా సువిశాల మైదానంలో బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్, కబడ్డీ తదితర ఆటల్లో శిక్షణనిస్తున్నారు. ఇండోర్ గేమ్స్‌ను కూడా నేర్పుతారు. ఎక్కడా తగ్గకుండా విద్యార్థులకు అన్ని సమకూర్చుతారు.
ప్రాధాన్యత ఇలా..
నైస్ విద్యా సంస్థలో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యమిస్తారు. తల్లిని కోల్పోయిన వారికి రెండో ప్రాధాన్యం ఉంటుంది. తండ్రిని కోల్పోయిన వారిని మూడో ప్రాధాన్యంగా చేర్చుకుంటారు. ఈ పాఠశాలలో 5, 6 తరగతుల్లోనే ప్రవేశాలుంటాయి. ఐదో తరగతిలో ప్రవేశం కోసం పదేళ్లు నిండిన బాలబాలికలు అర్హులు.
ప్రవేశ పరీక్షతో..
ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూలతో ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు చేయడానికి ఆధార్‌కార్డు, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా కావాలి. మే నెల నాలుగో ఆదివారం, జూన్ మొదటి ఆదివారం రెండుసార్లు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రవేశాల కోసం 9866034579, 6309881257 నంబర్లలో సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచించారు.
దాతల సాయంతో..
‘బాలలకు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించి.. ఆ దిశగా మార్గనిర్దేశం చేస్తున్నాం. దాతల సాయంతో పాఠశాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఐదు నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నాం. ఇంటర్, డిగ్రీ, పీజీలు పూర్తయ్యేవరకూ వారికి సహకారం అందిస్తాం. ఏ ప్రాంతం వారైనా ఇక్కడ చేరవచ్చు. నైస్‌లో బోధించే ఉపాధ్యాయులకు వేతనంతోపాటు.. ఉచిత వసతి, భోజనం సమకూరుస్తున్నాం. ఆసక్తి, అనుభవం ఉన్నవారెవరైనా పై ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు’ అని వ్యవస్థాపకులు పోపూరి పూర్ణచంద్రరావు వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్