




Best Web Hosting Provider In India 2024
ప్రతి నెలా రూ.50 కోట్లు వసూలు.. ఆ డబ్బంతా ఎవరికి ఇచ్చారు.. రాజ్ కసిరెడ్డిపై ప్రశ్నల వర్షం!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రెండో రోజు కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కసిరెడ్డిని వారం రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. తొలి రోజు 7 గంటల పాటు రాజ్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు.
మద్యం సరఫరా, డిస్టిలరీలపై రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రతి నెలా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎలా వసూలు చేశారు.. ఆ సొమ్మంతా ఏయే రూపాల్లో ఎవరికిచ్చారు.. ప్రధాన సూత్రధారి ఎవరంటూ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ్టి నుంచి కేసులో ఏ8గా ఉన్న చాణక్యను కూడా ప్రశ్నించనున్నారు. ముందు విడివిడిగా.. ఆ తర్వాత ఇద్దరినీ కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది.
7 గంటల పాటు..
రాజ్ కసిరెడ్డిని వారం రోజుల పాటు సిట్ కస్టడీకి ఇవ్వటంతో.. తొలి రోజు 7 గంటల పాటు విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ ప్రశ్నించారు. దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా వివరాలు రాబట్టారు. చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానాలిచ్చినా.. తమ వద్దనున్న ఆధారాలు, కాల్‌డేటా రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు చూపించి ప్రశ్నించారు.
కస్టడీకి చాణక్య..
తొలి రోజు విచారణకు రాజ్ కసిరెడ్డి పూర్తిస్థాయిలో సహకరించలేదని తెలుస్తోంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్లలో రాజ్ కసిరెడ్డి తరఫున కీలకంగా బూనేటి చాణక్య వ్యవహరించారు. ఈ కేసులో ఆయన ఏ8 గా ఉన్నారు. చాణక్యను శనివారం నుంచి ఈ నెల 7వరకూ సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
మరొకరు అరెస్టు..
మద్యం కుంభకోణం కేసులో తాజాగా అరెస్టైన రాజ్ కసిరెడ్డి ప్రధాన అనుచరుడు పి.దిలీప్‌ను 30వ నిందితుడిగా సిట్ చేర్చింది. చెన్నై విమానాశ్రయంలో ఆయన్ను అరెస్టు చేసిన సిట్ అధికారులు.. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. న్యాయాధికారి ఈ నెల 6వ తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టైన వారందరికీ మే 6 వరకే రిమాండ్ విధించారు. ఇటు దిలీప్‌ను కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేయనుంది.
రాజ్ కసిరెడ్డే కీలకం..
రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు. అతను అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా పనిచేసిన సమయంలో.. తన పలుకుబడిని ఉపయోగించి ఇష్టమొచ్చిన బ్రాండ్లను విక్రయించేలా విధానాలు మార్చారని ఆరోపణలు ఉన్నాయి. దీని ద్వారా నెలకు రూ. 50 నుంచి 60 కోట్ల చొప్పున, నాలుగేళ్లలో రూ. 3,200 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ముఖ్యంగా తక్కువగా తెలిసిన బ్రాండ్లకు ఎక్కువ ఆర్డర్లు వచ్చేలా చేసి.. వాటి ద్వారా రాజ్ కసిరెడ్డి భారీగా లంచాలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బును కొందరు వైసీపీ నాయకులకు, బినామీ కంపెనీలకు తరలించారని కూడా సిట్ అనుమానిస్తోంది. ఈ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారి అని సిట్ భావిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్