




Best Web Hosting Provider In India 2024
మన ప్రగతి రథం చాలా స్మార్ట్ గురూ.. అందుబాటులోకి క్యూఆర్ కోడ్ కీచైన్లు!
మారుతున్న కాలానికి అనుగుణంగా.. ప్రగతి రథం పరుగులు పెడుతోంది. ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తూనే.. సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ప్రయాణికుల కోసం అనేక రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా క్యూఆర్ కోడ్ కీచైన్లతో మరింత స్మార్ట్ అయ్యింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఆర్టీసీ.. దేశంలోనే స్మార్ట్‌గా మారుతోంది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు తరలిస్తూ.. మెరుగైన సేవలందించడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ప్రగతి రథం.. ప్రజా సేవాపథం అనే నినాదంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే చిల్లర కొరతను అధిగమించడానికి క్యాష్ లెస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
అరచేతిలో పూర్తి సమాచారం..
తెలంగాణ ఆర్టీసీ తాజాగా.. ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉన్న కీచైన్లను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని స్కాన్ చేస్తే పూర్తి సమాచారం మన అరచేతిలో ఉంటుంది. ప్రస్తుతం ప్రతీఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దీంతో అందుకు తగ్గట్టు ఆర్టీసీ సమాచారాన్ని చేరువ చేస్తోంది. ఆర్టీసీ ప్రత్యేకంగా తయారు చేసిన కీచైన్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్ చేయగానే.. స్క్రీన్‌పై సంస్థ అందించే సేవలు కనిపిస్తాయి.
10 రకాల యాప్‌లు..
ఈ క్యూఆర్ కోడ్ కీచైన్లలో.. పది రకాల యాప్‌లు ఉంటాయి. గమ్యం యాప్ ద్వారా మనం ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుంది, గమ్యానికి ఎప్పుడు చేరుకోవచ్చు, ఇతర వివరాలు తెలుసుకోవడానికి వీలుంటుంది. కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్, గమ్యం యాప్, ఆన్‌లైన్ బుకింగ్ యాప్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సప్ ఛానల్, యూట్యూబ్ లాంటివి కనిపిస్తాయి.
కావాల్సిన వివరాలు ప్రత్యక్షం..
మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో మన వివరాలు పొందుపరిస్తే.. దీన్ని వినియోగించుకోవడం మరింత సులభమవుతోంది. సలహాలు, సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వివాహాది శుభకార్యాలతోపాటు.. విహార యాత్రలకు బస్సులను రాయితీ విధానంలో బుక్ చేసుకొనే విధానం కూడా అందుబాటులో ఉంది. ఫోన్‌లో గూగుల్ ఓపెన్ చేసి.. పైన కనిపిస్తున్న కెమెరాపై క్లిక్ చేయాలి. అనంతరం కీచైన్‌పై రూపొందించిన క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేస్తే కావాల్సిన వివరాలు ప్రత్యక్షమవుతాయి.
ప్రజలకు మరింత చేరువయ్యేలా..
ఆర్టీసీ.. కీచైన్లను ప్రయాణికులకు బహుమతుల రూపంలో ప్రత్యేక సందర్భాల్లో అందజేస్తుంది. ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండటం, మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా.. క్యూఆర్ కోడ్‌తో ఉన్న కీచైన్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇలాంటిది లేదని అంటున్నారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చర్యలు చేపడతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్