




Best Web Hosting Provider In India 2024

మోదీ తీరు చూస్తే.. చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదు.. వైఎస్ షర్మిల సెటైర్లు
అమరావతి పునః నిర్మాణ పనులను ప్రధాని ప్రారంభించారు. మోదీ అమరావతి పర్యటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సెటైర్లు పేల్చారు. గతంలో మట్టి కొట్టారు. ఇప్పుడు సున్నం కొట్టి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఆంధ్రులకు తీరని ద్రోహం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు నిధులు అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం.. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. మరి ప్రధాని మోదీ ఇస్తున్నది ఏమిటి? అని ప్రశ్నించారు. ఆనాడు 2015లో మట్టి కొట్టారు.. నేడు సున్నం కొట్టి వెళ్లారని ఎద్దేవా చేశారు.
అవే అబద్ధాలను అందంగా చెప్పారు..
’10 ఏళ్ల కిందట ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారు. మళ్లీ అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం అంటూ బూటకపు మాటలు చెప్పారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్ని చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారు. అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు?’ అని షర్మిల ప్రశ్నించారు.
మోదీని నమ్మి మోసపోతున్నాం..
‘అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా? కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా? పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా? చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోదీని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నట్లు తెలుసుకోవాలి. ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి.. ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు.. మళ్ళీ మోదీని పిలిచి అదే గోతిలో పగలు పడ్డారు’ అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు సమాధానం చెప్పాలి..
‘ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు..నిధులు. రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అప్పు పుట్టనిదే జీతాలకు దిక్కులేదని చెప్పే మీరు.. రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి రూ.60 వేల కోట్లు అప్పు తెస్తున్నారు? వడ్డీల భారం మోసేదెలా? వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కోల దగ్గర రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు? ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తి. వాటిని అమ్మి రాజధాని ఎలా కడతారు? కేంద్రం మెడలు వంచే దమ్ములేక.. భావితరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.
అందరికీ ధన్యవాదాలు..
‘ప్రధాని చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజల సహకారంతో, కేంద్ర మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి.. మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అని తెలుపుతూ…ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం
టాపిక్