





Best Web Hosting Provider In India 2024

ఇన్ని రోజులు ఏం చేశారు.. సీఎం దగ్గర ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్.. ఒక్కొక్కరితో పర్సనల్‌గా భేటీ!
కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి.. సీఎం దూకుడుగా దూసుకెళ్తున్నారు. కానీ.. కొందరు ఎమ్మెల్యేలు ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావొస్తుంది. ఇప్పుడే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగిందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో సీఎం ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి.. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఏం చేశారనే దానిపై సమీక్షలు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు నియోజకవర్గంలో ఉంటున్నారు.. ప్రజలను కలుస్తున్నారా.. ఎన్నికల సమయంలో లోకల్‌గా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా.. అనే అంశాలపై సీఎం రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా సమీక్ష చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
9 ముఖ్యమైన అంశాలు..
1.సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు ప్రారంభించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు.. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో ఏమేం పనులు చేశారు, ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రచారం చేశారని ఆరా తీస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం చేసిన కార్యక్రమాల వివరాలు సేకరిస్తున్నారు.
2.నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకునేందుకు ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా భేటీ అవుతానని.. జపాన్ పర్యటనకు వెళ్లేముందు జరిగిన సీఎల్పీ సమావేశంలో రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగా గురువారం నాడు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
3.సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు ముందుగా.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. అందరినీ ఒకేసారి కూర్చోపెట్టి మాట్లాడకుండా.. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు.
4.నియోజకవర్గంలోని సమస్యలు, రాజకీయ పరిస్థితులపై సీఎం నేరుగా చర్చించారు. ఈ 17 నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన నిధులు వివరాలను సదరు ఎమ్మెల్యేల ముందు పెట్టినట్లు సమాచారం.
5.ప్రభుత్వం తరపున ఇన్ని కార్యక్రమాలు చేశాం.. మీరు ఏం చేశారో చెప్పండి? పథకాల ప్రచారం కోసం ఏమేం కార్యక్రమాలు చేశారు? ఎన్ని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. ఎక్కడ పాదయాత్రలు చేపట్టారు? పార్టీ కార్యకర్తలతో ఎన్ని సార్లు మీటింగ్ జరిపారు? అనే వివరాలను పేపర్‌పై రాసివ్వాలని సీఎం అడిగినట్టు సమాచారం.
6.రానున్న కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో లిఖితపూర్వకంగా రాసివ్వాలని.. ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. అలాగే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపైనా ఆరా తీసినట్లు సమాచారం.
7.కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంపై దృష్టి పెట్టకుండా.. తమకు తెలిసిన కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేయాలని సీఎం ముందు ప్రస్తావించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. సీఎం బిల్లుల విషయాన్ని పట్టించుకోకుండా.. నియోజకవర్గంలో ఇంకా చేపట్టాల్సిన పనులను వివరించాలని మందలించినట్టు తెలిసింది.
8.ఈ ఏడాది జూన్ 2లోపు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయ్యేందుకు ముఖ్యమంత్రి ప్లాన్ చేసుకున్నారు. ఆ తరువాత ఎమ్మెల్యేల అభ్యర్థనల మేరకు.. నియోజకవర్గంలోని పెండింగ్ పనులు పూర్తి చేయడం, కొత్త పనులను ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిసింది.
9.ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక, పార్టీ పరంగా పనిచేసే టీమ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీఎం సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం ముఖాముఖీ మీటింగ్ నేపథ్యంలో.. కొందరు ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొందనే ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్