





Best Web Hosting Provider In India 2024

చవకగా వచ్చాయని సెకండ్ హ్యాండ్ బట్టలు కొన్నాడు, చివరికి ఆసుపత్రి పాలయ్యాడు
కొంతమంది చవకగా వస్తాయని సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని ధరిస్తూ ఉంటారు. అలా సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకోవడం వల్ల ప్రమాదకరమైన చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
పాత బట్టలను కొని వాటిని చవక ధరకే అమ్మే వ్యాపారులు ఎంతోమంది ఉన్నారు. అవే సెకండ్ హ్యాండ్ బట్టలు. ఇవి తక్కువ ధరకు వస్తాయి… కాబట్టి ఆ బట్టలు కొనేందుకు సిద్ధంగా ఉండే వారి సంఖ్య కూడా ఎక్కువే.
ఒక అమెరికన్ వ్యక్తి అలా చవకైనా సెకండ్ హ్యాండ్ బట్టలు కొని ఆసుపత్రి పాలయ్యారు. తన కథను సోషల్ మీడియా ద్వారా బయటికి వెల్లడించాడు. తనలాగా ఎవరు సెకండ్ హ్యాండ్ బట్టలు కొని ఇబ్బంది పడవద్దు అని చెప్పాడు.
స్కిన్ ఇన్ఫెక్షన్ సోకి
అమెరికాలో టిక్ టాక్ యూజర్ ఒక వ్యక్తి సెకండ్ హ్యాండ్ బట్టలు కొని ధరించాడు. కొన్ని రోజులకే అతనికి స్కిన్ ఇన్ఫెక్షన్ సోకింది. ఆ బట్టల్లో ఉన్న మొలస్కాం కాంటాజియోసమ్ అనే వైరస్ చర్మంపై చేరి సమస్యలు సృష్టించింది. ఈ వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్స్ సోకి చిన్న చిన్న గడ్డలు చర్మంపై రావడం మొదలయ్యాయి. ముఖం మొత్తం గడ్డలు వచ్చాయి.
పాత, వాడని బట్టల్లో ఇలాంటి వైరస్లు ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. ముఖాన్ని అంద విహీనంగా చేస్తుంది. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ నొప్పి లేకుండానే ఉంటుంది. కానీ చర్మాన్ని మాత్రం మచ్చలతో, బొబ్బలతో అందవికారంగా మార్చేస్తుంది. దీనికి సరైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఆసుపత్రికి వెళ్తే వైద్యులు సరైన మందులను సూచిస్తారు.
ఉతికాకే ధరించండి
సెకండ్ హ్యాండ్ బట్టలు కొన్న వారు వాటిని ఉతకకుండా ధరించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా, ఫంగల్, వైరస్ వంటి పరాన జీవులు ఈ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. ఇవి గజ్జికి, ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా కలిగిస్తాయి. కొత్త బట్టలైనా, పాత బట్టలైనా మీరు ఒకసారి ఉతికిన తర్వాతే వాటిని ధరించాలి. లేకుంటే వాటిలో ఉండే వైరస్ లు తీవ్ర అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు.
వైద్యులు చెబుతున్న ప్రకారం బట్టలలో ఉపయోగించే రంగులు పూర్తిగా కలిసిపోకుండా కొన్ని చర్మానికి అతుక్కొని అలెర్జీలకు కారణమవుతాయి. కొన్ని బట్టలలో ప్రమాదకరమైన రసాయనాలు కూడా ఉంటాయి. వీటికి చర్మం తగిలినప్పుడు అవి ఆ చర్మం లోకి ఇంకి ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి.
ఇతను టిక్ టాక్ లో చేసిన వీడియో ఇంటర్నెట్లో అమెరికాలో సంచలనగా మారింది. దాదాపు పది లక్షల మంది ఆ వీడియోను చూశారు. ఆ వీడియోలో అతని ముఖం బొబ్బలతో నిండిపోయి ఉంది. కొంతమంది యూజర్లు ‘బట్టలు ఉతికి వేసుకోవచ్చుగా’ అని సలహాలు ఇచ్చారు. మరొక యూజర్ ‘నాకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. కొత్త బట్టలు కూడా ఉతికే వేసుకుంటాను’ అని కామెంట్లో చేశారు.
నిజానికి మీరు కొత్త బట్టలైనా పాత బట్టలైనా ఉతికిన తర్వాతే వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లలకు బట్టలు వేసే ముందు చాలా జాగ్రత్తగా.. వాటిని పరిశుభ్రంగా ఉతికిన తర్వాతే వేయండి.